G20 Summit 2023 India Modi Editorial : కొవిడ్ మహమ్మారి విజృంభణ తరవాత ప్రపంచంలో చాలా పరిణామాలు తలెత్తాయి. ముఖ్యంగా మూడు మార్పులను మనం గమనించవచ్చు. అవి- స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) కేంద్రితం నుంచి మానవుడు ప్రధాన భూమికగా ప్రపంచాన్ని చూడాల్సిన అవసరం ఉందన్న భావన క్రమంగా అధికమవుతోంది. వైరస్ ప్రభావం నుంచి సరఫరా గొలుసులు త్వరగా కోలుకోవడం, వాటిలో విశ్వసనీయత పెరగాల్సిన ఆవశ్యకతను ప్రపంచం గుర్తిస్తోంది. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల ద్వారా వాటిలో మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం పెంచాలన్న డిమాండు పెద్దఎత్తున వినిపిస్తోంది. జీ20 అధ్యక్ష స్థానం నుంచి ఈ మూడు అంశాల పరంగా భారత్ కీలక పాత్ర పోషించింది.
నిర్మాణాత్మక వైఖరి..
2022 డిసెంబరులో ఇండొనేసియా నుంచి జీ20 సారథ్యాన్ని భారత్ స్వీకరించినప్పుడు, ఆలోచనా విధానంలో మార్పు తేవడానికి ఈ కూటమి ఉత్ప్రేరకంగా నిలవాలని నేను పిలుపిచ్చాను. ముఖ్యంగా వర్ధమాన దేశాల ఆకాంక్షలకు మన్నన దక్కాలనుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఇది చాలా కీలకం. భారత్ జీ20 నేతృత్వంలో జరిగిన 'వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయా దేశాల నుంచి ఆలోచనలను పంచుకోవడంలో ఇది ఎంతగానో తోడ్పడింది. ఇందులో 125 దేశాలు పాలుపంచుకున్నాయి. జీ20కి ఇండియా అధ్యక్షత వహించిన కాలంలో ఆఫ్రికా దేశాలకు సమధిక ప్రాధాన్యం దక్కింది. ఆఫ్రికన్ సమాఖ్యకు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు భారత్ చొరవ చూపింది. పరస్పరం అనుసంధానమైన ప్రపంచం అంటే.. ఆయా రంగాల్లో మన సవాళ్లు సైతం ఒకే విధంగా ఉంటాయి. 2030 నాటికి సాధించాల్సిన పలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డీజీలను) ఐక్యరాజ్య సమితి నిర్దేశించింది. ఎస్‌డీజీలకు సంబంధించిన పురోగతి గాడి తప్పడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ పురోగతిని వేగవంతం చేయడానికి ఈ ఏడాది జీ20 రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఆయా దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది.
ప్రకృతితో మమేకమై జీవించడం అనాదిగా భారత్‌లో ఆనవాయితీగా వస్తోంది. ఆధునిక కాలంలోనూ వాతావరణ మార్పులను కట్టడి చేయడంలో భారత్ తనవంతు పాత్ర పోషిస్తోంది. చాలా వర్ధమాన దేశాలు అభివృద్ధి పరంగా వివిధ దశల్లో ఉన్నాయి. పర్యావరణ మార్పులను నిలువరించడానికి వాటికి అగ్రరాజ్యాలు సరైన ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉంది. కేవలం వాతావరణ మార్పులను నిలువరించాలంటూ లక్ష్యాలు నిర్దేశించుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. దానికోసం సమధిక నిధులు కేటాయించాలి. సాంకేతికతలను పరస్పరం బదిలీ చేసుకోవాలి. వాతావరణ మార్పులను నిలువరించడానికి ఏమి చేయకూడదు అనే నిర్బంధ వైఖరి నుంచి ఏమి చేయాలి అనే నిర్మాణాత్మక వైఖరి వైపు మళ్ళాల్సిన అవసరం ఉందని భారత్ విశ్వసిస్తోంది. సుస్థిర నీలి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చెన్నై ఉన్నత స్థాయి సూత్రాలు మన సముద్రాలను స్వచ్ఛంగా ఉంచేందుకు తోడ్పడతాయి. శుద్ధ, హరిత హైడ్రోజన్‌కు ప్రాధాన్యం దక్కడానికీ ఇండియా జీ20 సారథ్యం ఎంతగానో తోడ్పడింది. 2015లో భారత్ అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటు చేసింది. ప్రపంచ బయోఇంధన కూటమి ద్వారా, ఇంధన రంగంలో మేలిమి మార్పులకు ఇండియా సహకరిస్తోంది.
తమ దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు రోజువారీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ విధంగానే, భూగోళ ఆరోగ్యానికి నష్టం వాటిల్లకుండా వారు తమ జీవనశైలి విషయంలోనూ నిర్ణయాలు తీసుకోగలరు. కాబట్టి, వాతావరణ పరమైన కార్యాచరణను ప్రజాస్వామ్యీకరించుకోవడమే మేలైన మార్గం. సమగ్ర ఆరోగ్యం కోసం యోగాను ప్రపంచ ఉద్యమంగా మార్చినట్లే... 'సుస్థిరాభివృద్ధి కోసం జీవనశైలి (లైఫ్)' దిశగా ప్రపంచాన్ని నడిపిస్తున్నాం. వాతావరణ మార్పుల వల్ల ప్రజలందరికీ ఆహార, పోషకాహార భద్రతను కల్పించడం ఎంతో కీలకంగా మారింది. చిరుధాన్యాలు లేదా శ్రీఅన్న ఇందుకు దోహదపడతాయి. ప్రస్తుత అంతర్జాతీయ సిరిధాన్యాల సంవత్సరంలో వీటిని ప్రపంచానికి రుచి చూపించాం. సాగుకూ ఇవెంతో అనుకూలం. 'ఆహార భద్రత, పోషకాహారంపై దక్కన్ ఉన్నతస్థాయి నియమాలు' కూడా ఈ దిశగా తోడ్పడుతున్నాయి.