"సాంస్కృతిక ప్రసరణల ద్వారా వ్యక్తి అవసరాలను భాష తీర్చగలగాలి. గతించిన తరాల విలువలను భావితరాలకు అందించగలగాలి. సంస్కృతి, ఆచారాలు, లక్ష్యాలను తీర్చగలగాలి."
- గిడుగు వెంకట రామమూర్తి
నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం అయిదో తరగతి, అవసరమైతే ఆపై తరగతుల వరకు తప్పనిసరిగా మాతృభాషలోనే బోధన సాగాలన్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొత్త విధానం మేరకు 2022నాటికి 'నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్(ఎన్‌సీఎఫ్)' సిద్ధమవుతుంది. విద్యార్థులకు ఒత్తిడిని దూరంచేసేలా ఒరవడి దిద్దాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. ఈ నేపథ్యంలో 'చదవడం కోసం నేర్చుకోవడం కాకుండా, నేర్చుకోవడం కోసం చదువుకోవడం' అన్న దిశగా విద్యావిధానాన్ని మార్చాల్సిన అవసరముంది. ఇప్పటికే ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో కొనసాగించడంలో ఎస్తోనియా, ఐర్లాండ్, ఫిన్లాండ్, జపాన్, దక్షిణ కొరియా, పోలెండ్ వంటివి ముందంజలో ఉన్నాయి.
ధ్వనుల రూపం
సాధారణ భావవ్యక్తీకరణలో అసంకల్పితంగా ఉపయోగించే ధ్వనుల రూపం మాతృభాష. పుట్టిన ప్రతి బిడ్డా ముందుగా నేర్చుకొనేది తల్లి భాష. మానవుడి మెదడులోని మాతృభాష, ఇతర భాషలను తర్జుమా (అనువాదం) చేసి ఆ భావాన్ని మనసుకు అందిస్తుంది. మాతృభాషల గుర్తింపులో 1948, మార్చి 21న పాకిస్థాన్ గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా తొలిసారిగా 'ఉర్దూ'ను తూర్పు, పశ్చిమ పాకిస్థాన్ అధికార భాషగా ప్రకటించారు. తూర్పు పాకిస్థాన్ ఆపై బంగ్లాదేశ్‌గా విడిపోయిన తరవాత 'బంగ్లా'ను ప్రధాన భాషగా ఎంచుకుంది. అంతకుముందు 1952, ఫిబ్రవరి 21న అక్కడి విద్యార్థులు పోరాటం చేపట్టడంతో భాషోద్యమాలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మాతృభాషలు మనుగడ కోల్పోతున్నాయి.
భాషా కుటుంబాలు
ప్రపంచీకరణలో భాగంగా ఐరోపాలో చాలా భాషలు అంతర్ధానమవుతున్నాయని గమనించిన ఐక్యరాజ్య సమితి 1999, నవంబర్ 17న ప్రపంచ భాషల సంరక్షణ బాధ్యతను యునెస్కోకు అప్పగించింది. ప్రజల్లో విభిన్న భాషలు, సంస్కృతులపట్ల అవగాహన కోసం, ప్రపంచ భాషల మధ్య సమగ్రతకు, మాతృభాషా భావాన్ని పెంపొందించాలని ఐక్యరాజ్య సమితి యునెస్కోకు సూచించింది. ప్రపంచవ్యాప్తంగా మాతృభాషలను గౌరవిస్తూ, మాతృభాషల చరిత్ర సంస్కృతుల పరిరక్షణకు ఐరాస 2010 సంవత్సరాన్ని 'అంతర్జాతీయ సంస్కృతుల పునరుద్ధరణ వత్సరం'గా గుర్తించింది. వివిధ ప్రాంతాల్లోని భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక స్థితిగతులు, ఆహారపు అలవాట్లలో మార్పులకు అనుగుణంగా పలు రకాల భాషా కుటుంబాలు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఇండో ఆర్యన్ భాషలు 73శాతం, ద్రవిడ భాషలు 20.30శాతం, ఐరోపా భాషలు 1.38శాతం, సైనో టిబెటన్ 0.85 శాతం, ఇతర భాషలు మాట్లాడేవారు 4.47శాతం దాకా ఉన్నారు.
'త్రిలింగ' నుంచి..
భారతీయ సమాజం బహుళభాషా సమ్మేళనం. మన దేశంలో 1,652 భాషలు, మాండలికాలు ఉన్నాయి. కొన్నింటికి లిపి లేదు. 23 భాషలు మాట్లాడేవారు జనాభాలో 97 శాతం ఉండటంతో రాజ్యాంగంలోని 345 అధికరణ ఎనిమిదో షెడ్యూలులో అధికార భాషలుగా కొనసాగుతున్నాయి. సుమారు రెండు వేల ఏళ్ల చరిత్ర గల భాషలను గౌరవిస్తూ భవిష్యత్తరాలకు భాషా సాంస్కృతిక వారసత్వాన్ని అందించాలనే ధ్యేయంతో రాజ్యాంగంలో 351 ఆర్టికల్ ప్రకారం తమిళం, సంస్కృతాలకు 2005లో; కన్నడ, తెలుగు భాషలకు 2006లో ప్రాచీన హోదా కల్పించారు. అజంత భాషగా వెలుగొందుతున్న తెలుగు 'త్రిలింగ' అనే పదం నుంచి ఉద్భవించింది. 15వ శతాబ్దంలో వెనీస్ వర్తకుడు నికోలో డి కాంటి మనదేశం నుంచి ప్రయాణిస్తూ తెలుగుభాషలోని పదాలు ఇటాలియన్ భాషలా అజంతాలుగా ఉన్నాయని పేర్కొనడంతో తెలుగుకు 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్'గా ముద్రపడింది. శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో మాతృభాషల మనుగడ నానాటికీ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు, అమెరికా సామ్రాజ్యవాద తాకిడికి మాతృభాషల ఉనికి దెబ్బతింటోంది.
మాతృభాషలోనే..
ఎవరి భాష వారికి కన్నతల్లి వంటిది. దురదృష్టవశాత్తు, మాతృభాష పరాయీకరణ సాధారణమైన రోజులివి. భాషా పరిరక్షణ తక్షణావసరంగా మారింది. ప్రాంతీయ భాషలను మాతృభాషలుగా పరిగణించి అధికార భాషలుగా తీర్చిదిద్దాలి. ప్రభుత్వ పాలన వ్యవహారాలు మాతృభాషలోనే సాగాలి. ప్రాథమికస్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు బోధన మాతృభాషలో అమలు జరపాలి. న్యాయస్థానాల్లోనూ తీర్పులు మాతృభాషలో వెలువడాలి. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, భాషా పండితులు, విద్యావంతులు మాతృభాష మనుగడకు అహరహం కృషిచేస్తే తల్లిభాషలకు మన్నన లభిస్తుంది!
- గుమ్మడి లక్ష్మీనారాయణ, సామాజిక విశ్లేషకులు
ఇదీ చదవండి:ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని అభ్యర్థుల ఆందోళన..