దక్షిణ కొరియా, రష్యా, చైనాలు ఇప్పుడు జపాన్‌పై మండిపడుతున్నాయి. ఇష్టారాజ్యంగా పసిఫిక్ మహాసముద్రంలోకి అణు వ్యర్థ జలాలను (Japan Atomic Water) కొన్ని దశాబ్దాల పాటు వదిలిపెడతామంటే తామంతా ఏమైపోవాలని ప్రశ్నిస్తున్నాయి. 2011లో సంభవించిన భూకంపం కారణంగా ఫుకుషిమాలోని దైచీ అణువిద్యుత్ కర్మాగారం తీవ్రంగా దెబ్బతింది(Japan Nuclear Disaster). మూడు రియాక్టర్లు దాదాపు ధ్వంసమయ్యాయి. వాటిలోని ఇంధన రాడ్లు మరీ ఎక్కువ వేడెక్కకుండా 1.25 మిలియన్ టన్నుల సముద్రపు నీటిని రియాక్టర్లలోకి పంపారు. తరవాత అణు వ్యర్థాలతో నిండిన ఆ సముద్రజలాన్ని వెయ్యి స్టీలు ట్యాంకుల్లో నిల్వ ఉంచారు. 2023 నుంచి కొన్ని దశాబ్దాల పాటు ఆ జలాలను కొంతమేర శుద్ధిచేసి సముద్రంలోకి వదిలిపెడతామని జపాన్ చెబుతోంది. కొత్తగా మరిన్ని ట్యాంకులు నిర్మించేందుకు సరిపడా స్థలం తమ వద్ద లేదని అంటోంది. ఈ ప్రతిపాదన గతేడాదే వచ్చినా, అంతర్జాతీయ ఒత్తిడితో తగ్గిందనుకున్న జపాన్- మళ్ళీ పాత పాటే అందుకుంది. అమెరికా మినహా దాదాపుగా మిగిలిన దేశాలన్నీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. అణు వ్యర్థ జలాల వల్ల అమెరికాలోని అలాస్కా, హవాయి ప్రాంతాలకూ ముప్పు పొంచిఉన్నా- జపాన్‌కు అగ్రరాజ్యం వంతపాడుతోంది. జపాన్‌లోని మత్స్యకారులు, ఎగుమతిదారులు, తీరప్రాంత వాసులు సైతం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యర్థజలాల్లో అణుధార్మిక పదార్థాలు (Japan Nuclear Waste) ట్రీటియం, స్ట్రాంటియం-90, సి-14 వంటివి ఉంటాయి. ఇవి సముద్రజీవుల శరీరాల్లో, సాగర పర్యావరణ వ్యవస్థలో వేగంగా కలిసిపోయే ప్రమాదం ఉంది.
సముద్ర చట్టంపై 1958లో జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సు ఒక ఒడంబడికను ఆమోదించింది. అది 1962 సెప్టెంబరు 30 నుంచి అమలులోకి వచ్చింది. 'రేడియోధార్మిక వ్యర్థాలను పారేయడం ద్వారా సముద్రాలను కలుషితం చేయడాన్ని నిరోధించడానికి ప్రతి దేశం చర్యలు తీసుకోవాలి. అవి అంతర్జాతీయ సంస్థలు రూపొందించే ప్రమాణాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలి' అని అందులోని 25వ అధికరణ చెబుతుంది. 1958 నాటి 'సముద్రాల కాలుష్యంపై తీర్మానం' ప్రకారమే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ఏర్పడింది. 1996 నాటి లండన్ ప్రొటోకాల్‌పై చాలా దేశాలు సంతకాలు చేశాయి. దాని ప్రకారం ఐఏఈఏ నిర్దేశించిన ప్రమాణాలకు లోబడినవి తప్ప, ఇతర ఏ రకమైన అణువ్యర్థాలనూ సముద్రాల్లోకి వదలకూడదు. ఈ ప్రమాణాలను 1999లో ఐఏఈఏ మరోసారి నిర్వచించింది. ఐక్యరాజ్యసమితి ఒడంబడిక (యూఎన్ క్లాజ్)పై జపాన్, దక్షిణ కొరియా, చైనా, రష్యా సహా 160 దేశాలు సంతకాలు చేశాయి. అమెరికా దానికి దూరంగా ఉండిపోయింది. ఆ ఒడంబడిక ప్రకారం, సముద్రాలు మానవజాతి మొత్తానికి చెందుతాయి. అందులోని 195వ అధికరణ ప్రకారం ఏ దేశమూ కలుషిత పదార్థాలను సముద్రంలోకి వదలకూడదు. ప్రత్యక్షంగాగానీ పరోక్షంగాగానీ సముద్ర పర్యావరణానికి నష్టం కలిగించకూడదు. ఆ ఒడంబడికపై సంతకం చేసిన తరవాతా జపాన్ అణువ్యర్థాలతో కూడిన (తాము శుద్ధి చేసినట్లు చెబుతున్న) జలాలను సముద్రంలోకి వదులుతామని అంటోంది. నిర్దేశిత ప్రమాణాల మేరకు శుద్ధి చేశాకే జపాన్ ఆ జలాలను వదిలిపెడుతుందని అమెరికా చెబుతోంది. జర్మనీకి చెందిన ఒక సముద్ర పరిశోధన సంస్థ అంచనా ప్రకారం, అణువ్యర్థాలతో కూడిన జలాలను పసిఫిక్ సముద్రంలోకి వదిలిపెడితే, 57 రోజుల్లోనే రేడియోధార్మిక పదార్థాలు సముద్రజీవులన్నింటిలోకి వెళ్లిపోతాయి. దీనిపై సరిహద్దు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. జపాన్ మంకుపట్టు వీడకుంటే ఈ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాలు చేస్తామని దక్షిణ కొరియా ఇప్పటికే ప్రకటించింది.