ఆకాశమే హద్దు అన్నట్లు ఇంధన ధరలు రోజు రోజుకు గరిష్ఠ స్థాయులను నమోదు చేస్తున్నాయి. దేశంలో సగటున పెట్రోల్ ధర రూ.93కు డీజిల్ ధర రూ.85కు చేరింది. వాస్తవ ధరకు భారీగా కేంద్ర, రాష్ట్రాల పన్నులు తోడు కావడంతో అంతర్జాతీయంగా పెరుగుతున్నప్పుడల్లా ఇక్కడ ధరలు మండిపోతున్నాయి. ప్రభుత్వాలు పన్నులు తగ్గించేందుకు ఎంతమాత్రం సుముఖంగా లేకపోవడంతో ఇప్పట్లో ధరల మంట చల్లారే పరిస్థితులు కనిపించడం లేదు. కొత్త బడ్జెట్‌లో ప్రాథమిక, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం రేట్లు తగ్గిస్తూనే... తిరిగి దాన్ని భర్తీ చేసుకోవడంలో భాగంగా వ్యవసాయ మౌలిక వసతులు, అభివృద్ధి (ఏఐడీసీ) సెస్సును కేంద్రం విధించింది.
దేశంలో వినియోగిస్తున్న మొత్తం పెట్రో ఉత్పత్తుల్లో 20శాతమే ఇక్కడ లభిస్తుండగా మిగతా 80శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో అంతర్జాతీయ ధరల ప్రభావం మనమీద తీవ్రంగా ఉంటోంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరణ దశలో ఉన్న ఏప్రిల్ నెలలో బ్యారల్ (159 లీటర్లు) కనిష్ఠంగా 18.38 డాలర్లకు చేరింది. ఆగస్టు అనంతరం ప్రపంచంలోని పలు దేశాల్లో పరిస్థితులు క్రమేణా మెరుగుపడటం, ప్రధాన పెట్రో ఉత్పత్తి (ఒపెక్ ప్లస్) దేశాల మధ్య ఒప్పందాలు కుదరడంతో చమురు ధరలు పెరగడం ప్రారంభమైంది. మనదేశం ప్రధానంగా బ్రెంట్ రకం ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం దాని ధర బ్యారల్ 56 డాలర్లకు చేరింది. ప్రపంచ చమురు ధరల్లో హెచ్చు తగ్గులను బట్టి ఇంధన రిటైల్ ధరలను నిర్ణయించడానికి భారత ప్రభుత్వం చమురు మార్కెటింగ్ సంస్థలకు అనుమతినిచ్చింది. అప్పటి నుంచి ఏడాదికి సగటున 40 నుంచి 50 సార్లు ధరల్లో మార్పులు వస్తున్నాయి.
ఎడాపెడా సుంకాలు
కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను ఆదాయం భారీగా తగ్గింది. అయితే ఎక్సైజ్ సుంకం వసూళ్లు భారీగా పెరిగాయి. 2020 మార్చి తరవాత కేంద్రం లీటరు పెట్రోలుపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.11 చొప్పున పెంచింది. దీంతో ఎక్సైజ్ సుంకం లీటరు పెట్రోలుపై రూ.32.98కి, లీటరు డీజిల్‌పై రూ.31.83కు చేరింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్, ఇతర రుసుములను భారీగా వడ్డిస్తుండటంతో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. ప్రపంచ విపణిలో చమురు ధరలు కనిష్ఠ స్థాయికి చేరినప్పుడూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు రుసుములు వేసి ఆ స్థాయిలో ధరలు తగ్గకుండా అడ్డు చక్రం వేస్తున్నాయి. పెట్రో ధరలపై పన్నుల విషయంలో రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. పెట్రో ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రం చూసినా రాష్ట్రాలు బంగారు గుడ్లు పెట్టే బాతును వదులుకోవడానికి అంగీకరించలేదు.
ధరల నియంత్రణకు విముఖత