తెలంగాణ

telangana

ETV Bharat / opinion

నీలివిప్లవంతో ప్రగతి తీరాలకు మత్స్య పరిశ్రమ - Fisheries industry news

వ్యవసాయ అనుబంధం రంగంగా మత్స్య పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తోంది. చేపల ఉత్పత్తిలో వినూత్న విధానాలతో నీలి విప్లవాన్ని సాధించింది. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. మత్స్య ఉత్పత్తులను 220 లక్షల టన్నులకు పెంచాలనే లక్ష్యంగా చర్యలు చేపడుతోంది కేంద్రం. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ చేపలు, రొయ్యల ఉత్పత్తిలో తొలి స్థానంలో ఉంది. తెలంగాణ మత్స్య వనరుల విషయంలో 3వ స్థానంలో, చేపల ఉత్పత్తి పరంగా 8వ స్థానంలో నిలిచింది.

Blue Revolution
నీలివిప్లవంతో ప్రగతి తీరాలకు.. మత్స్య పరిశ్రమ

By

Published : Aug 20, 2020, 6:45 AM IST

వ్యవసాయ అనుబంధరంగంగా మత్స్య పరిశ్రమ నేడు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆహార, పౌష్టికాహార భద్రతను, ఉద్యోగితను కల్పిస్తోంది. మత్స్యకారులకు ఆదాయాన్ని సమకూర్చడంలో, ఎగుమతుల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్‌ చేపల ఉత్పత్తిలో వినూత్న విధానాలతో నీలి విప్లవాన్ని సాధించింది. ప్రస్తుతం భారతదేశం చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో (చైనా తరవాతి) స్థానంలో నిలిచింది. ఈ రంగం 1.45 కోట్ల మంది మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తూ- స్థూల దేశీయోత్పత్తిలో 1.24శాతం, దేశ వ్యవసాయంలో 7.28శాతం వాటా కలిగి ఉంది. భారత్‌లో 1951లో చేపల ఉత్పత్తి 7.52 లక్షల టన్నులు కాగా, 2018-19లో 137.58 లక్షల టన్నులకు చేరింది. 2024-25 నాటికి మత్స్య ఉత్పత్తులను 220 లక్షల టన్నులకు పెంచడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. గత సంవత్సరం ఎగుమతుల విలువ రూ.46,589 కోట్లు కాగా, 2024-25 నాటికి ఈ విలువను రూ.లక్ష కోట్లకు చేర్చాలని కృషి చేస్తోంది. దేశంలో చేపల తలసరి వినియోగాన్ని ఇప్పుడున్న 6 కిలోల నుంచి 12 కిలోలకు పెంచాలని నిర్ణయించింది.

మత్స్యకారులకు ప్రోత్సాహం

ఆత్మ నిర్భర్‌ భారత్‌ కింద వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను పటిష్ఠపరిచేందుకు పలు పథకాలను చేపట్టిన కేంద్ర ప్రభుత్వం- అందులో భాగంగా మత్స్య రంగంలో రూ.20వేల కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను అమలు చేస్తోంది. ఈ నిధులను చేపలు, రొయ్యల పెంపకానికే కాకుండా, ఆ రంగంలో మౌలిక వసతులను పెంచేందుకూ వినియోగిస్తారు. పంజర సాగు (కేజ్‌ కల్చర్‌), సీ వీడ్‌ ఫార్మింగ్‌ విధానాల్లో చేపల పెంపకానికి ప్రాధాన్యమిస్తారు. ఆకర్షణీయమైన రంగు చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తారు. చేపలు పట్టే పడవల నిర్మాణం, ప్రయోగశాలల ఏర్పాటుపై దృష్టి సారిస్తారు. చేపలవేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందజేస్తారు. వ్యక్తులు, పడవలకు బీమా సౌకర్యం కల్పిస్తారు. ఈ చర్యల వల్ల రాబోయే అయిదేళ్లలో చేపల ఉత్పత్తి అదనంగా 70లక్షల టన్నుల మేర పెరుగుతుందని, మరో 55 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎగుమతుల పెంపుదలలో ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా మత్స్యకారుల సంఘాలను ఏర్పాటు చేయడంద్వారా సముద్ర, మంచినీటి ఉత్పత్తుల సమర్థ మార్కెటింగ్‌ సాధ్యమవుతుందని అంచనా. గ్రామీణ యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలూ మెరుగవుతాయి. సముద్ర మత్స్య సంపద పరిరక్షణకు ఒక ప్రత్యేక వ్యవస్థనూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

తొలిస్థానంలో ఏపీ..

