భారత్-చైనా సరిహద్దుల వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం... ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే మోదీ ప్రభుత్వం అందుకు తగ్గ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ దేశాల దిగుమతులను తగ్గించుకుంటోంది. అయితే ఈ నిర్ణయంపై ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ రమా సుబ్రహ్మణ్యం గాంధీ తన అభిప్రాయాలను వెల్లడించారు. పాలసీలో మార్పులు, ప్రణాళికలను ఏళ్లపాటు అమలు చేస్తేనే.. చైనా నుంచి వేరుపడి ఆర్థికంగా నిలబడగలమని పేర్కొన్నారు. ఒక్కరోజులో చైనాతో సంబంధాలు తెంచేసుకోవడం వీలు పడదని తెలిపారు.
" చైనాతో వాణిజ్య సంబంధాలను తెంచేసుకోవడం సులభం కాదు. దిగుమతులు, ఎగుమతుల పరంగా చైనాతో ఈ రకంగా పరస్పర సంబంధాలు నెలకొల్పడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. మనం చైనాకు ఎగుమతులు, దిగుమతులు గణనీయంగా చేసుకుంటున్నాం. ఒక్కరోజులో దాన్నెలా పాడుచేస్తారు?".
--రమా సుబ్రహ్మణ్యం గాంధీ, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్
చైనాపైనే ఆధారం..
ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని చూస్తే చైనాకే ఎక్కువ లాభం కలుగుతోంది. గతేడాది రెండు దేశాల మధ్య 87 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వ్యాపారం జరిగింది. ఇందులో 70.3 బిలియన్ డాలర్లను వస్తు, సేవల రూపంలో భారత్‌కు దిగుమతులు జరగ్గా... 16.75 బిలియన్ డాలర్ల ఎగుమతులు మాత్రమే భారత్ చేయగలిగింది. అంటే 53.55 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుతో ఉంది భారత్.
చైనా నుంచి వంద శాతం దిగుమతులు ఉండగా.. భారతదేశం నుంచి ఎగుమతులు మాత్రం పావు వంతు జరుగుతున్నాయి. భారత్‌కు.. 2013-14 నుంచి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా మాత్రమే. 2018-19 నుంచి అమెరికా ఆ స్థానాన్ని ఆక్రమించింది.
ముందే ప్రణాళికలు..
జూన్‌లో జరిగిన గల్వాన్ ఘర్షణకు ముందే మోదీ ప్రభుత్వం పలు నిబంధనల్లో మార్పులు చేసింది. తక్కువ ధర, నాణ్యత లేని చైనా ఉత్పత్తుల దిగుమతులను చాలా కీలక విభాగాల్లో ఉండకుండా నిర్ణయాలు తీసుకుంది. భారత్‌లో కీలక రంగాల వృద్ధికి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో మే నెలలోనే కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్రం.
కరోనా వల్ల చైనా నుంచి సరఫరా నిలిచి, వాణిజ్యపరంగా ఇబ్బందులు పెరగ్గా.. గల్వాన్ ఘర్షణ తర్వాత అది మరింత దిగజారింది. అందుకే చైనాపై ఆధారపడటం తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక సరిహద్దుల్లోనూ డ్రాగన్ దురాక్రమణ వైఖరికి బుద్ధి చెప్పేందుకు ఎక్కడా తగ్గట్లేదు. 5 నెలలుగా విపరీత పరిస్థితులను తట్టుకొని భారత సైన్యం లద్ధాఖ్‌లో నిరంతరాయంగా విధుల్లోనే ఉంది.