ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలు తోడవుతూ ఉండటంతో దేశవ్యాప్తంగా అటవీ ప్రాంతం(India Forest Area) గణనీయంగా తగ్గిపోతోంది. ఫలితంగా పర్యావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కొన్నేళ్లుగా అడవులకు కార్చిచ్చులు శాపంగా పరిణమించాయి. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో కార్చిచ్చులు(Wildfire) గణనీయంగా అడవులను(India Forest Area) హరించివేస్తున్నాయి. 2020 నవంబరు నుంచి 2021 జూన్ వరకు దేశవ్యాప్తంగా సుమారు 3.45 లక్షలకు పైగా కార్చిచ్చు(Wildfire) ఘటనలు సంభవించినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయంటే నష్టం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఈ సమస్యను నివారించేందుకు తక్షణ చర్యలు అవసరమని నిపుణులు గళమెత్తుతున్నారు.
అత్యధికంగా ఉత్తరాఖండ్‌లో దావానలాలతో అటవీ విస్తీర్ణం వేగంగా క్షీణిస్తోంది. ఆ రాష్ట్రంలో 53,483 చదరపు కిలోమీటర్ల భూభాగంలో 46,035 చదరపు కి.మీ.లు పర్వత ప్రాంతానికి చెందినవే. మొత్తంగా 71శాతం అటవీ భూమి ఉంది. ఇక్కడి జీవవైవిధ్యం, ఆర్థికరంగం అడవులపైనే అధికంగా ఆధారపడి ఉంటుంది. ఉత్తరాఖండ్‌కు అభివృద్ధి కార్యకలాపాలే పెనుశాపంగా పరిణమించాయి. పెద్దయెత్తున సాగుతున్న రోడ్డు, భవన నిర్మాణాల కారణంగా అటవీ ప్రాంతం రోజురోజుకు తరిగిపోతోంది. రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా రోడ్లు, భవన నిర్మాణాలు నిరాటంకంగా సాగుతున్నాయి. వీటికి తోడు రాష్ట్రవ్యాప్తంగా పొడవైన సొరంగాల నిర్మాణానికి కేంద్ర రవాణాశాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఆయా ప్రాజెక్టుల విలువ రూ.3,675 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా.
పర్యావరణ వ్యవస్థకు హాని..
మానవ తప్పిదాలు, ప్రకృతి వైపరీత్యాలు ఉత్తరాఖండ్ అటవీ సంపదను నాశనం చేస్తున్నాయి. భూకంపాల ముప్పు ఆందోళనకరంగా ఉంది. ఆకస్మిక వరదలు కుదిపేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఇవన్నీ హిమాలయ రాష్ట్రంలోని పర్యావరణ వ్యవస్థకు హాని తలపెడుతున్నాయి. వేసవిలో కార్చిచ్చు అడవులను దహించి వేస్తోంది. ఫిబ్రవరి-జూన్ మధ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంటుంది. అధికారిక గణాంకాల ప్రకారం 2000 సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 44,554 హెక్టార్ల అటవీ భూమి అగ్నికి ఆహుతైంది. 2019లో 2,981 హెక్టార్ల అడవులు నాశనమయ్యాయి. 2020 అక్టోబర్- 2021 ఏప్రిల్ మధ్య కాలంలో 1,100 అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్‌లో నైనిటాల్, తెహ్రీ, అల్మోరా, పౌరి తదితర జిల్లాల అటవీ ప్రాంతాల్లో పెద్దయెత్తున కార్చిచ్చులు చెలరేగి విస్తరించాయి. మూగజీవాల పాలిట దావానలం శాపంగా మారింది. ఏటా అగ్నికి ఆహుతవుతున్న వన్యప్రాణుల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోంది.
నిర్వహణ లక్ష్యాలు విఫలం..