తెలంగాణ

telangana

ETV Bharat / opinion

నగరాల భవిష్యత్తు.. ఈమె చెబుతుంది! - ఫ్యూచరిస్ట్​ కరుణా గోపాల్​ కథనం

మనదేశం చాలా మారాలండీ... మన నగరాలు చాలా అభివృద్ధి చెందాలండీ...ఇతర దేశాల్లో చూడండి... ఎలాంటి మార్పులు వస్తున్నాయో... ఇలాంటి కబుర్లు చాలామంది చెబుతారు. కానీ ఫ్యూచరిస్టులు అలా కాదు... ఏం మారాలో చెబుతారు... ఎలా మారాలో చెబుతారు... అందుకు ఏం చేయాలో కూడా చెబుతారు. ప్రపంచంలో జరుగుతున్న మార్పుల ఆధారంగా జరగబోయే పరిణామాలను అంచనా వేసి సమాజాన్ని సిద్ధం చేస్తారు. ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేస్తారు. అలా దేశంలోనే పేరున్న ఫ్యూచరిస్టుల్లో కరుణాగోపాల్‌ ఒకరు. దేశాల నగరీకరణపై ప్రభుత్వాలకు సలహాలిచ్చే ఈమె ప్రతిష్ఠాత్మక స్కోచ్‌ ఛాలెంజర్‌ అవార్డునూ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమేం చేశారో తెలుసుకుందాం.

నగరాల భవిష్యత్తు.. ఈమె చెబుతుంది!
నగరాల భవిష్యత్తు.. ఈమె చెబుతుంది!

By

Published : Jan 21, 2021, 7:02 AM IST

మరో దశాబ్ద కాలంలో హైదరాబాద్‌ నగరం ఎలా ఉంటుంది? వైజాగ్‌, చెన్నై, ముంబయి, దిల్లీ ఇలా దేశంలోని ప్రధాన నగరాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. వాటికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు అవసరం అవుతాయి? ఈ విషయాలపై రెండు దశాబ్దాలుగా కృషిచేస్తున్నారు ‘ఫ్యూచరిస్టిక్‌ సిటీస్‌’ స్థాపకురాలు కరుణాగోపాల్‌. ప్రపంచబ్యాంకు, ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు, అమెరికాకు చెందిన ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తూ.. నగరాల్లో రావాల్సిన మార్పులపై దృష్టి పెట్టారామె. ముఖ్యంగా పర్యావరణం, తాగునీరు, నగరభద్రత, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు వంటి విషయాల్లో ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

ఇదీ ప్రస్థానం

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన జవహర్‌లాల్‌ అర్బన్‌ రెన్యువల్‌ మిషన్‌కు సాంకేతిక సలహాదారుగా పనిచేశారు. ముసోరీలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా, వరల్డ్‌ బ్యాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పట్టణాలు, నగరాల్లో రావాల్సిన మార్పులపై ఐఏఎస్‌ అధికారులకు గత ఇరవై సంవత్సరాలుగా పాఠాలు చెబుతున్నారామె.

మనదేశానికి థాట్‌ లీడర్‌షిప్‌ అవసరం చాలా ఉంది. ఇందుకు మీకో ఉదాహరణ చెబుతాను. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ బాంబుపేలుళ్లు జరిగినప్పుడు నేరస్థులను పట్టుకోవడానికి ఫోన్‌కాల్స్‌ని ట్రేస్‌ చేయాల్సి వచ్చింది. అప్పటికి ఇప్పుడున్నంత సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఆరులక్షల అనుమానిత ఫోన్‌కాల్స్‌ నుంచి ఆరుగురుని వెలికితీయడానికి క్రైమ్‌ ఎనలటిక్స్‌ విధానం వాడాను. అంటే నగర భద్రతకు ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం అనేదానికి అప్పట్లోనే ఒక ప్రొటోటైప్‌ని తయారుచేశాను. -కరుణాగోపాల్‌, ఫ్యూచరిస్టు

అలాగే మీకో తాజా ఉదాహరణ చెబుతాను. కొవిడ్‌ నేపథ్యంలో రావాల్సిన ఆవిష్కరణల గురించి ఇటీవల దేశంలోని ఐఐటీ డైరెక్టర్లందరికీ సంబంధించి ఒక సమావేశం జరిగింది. అందులో కొవిడ్‌ రోగుల కోసం వెంటిలేటర్‌, రెస్పిరేటర్లని కలిపిన ఏదైనా ఆవిష్కరణ చేస్తే అది బలహీనపడ్డ కొవిడ్‌ రోగులకు మేలు చేస్తుందనిపించింది. ఇదే విషయాన్ని అక్కడున్న వారికి వివరించాను. ప్రస్తుతం కొంతమంది డాక్టర్లు దీన్ని తయారు చేయడం సంతోషం కలిగించింది. -కరుణాగోపాల్‌, ఫ్యూచరిస్టు

’నేను పుట్టింది మచిలీపట్నంలోనే అయినా నాన్న ఐఏఎస్‌ కావడంతో చాలా ప్రాంతాలు తిరిగాను. నాకు 17 ఏళ్లు వచ్చేనాటికే ఆయన చనిపోయారు. కానీ ఇంటర్నేషనల్‌లా, క్రిమినల్‌లా ఇలా వేర్వేరు చదువుల్లో 13 బంగారు పతకాలు పొందారు నాన్న. ఏం చదివినా ఎంత చదివినా దేశానికే సేవ చేయాలనేవారు. బీయెస్సీ జెనిటిక్స్‌ చదివిన తర్వాత ఐటీ రంగంలో అడుగుపెట్టాను. విదేశాల్లో ఉండే అవకాశం వచ్చినా మన దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఫ్యూచరిస్టిక్‌ సిటీస్‌ సంస్థను స్థాపించి నగరాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నా’ అంటున్నారామె. గతంలో ఈ అవార్డుని ...మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా, శామ్‌పిట్రోడా, పి.చిదంబరం, సి.రంగరాజన్‌, నందన్‌నిలేకనీ వంటివారు అందుకున్నారు.

కొన్నేళ్ల క్రితం సింగపూర్‌లో అక్కడి బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ అథారిటీ సంస్థ పిలుపు మేరకు మన దేశం పర్యావరణ మార్పులని ఎదుర్కొంటున్న తీరుపై మాట్లాడాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల మనదేశంలో ఆధార్‌ కార్డుల ప్రక్రియ గురించి.. కొన్ని దేశాల్లో మన దేశంలోని ఏడువేలకోట్ల టర్నోవర్‌ దాటిన యూనికార్న్‌ స్టార్టప్‌ల గురించి... ఈ విషయాలు మనకు సామాన్యంగా అనిపించినా ఇంత పెద్ద దేశానికి ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి అని ఆశ్చర్యపోతుంటాయి ప్రపంచ దేశాలు. -కరుణాగోపాల్‌, ఫ్యూచరిస్టు

ఇదీ చూడండి:ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో రాష్ట్రానికి 4వ ర్యాంకు

ABOUT THE AUTHOR

...view details