తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆస్పత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు- ప్రభుత్వాలకు అగ్నిపరీక్ష! - fire safty precautions in Multi storey building

ఆస్పత్రుల్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలు (Fire Accidents in hospitals) అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్వస్థత పొంది క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాల్సిన సురక్షితమైన చోటే ఇలాంటి ప్రమాదాలు జరగడం నివ్వెరపరుస్తున్నాయి. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా నగరాల్లో వెలుగుచూస్తున్నాయి. పుణెలోని 20 ప్రభుత్వ ఆస్పత్రులకు అగ్నిమాపక నిరభ్యంతర పత్రాలు లేవని, భద్రతా ప్రమాణాలు ఉల్లంఘిస్తున్నందుకు 206 వైద్యాలయాలకు కేరళ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందన్న కథనాలు- ఎక్కడికక్కడ పేరుకుపోయిన అవ్యవస్థకు తార్కాణాలు.

fire safty precautions in hospitals
ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదం

By

Published : Nov 11, 2021, 8:11 AM IST

స్పత్రిలో స్వస్థత పొంది క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారనుకున్న పిల్లలు మంటల్లో (Fire Accidents in hospitals) మాడి విగతజీవులు కావడం కన్నా ఏ తల్లిదండ్రులకైనా గుండెకోత ఏముంటుంది? కమలా నెహ్రూ పేరిట నెలకొల్పిన భోపాల్‌ చిన్నపిల్లల ఆస్పత్రిలో అలా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 12కు చేరడం- బాధిత కుటుంబాల్ని, సంబంధీకుల్ని పట్టి కుదిపేస్తోంది. గతవారం మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌లో అటువంటి దుర్ఘటనే 11 మంది పసికందుల్ని పొట్టన పెట్టుకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క మహారాష్ట్రలోనే వివిధ చికిత్సాలయాల్లో అగ్నిప్రమాదాల బారిన పడి అసువులు బాసినవారి సంఖ్య 75గా నమోదైంది. దేశవ్యాప్తంగా పరికిస్తే ఠాణే, సూరత్‌, విరార్‌, రాయ్‌పూర్‌, నాగ్‌పూర్‌, భండారా, రాజ్‌కోట్‌, విజయవాడ తదితర ప్రాంతాల్లోని వైద్యాలయాల్లో చెలరేగిన మంటలు ఎన్నో కుటుంబాల్లో ఆరని శోకాగ్నులు రగిలించాయి.

నిప్పుతో చెలగాటమే..

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల భాగ్యనగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఇటీవల రోగుల్ని, సహాయకుల్ని, వైద్య సిబ్బందిని తీవ్ర భయభ్రాంతులకు లోను చేసిన అగ్నిప్రమాదం లాంటివి భిన్న నగరాలూ పట్టణాల్లో తరచూ పునరావృతమవుతున్నాయి! భోపాల్‌ ఘటన అనంతరం మధ్యప్రదేశ్‌లోని అన్ని ఆస్పత్రుల్లో 'ఫైర్‌ సేఫ్టీ ఆడిట్‌' (fire safty precautions in hospitals) చేపట్టనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. అహ్మద్‌నగర్‌ ఘోరకలికి బాధ్యులైన వైద్య సిబ్బందిని వదిలిపెట్టేది లేదంటూ వారిపై క్రమశిక్షణ చర్యల ప్రక్రియను మహారాష్ట్ర సర్కారు ప్రారంభించింది. ఏ రెండు మూడు రాష్ట్రాలకో పరిమితమైన సమస్య కాదిది. ఆ దృష్టితోనే- భోపాల్‌, భండారా తరహా దారుణాలు మరెక్కడా చోటుచేసుకోరాదంటూ శిశు విభాగాలు కలిగిన అన్ని ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, నర్సింగ్‌ హోమ్స్‌లో విధిగా అగ్నిప్రమాద నిరోధక చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ బాలల హక్కుల కమిషన్‌ లేఖలు రాసింది. కొవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాదాలపై ఏడాది క్రితమే సర్వోన్నత న్యాయస్థానమూ స్పందించింది. దీటైన చర్యల విషయంలో ఇంకా అలసత్వం వహించడం, నిప్పుతో చెలగాటమే అవుతుంది!

అదే అసలైన అగ్నిపరీక్ష!

పుణెలోని 20 ప్రభుత్వ ఆస్పత్రులకు అగ్నిమాపక నిరభ్యంతర పత్రాలు (fire safty tips in hospitals) లేవని, భద్రతా ప్రమాణాలు ఉల్లంఘిస్తున్నందుకు 206 వైద్యాలయాలకు కేరళ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందన్న కథనాలు- ఎక్కడికక్కడ పేరుకుపోయిన అవ్యవస్థకు తార్కాణాలు. తెలుగు రాష్ట్రాలదీ అదే కథ. అగ్నిమాపక శాఖ అనుమతులు లేకుండా భాగ్యనగరంలో 15వందల ఆస్పత్రులు నడుస్తుండగా, విజయవాడలో పాతిక పడకల లోపు ఉన్న 930 ప్రైవేటు చికిత్సాలయాల్లో నిరభ్యంతర పత్రాలున్నది కేవలం 10 శాతానికేనన్న కథనాలు నివ్వెరపరుస్తున్నాయి. ఒక్క ఆస్పత్రులనేముంది, దేశం నలుమూలలా ఎన్నో బహుళ అంతస్తుల భవనాల్లోనూ జాతీయ నిర్మాణ స్మృతి(ఎన్‌బీసీ) నిబంధనల అమలు నిలువునా నీరోడుతోంది. 'ఇండియాలో అగ్నిప్రమాదాల నివారణకు ఉద్దేశించిన నిబంధనావళి అమెరికా, జర్మనీ, బ్రిటన్‌ ప్రమాణాలకు దీటుగా ఉన్నప్పటికీ అమలు పరచడంలో లోటుపాట్లే ప్రధాన సమస్య' అని విదేశీ నిపుణులు లోగడే ఆక్షేపించారు. అదెంత అక్షరసత్యమో, కేంద్రం మూడేళ్ల క్రితం పార్లమెంటుకు నివేదించిన గణాంక వివరాలు ధ్రువీకరించాయి. సువిశాల జనాభా అవసరాలకు కావాల్సిన అగ్నిమాపక కేంద్రాల్లో 39శాతం మేర కొరత నేటికీ పీడిస్తోంది. సిబ్బంది, వాహనాల పరంగానూ లోటుపాట్లను సరిదిద్దడంలో ఉదాసీన ధోరణుల పర్యవసానాలేమిటో కళ్లముందే తాండవిస్తున్నాయి. 2015నుంచి అయిదేళ్లలోనే దేశంలో అగ్నిప్రమాదాల మృతుల సంఖ్య 71వేలకు పైబడినట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదికలు చాటుతున్నాయి. భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను అవినీతి రహితం చేసి, అగ్నిమాపక వ్యవస్థను బలోపేతపరచడమే- విషాద ఉదంతాల ఉరవడికి సరైన విరుగుడు కాగలుగుతుంది. నిర్లక్ష్యం, అవినీతి, నిష్పూచీతనాలపై వేటు వేయాల్సిన విధ్యుక్త ధర్మ నిర్వహణలో నెగ్గుకురావడమే ప్రభుత్వాలకు అసలైన అగ్నిపరీక్ష!

ఇదీ చదవండి:గుప్పుమంటున్న గంజాయి- యథేచ్ఛగా సాగు, రవాణా

ABOUT THE AUTHOR

...view details