భారత్‌లో ఆంధ్రప్రదేశ్‌ చేపలు, రొయ్యల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ మత్స్య వనరుల విషయంలో దేశంలో మూడో స్థానంలో, మొత్తం చేపల ఉత్పత్తి పరంగా 8వ స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యరంగంలో ఆదాయ వనరులను పెంచే దిశగా చెరువుల్లో చేప పిల్లలను పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఆక్వా అభివృద్ధి సంస్థ ద్వారా రైతులకు పలు ప్రయోజనాలు అందుతున్నాయి. కరోనా కాలంలోనూ సంస్థ 80వేల టన్నుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ.3,200 కోట్లతో 8 ఫిషింగ్‌ హార్బర్లు, 4 మైనర్‌ ఫిషింగ్‌ ల్యాండింగ్‌ కేంద్రాలు నిర్మించాలని నిర్ణయించింది. ఇవన్నీ పూర్తయితే 18 లక్షలమంది యువకులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి.

లాక్‌డౌన్‌ సమయంలో రవాణా సదుపాయాలు స్తంభించడంతో మత్స్యకారులు ఆదాయం కోల్పోయి ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. కరోనా వారి జీవితాలకు పెను సవాలుగా మారింది. పేదరికం, నిరక్షరాస్యతలకు తోడు- దళారుల దోపిడి వారిని కుంగదీస్తోంది. లాక్‌డౌన్‌ తరవాత చేపల వినియోగం పెరిగినా- డిమాండ్‌కు తగినట్లుగా చేపలు, రొయ్యలను సరఫరా చేసేంత శక్తి వారికి లేదు. వినూత్న పద్ధతులను పాటించే దిశగా ప్రభుత్వం మత్స్యకారులకు శిక్షణనిస్తే, వారి ఆదాయం గణనీయంగా పెరగుతుందనడంలో అతిశయోక్తి లేదు.

మెలకువలు అవసరం...

రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెటింగ్‌ విషయంలో మత్స్యకారులకు మరింత సహాయం చేయాల్సి ఉంది. ట్యూనా చేపలు, టైగర్‌ రొయ్యలకు ఎంతో గిరాకీ ఉంది. గోదావరి నదికి వరద వచ్చి, తగ్గిన తరవాత దవళేశ్వరం, రాజమండ్రి వద్ద దొరికే 'పులస' చేపకు ఎంతో ఆదరణ ఉంది. స్వయం ఉపాధిగా యువత అక్వేరియం చేపల విక్రయాలను చేపట్టవచ్ఛు మారుతున్న వినియోగదారుల అభిరుచుల మేరకు ఆక్వా ఉత్పత్తులను శుద్ధి చేసి, రకరకాల ఆహారాన్ని తయారు చేయవచ్ఛు ఉదాహరణకు రొయ్యలతో చేసే ఊరగాయలకు గిరాకీ ఎక్కువగా ఉంది. చేపలు, రొయ్యలకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మత్స్యకారుల ఆదాయం పెరిగే మార్గాలు చూపాలి. ఆధునిక, సాంకేతిక పద్ధతుల్లో మత్స్య ఉత్పత్తులకు విలువ జోడించే విధానాల్లో శిక్షణ ఇవ్వాలి. వారితో ప్రాసెసింగ్‌ పరిశ్రమలను ఏర్పాటు చేయించాలి. పెద్ద పరిశ్రమల్లోనూ వారిని భాగస్వాములుగా చేయాలి. స్థానిక చేపల మార్కెట్లలో అపరిశుభ్రతకు భయపడి చాలామంది చేపల కొనుగోలుకు వెనకాడతారు. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వం పరిశుభ్రమైన మార్కెట్ల రూపకల్పనకు శ్రీకారం చుట్టాలి. మత్స్యకారులకు చేప మాంసాన్ని శీతలీకరించి, అధునాతన దుకాణాల ద్వారా విక్రయించే విధానాలను నేర్పాలి. నగరాల్లో మత్స్య ప్రదర్శనలను నిర్వహించడంద్వారా ప్రజల్లో చేపలు, రొయ్యల్లో ఉన్న పౌష్టిక విలువలపై అవగాహన పెంచవచ్ఛు ఆక్వా పరిశ్రమ విస్తరిస్తున్న నేపథ్యంలో కాలుష్యాన్ని నియంత్రించడంలోనూ ప్రభుత్వాలు చొరవ చూపాలి.

- ఆచార్య కొండపల్లి పరమేశ్వరరావు, (రచయిత- ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు)

ABOUT THE AUTHOR

...view details