భూతాప నియంత్రణలో రాజకీయ సంకల్పమే కీలకమని రెండేళ్ల క్రితం జీ20 దేశాల శిఖారాగ్ర సదస్సులో(G20 summit) ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటొనియో గుటెరెస్ స్పష్టీకరించారు. పోనుపోను అది పలుచనైపోతుండటమే అసలు సమస్య అని ఆయన అప్పట్లో ఆందోళన వ్యక్తంచేశారు. తాజా రోమ్ సదస్సు సైతం వాతావరణ మార్పులపై మొక్కుబడి తీర్మానాలతోనే ముగిసిపోయింది. శతాబ్ది మధ్య నాటికి నెట్‌జీరో(కర్బన తటస్థత)ను సాధించగలమన్న జీ20 దేశాధినేతల ఉమ్మడి ప్రకటనలో- కర్బన ఉద్గారాలకు కళ్లెం బిగించే స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికే కొరవడింది. బొగ్గు ఆధారిత నూతన విద్యుత్కేంద్రాలకు ఈ సంవత్సరాంతం నుంచి అంతర్జాతీయ ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలని నేతలు నిర్ణయించారు. వర్ధమాన దేశాల స్వచ్ఛ ఇంధన లక్ష్యాల సాఫల్యానికి ఏటా సుమారు రూ.7.5లక్షల కోట్లను సమకూరుస్తామని వారు పునరుద్ఘాటించారు. దేశీయంగా బొగ్గు వినియోగాన్ని కట్టడి చేయాలంటే అణుశక్తి సరఫరాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో తనకు స్థానం కల్పించాల్సిందేనని ఇండియా స్పష్టంచేసింది.
అణు విద్యుత్కేంద్రాల స్థాపన, నిర్వహణలలో సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడానికి ఎన్‌ఎస్‌జీతో భాగస్వామ్యం ఉపయుక్తం అవుతుందని పేర్కొంది. స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులకు ప్రత్యేక నిధి, పరిశోధన సంస్థల వ్యవస్థ, హరిత ఉదజనిపై అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పాలన్న ప్రధాని మోదీ- ప్రపంచ సరఫరా గొలుసును విస్తృతపరచేందుకు జీ20 దేశాలు ఇండియాలో(g20 summit india) పెట్టుబడులు పెట్టాలని పిలుపిచ్చారు. దేశీయ, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా వచ్చే ఏడాది చివరికల్లా 500 కోట్ల మోతాదులకు పైగా కొవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తామని ఆయన ప్రకటించారు. రాబోయే ఏడెనిమిది నెలల్లో ప్రపంచ జనాభాలో 70శాతానికి వ్యాక్సిన్లు అందేలా చొరవ తీసుకుంటామన్న జీ20 దేశాలు- మహమ్మారులపై సమష్టి పోరాటానికి ప్రత్యేక కార్యదళాన్ని కొలువుతీర్చాలని నిర్ణయించాయి. టీకాల పంపిణీలో దేశాల మధ్య అసమానతలను అరికట్టాలన్న సదస్సు సదాశయం సత్వరం సాకారమైతేనే- సర్వ మానవాళి సురక్షితమవుతుంది!