మహారాష్ట్రలోని భండారా జిల్లా ప్రభుత్వాసుపత్రి గుండెలు పిండే మహా విషాదానికి నెలవైంది. నవజాత శిశు సంరక్షణ విభాగంలో నిశిరాత్రివేళ రాజుకొన్న నిప్పు మూడు నెలలలోపు వయసున్న పదిమంది పసి నలుసుల్ని కబళించింది. మరో ఏడుగురు చిన్నారుల్ని అగ్నిమాపక సిబ్బంది రక్షించగలిగినా- కాలిన గాయాలతో ముగ్గురు, పొగ కమ్మేయడంతో ఊపిరాడక ఏడుగురు బలైపోవడం కలచివేస్తోంది. అనారోగ్యంతో ఆసుపత్రిని ఆశ్రయిస్తే అక్కడ అగ్నిప్రమాదం సంభవించి ఆయువు తీరిపోవడాన్ని మించిన ఘోరం ఏముంటుంది? మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూ విభాగంలో సెప్టెంబరు చివరివారంలో జరిగిన అగ్నిప్రమాదం ముగ్గురు అభాగ్యుల ఉసురు తీసింది. నిరుడు ఆగస్టు తొలివారంలో అహ్మదాబాద్‌లోని శ్రేయా ఆసుపత్రి కరోనా ఐసీయూ వార్డులో రేగిన మంటలు ఎనిమిది మంది ప్రాణాల్ని కబళించాయి. దాదాపు అదే సమయంలో విజయవాడ స్వర్ణాప్యాలెస్ ఘోరం పదిమంది ప్రాణాల్ని బలిగొంది. నవంబరు చివరి వారంలో గుజరాత్‌లోని ఒక కొవిడ్ ఆసుపత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం అయిదుగుర్ని మృత్యు పరిష్వంగానికి ఈడ్చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు
ప్రభుత్వాసుపత్రుల్లో, ఐసీయూల్లో ఈ దుర్భర స్థితిగతులపై ఆవేదన చెందిన సుప్రీంకోర్టు- దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ అగ్నిప్రమాద సన్నద్ధత తీరుతెన్నులపై తనిఖీ జరగాలని ఆదేశించింది. కొవిడ్ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాద నిరోధక చర్యల్ని నెలకోసారి పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కమిటీని, ప్రతి ఆసుపత్రికి ఒక నోడల్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాలనీ నిర్దేశించింది. భాగ్యనగరంలో అగ్నిమాపక శాఖ అనుమతుల్లేకుండా ఎకాయెకి 1500 ఆసుపత్రులు నడుస్తుండగా, విజయవాడలో పాతికపడకల లోపు ఉన్న 930 ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం పదిశాతానికే అగ్ని మాపక నిరభ్యంతర పత్రాలున్నాయి. నిర్లక్ష్యం, నిష్పూచీతనాలతో దేశవ్యాప్తంగా ఆసుపత్రులు ఇలా నిప్పుతో చెలగాటమాడుతుండబట్టే అభాగ్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.