జమ్ము కశ్మీర్‌లో పరిస్థితి రాజకీయ నాయకులు చెబుతున్నంత ప్రశాంతంగా ఏమీ కనిపించడం లేదు. అక్కడ ఈ ఏడాది అక్టోబరు అయిదు నుంచి పదిహేనో తేదీ లోపు వేర్వేరు ఉగ్రదాడుల్లో స్థానికేతరులతో కలిపి 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అక్టోబరు 11న పూంఛ్‌లోని డేరాకీ గలీ, భట్టా దురియాన్ అడవుల్లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య మొదలైన ఎదురుకాల్పులు నేటికీ కొనసాగుతున్నాయి. అక్టోబరు 19న భారత సైన్యాధిపతి జనరల్ నరవణె జమ్ముకు వెళ్ళి పరిస్థితిని సమీక్షించారు. అక్టోబరు 23న అక్కడి భద్రతా దళాలు, లెఫ్టినెంట్ గవర్నర్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ప్రధాని మోదీ ఈ ఏడాది దీపావళి సంబరాలను ఎదురుకాల్పులు కొనసాగుతున్న రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లోనే జరుపుకొని మన సైనిక దళాల్లో ఆత్మ స్థైర్యం నింపారు. కశ్మీర్‌లో యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా చేయడంలో మాత్రం కేంద్రం పెద్దగా పురోగతి సాధించలేదు. ఫలితంగా పాక్ తన చేతికి మట్టి అంటకుండా కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది.
రెండేళ్ల క్రితం కేంద్రం జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగించింది. కేంద్రం నిర్ణయంతో కశ్మీర్ వాసుల్లో అసంతృప్తి నెలకొన్నా, వారు గుంభనంగా ఉండటాన్ని ప్రభుత్వం గుర్తించలేకపోయింది. ఆ పరిస్థితుల్లో పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా భారీ ఎత్తున పిస్తోళ్ల వంటి చిన్న ఆయుధాల సరఫరా యత్నాలు పెరగడం ప్రమాదకర సంకేతం. లక్షల సంఖ్యలో తుపాకులను అఫ్గాన్‌లో పోగుపెట్టి ఆ దేశాన్ని అమెరికా, రష్యా, పాక్‌లు ఛాందసవాదుల చేతుల్లోకి నెట్టాయి. ఇప్పుడు కశ్మీర్‌లో పాక్ అలాంటి యత్నాలే చేస్తోంది. 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్, యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్' ముసుగుల్లో లష్కరే, జైషే సంస్థలు అక్కడ పనిచేస్తున్నాయి. వీరు దాడులను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వాటిని పోస్టు చేసి ప్రచారం చేసుకొంటున్నారు. అదే సమయంలో భద్రతా విభాగాల్లో బదిలీలు సైతం పరిస్థితిని కొంత దిగజార్చాయి. ప్రత్యేక కార్యకలాపాల బృందం (కార్గో) ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని సేకరిస్తుంది. దాదాపు అయిదు నెలలపాటు దీని బాధ్యతలను పూర్తి స్థాయి అధికారికి అప్పగించలేదు. కూలీలు ఉప్పందించడంతో పూంఛ్‌లో ఎదురుకాల్పులు మొదలై సుదీర్ఘంగా సాగుతున్నాయి. అక్కడి పర్వతాలపై నక్కిన ఒక్కో శత్రువును మట్టుపెట్టాలంటే సగటున అయిదు నుంచి తొమ్మిది మంది ప్రత్యేక దళ సిబ్బంది అవసరం. జమ్మూ కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలూ ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌కు ముందు వరకు అక్కడ హింస చాలావరకు తగ్గింది. జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. తిరిగి వచ్చిన కశ్మీరీ పండితులకు పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. అక్కడ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ ఏడాది మార్చి నాటికి సుమారు రూ.23 వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరినట్లు కేంద్రం రాజ్యసభలో పేర్కొంది. కశ్మీర్‌లో మౌలిక వసతుల ప్రాజెక్టులు నెలకొల్పేందుకు దుబాయ్ ప్రభుత్వం ఇండియాతో ఒప్పందం చేసుకొంది. యునెస్కో ఎంపిక చేసిన 49 సృజనాత్మక నగరాల్లో శ్రీనగర్ తాజాగా స్థానం సంపాదించింది.