తెలంగాణ

telangana

ETV Bharat / opinion

చమురు మంటతో నిత్యావసరాల రేట్లకు రెక్కలు - fuel price impact on essentials

నెలరోజుల వ్యవధిలో వంటింటి సరకుల రేట్లు 37శాతం దాకా పెరిగాయి. ఆర్నెల్ల క్రితంతో పోలిస్తే వంటనూనెల ధరలు 35శాతం పెరగడానికి- తగ్గించిన దిగుమతి సుంకాల్నీ దిగదుడుపు చేసేలా పెరిగిన రవాణా ఛార్జీలు కారణమయ్యాయి. మయన్మార్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా మినప్పప్పు దిగుమతులు మందగించి ఇకపై ఇళ్లల్లో ఇడ్లీ దోశెలు మరింతగా ప్రియం కానున్నాయి!

hike in fuel price
చమురు మంటతో నిత్యావసరాల రేట్లకు రెక్కలు

By

Published : Mar 9, 2021, 6:50 AM IST

పెట్రోలు, డీజిల్‌ లేకుండా బతుకు బండి కదలదాయె. గ్యాసు బండ భారంతో బీద మధ్యతరగతి బతుకులు కుదేలైపోయె. అదే వరసలో భగ్గుమంటున్న వంట నూనెలు గృహిణుల కంట నీరు తెప్పిస్తుంటే, పప్పులూ ఉప్పుల ధరలూ పైపైకి ఎగబాకి వంటింటి బడ్జెట్లను తలకిందులు చేస్తున్నాయి. నిరుడు అక్టోబరులో ఆరేళ్ల గరిష్ఠానికి చేరి ఉరిమిన చిల్లర ధరోల్బణం ఇప్పుడు అదుపులోనే ఉందని సర్కారీ లెక్కలు మోతెక్కిస్తున్నా- పెట్రోలు డీజిల్‌ ధరల ప్రజ్వలనం రవాణా వ్యయాలకు మంటపెట్టి నిత్యావసరాల రేట్లకు రెక్కలు తొడుగుతోంది. వంటనూనె ధర లీటర్‌ రూ.150 దాటిపోగా, కందిపప్పు కిలో వంద పప్పుగా గుడ్లురుముతోంది. చింతపండు ధర సైతం చెట్టెక్కి కూర్చోవడంతో ఏం కొనాలో ఎలా తినాలో తెలియని చింత మరింతగా కుంగదీస్తోంది.

నెలరోజుల వ్యవధిలో వంటింటి సరకుల రేట్లు 37శాతం దాకా పెరిగాయి. ఆర్నెల్ల క్రితంతో పోలిస్తే వంటనూనెల ధరలు 35శాతం పెరగడానికి- తగ్గించిన దిగుమతి సుంకాల్నీ దిగదుడుపు చేసేలా పెరిగిన రవాణా ఛార్జీలు కారణమయ్యాయి. మయన్మార్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా మినప్పప్పు దిగుమతులు మందగించి ఇకపై ఇళ్లల్లో ఇడ్లీ దోశెలు మరింతగా ప్రియం కానున్నాయి! వంటనూనెల్లో దాదాపు 70శాతానికి దిగుమతులే దిక్కు అయిన ఇండియా- ఇండొనేసియా, మలేసియా పామాయిల్‌ తోటల్లో కూలీల కొరతకు, సోయాబీన్‌ పండించే అర్జెంటీనాలో కరవుకు, ఉక్రెయిన్‌లో సన్‌ఫ్లవర్‌ దిగుబడి తగ్గుదలకూ దేశీయంగా భారీ మూల్యం చెల్లించుకొంటోంది. అమెరికా తరవాత అత్యధికంగా సాగుయోగ్య భూములున్న ఇండియా వంటనూనెలకు, పప్పుధాన్యాలకూ చిన్నా చితకా దేశాలమీద ఆధారపడుతున్న దుస్థితి- అంగట్లో అన్నీ ఉన్నా... అన్న సామెతనే తలపిస్తోంది. ఆహార పంటల్లో పరాధీనత వెంటాడుతుంటే, ఆత్మ నిర్భరత ఎలా సాధ్యపడుతుంది?

దిగుమతులే ఆదారం..

దేశీయంగా ముడి చమురు అవసరాల్లో 80శాతం పైగా దిగుమతులేనంటే ప్రకృతి ప్రసాదిత వనరులు తగినంతగా అందుబాటులో లేనందువల్ల- అని సర్దిచెప్పుకోవచ్చు. సహస్రాబ్దాలుగా వ్యవసాయం సంస్కృతిగా స్థిరపడి, మాగాణాలు దండిగా, మట్టినుంచి మాణిక్యాల్ని పండించే రైతన్నలు మెండుగా ఉన్న దేశం ఆహార దిగుమతులకోసం వెంపర్లాడటాన్ని ఎలా సమర్థించుకోగలరు? ప్రపంచవ్యాప్త వంట నూనెల దిగుమతుల్లో 1961లో 0.9శాతంగా ఉన్న ఇండియా వాటా 2019లో 12శాతానికి ఎగబాకింది. ఏటా వంటనూనెల దిగుమతికోసం దేశం వెచ్చిస్తున్న రూ.65-70 వేల కోట్లు ఇక్కడి రైతులకే దక్కాలని ఇటీవలి నీతి ఆయోగ్‌ భేటీలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశీయ అవసరాలకోసమే కాకుండా ప్రపంచ దేశాలకూ ఎగుమతి చేయగల సత్తా ఇండియాకు ఉందంటూ అందుకోసమే వ్యవసాయ సంస్కరణల్ని తెచ్చామన్న ప్రధాని మాటల్ని రైతాంగం విశ్వసించడం లేదు.

10.75 కోట్ల రైతుల ఖాతాల్లోకి ఏకంగా రూ.1.15 లక్షల కోట్లు బదిలీ చేశామని కేంద్రం ప్రకటిస్తున్నా- రైతులు ఆశిస్తున్నది ఈ తరహా తాయిలాలు కానే కాదు. ఆరుగాలం శ్రమించి తాను పండించేదానికి సరైన గిట్టుబాటు ధర కోరుతున్న రైతుకు అది దక్కేలా ప్రభుత్వాలు చూడగలిగితే- వ్యవసాయం పండగ అవుతుందనడంలో సందేహం లేదు. నష్టజాతక సేద్యం సాధ్యం కాదని ఇప్పటికే కోట్లాది రైతులు కాడీమేడీ వదిలేయగా- నగరాలు, పట్టణాల చుట్టుపక్కలున్న సుక్షేత్రాలు స్థిరాస్తి వెంచర్లుగా మారిపోతున్నాయి. ఈ వాస్తవాన్ని గుర్తించి ఆహార రంగంలో ఇండియా స్వావలంబన సాధించిందన్న దుర్భ్రమల్ని విడనాడి, సతత హరిత విప్లవ సారథిగా అన్నదాతను సమాదరించాల్సిన సమయమిది. ఇండియా స్వయంకృత ఆహార సంక్షోభంలో కూరుకుంటే, ఇలాతలం మీద ఏ దేశం ఆదుకోగలుగుతుంది? అందుకే ఆహార పంటలపై సమగ్ర జాతీయ వ్యూహాన్ని రచించి అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిస్తేనే దేశం ఆత్మనిర్భరత చాటుకోగలుగుతుంది!

ABOUT THE AUTHOR

...view details