జీవ వైవిధ్య పరిరక్షణలో అడవులది కీలక భూమిక. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది ప్రత్యక్షంగా అటవీ వనరులపై ఆధారపడి జీవిస్తున్నారు. భూతాపానికి అంటుకట్టే కర్బన ఉద్గారాల తగ్గింపులో అరణ్యాల పాత్ర ఎనలేనిది. అటువంటి అడవుల విస్తీర్ణం క్రమేణా తగ్గిపోతోంది. పారిశ్రామికీకరణకు ముందు ప్రపంచ అటవీ విస్తీర్ణం 590 కోట్ల హెక్టార్లు. అది క్రమేణా తగ్గుతూ ప్రస్తుతం 390 కోట్ల హెక్టార్లకు చేరింది. తాజా అంచనాల ప్రకారం 1990 నుంచి ఏటా 1.79 కోట్ల హెక్టార్ల అడవులు కనుమరుగవుతున్నాయి. భారత్‌లో 2019నాటికి అటవీశాఖ లెక్కల ప్రకారం 7.2 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో- అంటే ఇక్కడి మొత్తం భూభాగంలో 21.67 శాతంమేర అడవులు విస్తరించి ఉన్నాయి. వ్యవసాయం, పారిశ్రామికీకరణ, భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు తదితర మౌలిక వసతుల నిర్మాణం కోసం భారీగా అటవీ భూమిని వినియోగించడంవల్ల అరణ్యాలు కుంచించుకుపోతున్నాయి. కార్చిచ్చుల వల్ల సైతం వాటి విస్తీర్ణం వేగంగా తగ్గిపోతోంది.
శాపమవుతున్న నిర్లక్ష్యం
కార్చిచ్చులకు 90శాతం మానవ తప్పిదాలే కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పోడు వ్యవసాయంకోసం వనాలను తగలబెడుతున్నారు. బీడీ ఆకుల సేకరణకు వెళ్ళేవారు, పశువుల కాపరులు, పర్యాటకులు నిర్లక్ష్యంగా బీడీలు, సిగరెట్లు కాల్చి పారేయడంవల్ల అగ్ని ప్రజ్వలిస్తోంది. చలి కాచుకునేందుకు, వంటలు చేసుకునేందుకు మంటలు వేసి వాటిని ఆర్పకుండా వదిలేయడం... తదితర కారణాలవల్ల అడవులు ఎక్కువగా దగ్ధమవుతున్నాయి. 2011నుంచి 2020వరకు ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 63వేల ప్రమాదాలు చోటు చేసుకోగా- 75 లక్షల హెక్టార్ల చొప్పున అడవి భస్మీపటలమైంది. ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన దేశాలు సైతం సకాలంలో మంటలను అదుపులోకి తేలేక ప్రకృతి ప్రతాపం ముందు తలవంచాయి. భారత్‌లోనూ ఏటా మానవ తప్పిదాల కారణంగా వెలకట్టలేని స్థాయిలో అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. 2020లో 57వేల కార్చిచ్చు ఘటనలు సంభవించాయి. 2020 మార్చి 22-ఏప్రిల్ 11 మధ్య కాలంలో తెలంగాణలోనే 6,500కు పైగా అగ్ని ప్రమాదాలు వేర్వేరు అటవీ ప్రాంతాల్లో సంభవించాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 22- మార్చి ఒకటి తేదీల మధ్య అడవుల్లో 1,292 అగ్ని ప్రమాదాలు జరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లోనూ
తెలుగు రాష్ట్రాల్లో శేషాచలం, నల్లమల, ఆదిలాబాద్, ఖమ్మం అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చులు తరచూ భయపెడుతున్నాయి. వేసవిలో రాలిన ఆకులు, ఎండిపోయిన పొదలు అడవుల దగ్ధానికి కారణమవుతున్నాయి. భారత అటవీ విస్తీర్ణంలో 36శాతం (6.57లక్షల చదరపు కిలోమీటర్ల) పరిధిలో తరచూ ప్రమాదాల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని 'ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ)' చెబుతోంది. మొత్తం విస్తీర్ణంలో 21శాతం అత్యధికంగా అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తాజా అటవీ సర్వేలో వెల్లడైంది. దేశంలో మొత్తంగా 2.78 లక్షల ఫైర్ పాయింట్లు ఉండగా- ఒక్క మిజోరంలోనే దాదాపు 33వేల వరకు ఉండటం గమనార్హం.