వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ను ప్రవేశపెట్టి ఈ ఏడాది జులై ఒకటో తేదీకి నాలుగేళ్లయింది. 2017 జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంటు కేంద్ర హాలులో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర నాయకులు సమావేశమైనప్పుడు- భారతదేశ సంక్లిష్ట పరోక్ష పన్నుల వ్యవస్థ లోటుపాట్లకు జీఎస్టీ సరైన పరిష్కారమవుతుందని ఎందరో ఆశించారు. జీఎస్టీని గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ (మంచి, సరళమైన పన్ను)గా వర్ణించినవారున్నారు. 'ఒకే దేశం, ఒకే పన్ను' అంటూ అప్పట్లో చాలానే సందడి చేశారు. నాలుగేళ్లు గడిచాక జీఎస్టీని మంచిదని కానీ, సరళమైనదని కానీ అంగీకరించేవారు కనిపించడం లేదు. భారతదేశ పరోక్ష పన్నుల వ్యవస్థను సంస్కరించే ప్రయత్నం రాజీవ్‌గాంధీ హయాములో మొదలైంది. రాజీవ్ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్న వీపీ సింగ్ మోడ్వాట్ పద్ధతిని ప్రవేశపెట్టారు. తరవాత యశ్వంత్ సిన్హా వ్యాట్ (విలువ జోడింపు పన్ను) విధానాన్ని తీసుకొచ్చారు. దాని స్థానంలో వస్తుసేవల పన్ను(జీఎస్టీ) ప్రవేశపెట్టడానికి చిదంబరం సన్నాహాలు మొదలుపెట్టారు. చివరకు అమలులోకి వచ్చిన జీఎస్టీ విధానం మరే దేశంలోనూ లేనంత సంక్లిష్టమైనదిగా తయారైంది.
మరింత సంక్లిష్టం
మరెక్కడా లేనంత అధిక పన్ను రేట్లను కూడా భారతీయ జీఎస్టీలో పొందుపరచారు. అసలే జటిలంగా ఉన్న పన్నుల వ్యవస్థను మరింత సంక్లిష్టం చేయడం తప్ప జీఎస్టీ సాధించిందేమీ లేదు. పన్నుచెల్లింపుదారులపై ప్రభుత్వ నిఘా మాత్రం పెరిగింది. జీఎస్టీ తమకెంతో ప్రయోజనకరంగా ఉంటుందని మొదట్లో భావించిన రాష్ట్రాలు, ఇప్పుడు ఆ ప్రయోజనాలను అతిగా ఊహించుకున్నామని వాపోతున్నాయి. ప్రపంచంలో తొలిసారిగా, 1954లో ఫ్రాన్స్ జీఎస్టీని ప్రవేశపెట్టింది. ఆ తరవాత 140 దేశాలు జీఎస్టీకి మారాయి. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఇప్పటివరకు జీఎస్టీకి మారలేదు. చైనావ్యాట్ పద్ధతినే అనుసరిస్తోంది. ఇతర దేశాల్లోని వస్తు సేవల పన్నుకు భారతదేశ జీఎస్టీకి ఎక్కడా పోలికే లేదు- ఒక్క కెనడాతో తప్ప. సింగపూర్‌లో మూడు శ్లాబులు ఉండగా, మిగతా దేశాలన్నీ ఒకే శ్లాబును పాటిస్తున్నాయి. భారత్‌లో కేంద్రం, రాష్ట్రాలు విధించే వివిధ పరోక్ష పన్నుల స్థానంలో జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టారు. మద్యం, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించారు.
జీఎస్టీ మండలికి ధారాదత్తం..
జీఎస్టీ వల్ల రాష్ట్రాలు, పన్ను చెల్లింపుదారులు, సామాన్య ప్రజలు ఎంతో లాభపడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. పాత పన్నుల విధానంలో అవినీతి వల్ల నష్టపోయి, విసిగిపోయిన వ్యాపారులకు జీఎస్టీ ఊరటనిస్తుందని భావించారు. పన్నుల విధానం సరళతరమై వ్యాపార వర్గాలకు ఉపశమనం కలుగుతుందని అనుకున్నారు. అధిక పన్నులతో కుంగిపోతున్నామని వాపోతున్న వర్గాలు జీఎస్టీ వల్ల పన్నులు తగ్గుతాయని ఆశపెట్టుకున్నాయి. కొత్త పన్నుల విధానంలో పన్నుల ఎగవేత తగ్గి, ఆదాయం పెరుగుతుందని రాష్ట్రాలు అంచనా వేశాయి. జీఎస్టీ విధానానికి తొలుత రూపకల్పన చేసినది పూర్వ కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి, ఎన్డీయే హయాములో పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభల్లో తేలిగ్గా ఆమోదం పొందింది. పన్నులు విధించడానికి రాజ్యాంగపరంగా తమకు సంక్రమించిన అధికారాలను రాష్ట్రాలు జీఎస్టీ మండలికి ధారాదత్తం చేశాయి. ఈ మండలిలో రాష్ట్రాలన్నింటికీ కలిపి 66శాతం ఓటింగ్ హక్కులు ఉంటే, మిగతా 33శాతం హక్కులు కేంద్రానికి ఉంటాయి. చివరికి రాష్ట్రాలు తమ పన్ను అధికారాలను కేంద్రం గుప్పిట్లో పెట్టాయి. ఈ క్రమంలో తమ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టాయనే చెప్పాలి. ఇక అవి కాలు వెనక్కు తీసుకోలేని స్థితి నెలకొంది. కేరళలో వరదల ఉద్ధృతి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించినప్పుడు, రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి ఎలాంటి పన్నులూ విధించలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి దుస్థితి మున్ముందు ఇతర రాష్ట్రాలకూ ఎదురుకావచ్చు.