దేశంలో ఓవైపు కరోనా విలయతాండవం చేస్తుంటే మరోవైపు ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. అసోం, మహారాష్ట్ర, కేరళ, దిల్లీ సహా మరికొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. గడచిన నెలలో కురిసిన భారీ వర్షాలు అసోమ్‌ను అతలాకుతలం చేశాయి. ఈనెల తొలివారం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కురిసిన కుంభవృష్టికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై, జనజీవనం ఛిన్నాభిన్నమైంది. ప్రజారవాణా స్తంభించిపోయింది. ముంబైలో 24 గంటల వ్యవధిలోనే 200 మి.మీ.పైగా వర్షపాతం నమోదుకావడం గడచిన 15 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈనెల ఎనిమిదో తేదీన కేరళలోని ఇడుక్కి జిల్లాలో కురిసిన భారీ వర్షాల తాకిడికి మట్టిపెళ్లలు విరిగి తేయాకుతోటలో పనిచేస్తున్న కార్మికుల ఇళ్ల సముదాయంపై పడటంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఏటా భారీ వర్షాలకు విపత్కర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నా, ఎలాంటి ముందస్తు ప్రణాళికలతో కూడిన కార్యాచరణ లేకపోవడం గందరగోళ పరిస్థితులకు అద్దం పడుతోంది.
ఏటా ఇదే తంతు...
గతంలో వరదలు, విపత్తుల నిర్వహణకై అనుసరించిన వ్యూహాలన్నీ గ్రామాలు కేంద్రంగానే రూపొందాయి. వాస్తవానికి నగరాలు, పట్టణాలను ముంచెత్తే వరదలకు; నదులు ఉప్పొంగి గ్రామీణ ప్రాంతాల్లో సంభవించే వరదలకు మధ్య తేడా ఉంది. పట్టణీకరణ విస్తరిస్తున్నకొద్దీ వాననీటిని ఒడిసిపట్టే వనరులు తరిగిపోతున్నాయి. ఫలితంగా ఆకస్మికంగా, కుండపోతగా వర్షాలు కురిస్తే నీటి ప్రవాహ ఒరవడి తీవ్రమై, దాదాపు ఎనిమిది రెట్లు వరదలు పెరగడమే కాకుండా వరదనీటి ఘన పరిమాణం సైతం ఆరు రెట్లు ఇనుమడించడానికి కారణమవుతున్నాయి. తాజాగా ముంబై, కేరళ, దిల్లీల్లో ఉత్పాతం సృష్టించిన వరదలకు కారణం ఇదే. ప్రస్తుతం ఆందోళన కలిగించే విషయమేమిటంటే- పట్టణాల్లోని వరదలు సాంక్రామిక వ్యాధుల విజృంభణకు అనువుగా ఉండటమే! ఇటీవల అసోమ్‌లో సంభవించిన వరదల్లో భారీ స్థాయిలో ఆస్పత్రుల వ్యర్థాలు, వాడి పారేసిన పీపీఈ కిట్‌లు, కొవిడ్ సంరక్షణ కేంద్రాల వ్యర్థాలు కొట్టుకు రావడం- నీట మునిగిన ప్రాంతాల్లోని ప్రజల్లో వైరస్ ప్రభావంపై భయభ్రాంతులకు కారణమైంది. నేడు ప్రధానంగా మహానగరాలు, పట్టణాల్లోని వరద ముంపు పరిస్థితులకు కారణం- దశాబ్దాల కిందటి మురుగు నీటిపారుదల వ్యవస్థే. ఏళ్లతరబడి పూడికతీత చేపట్టకపోవడం, చెత్తాచెదారంతో నిండిపోవడంవల్ల కొద్దిపాటి వర్షానికి సైతం రోడ్లన్నీ వరదలై పారుతున్నాయి. నేడు మహానగరాల్లోని మురుగునీటి పారుదల వ్యవస్థను కేవలం శుభ్రపరచడమే కాకుండా వాననీటి ప్రవాహానికి ఆటంకంలేని విధంగా పారుదల సౌకర్యాలు కల్పించడం అత్యంతావశ్యకం. పట్టణాల్లోని వరదలకు మరో ప్రధాన కారణం- అక్రమ నిర్మాణాలు. దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఈఅక్రమ నిర్మాణాలు వరదనీటిపారుదల వ్యవస్థకు ప్రధాన అవరోధంగా మారాయి. పట్టణాలు శరవేగంగా పెరుగుతుండటంతో అక్రమ నిర్మాణాలు, మురుగునీటి కాలువలు, చెరువులు, కుంటలు దురాక్రమణకు గురవుతుండటమూ సమస్య తీవ్రరూపం దాల్చడానికి కారణమవుతోంది. ఏటా ఆనవాయితీగా మారిన వరదల ముప్పునుంచి తప్పించుకోవాలంటే మురుగు, వరదనీటి కాల్వల దురాక్రమణను కట్టడి చేయాలి. ఏటా వర్షాకాలానికి ముందే నాలాల్లో పూడిక తీసి శుభ్రపరచడమే కాకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ముంపు పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి.