తెలంగాణ

telangana

ETV Bharat / opinion

చెట్టు... మానవ శ్రేయానికి నిచ్చెన మెట్టు - చెట్లు నరికివేత

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వందకోట్ల ప్రజలు పర్వతప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. పశువుల మేతకు, వంటచెరకుకు వారికి అడవులే ఆధారం. కానీ, వాళ్లెవరూ చెట్లను నరకరు. కేవలం ఎండి కిందపడిన పుల్లలనే తెచ్చుకుంటారు. అడవులను నరికేయడం వల్ల వారి జీవితాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. అడవులు క్షీణిస్తుండటంతో వర్షాలు కురిసినప్పుడు దిగువ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. మట్టిపెళ్లలు విరిగిపడుతున్నాయి.

felling of trees
చెట్లను నరకటం

By

Published : Jul 22, 2021, 5:45 AM IST

వర్షం పడాలన్నా, ప్రాణులన్నీ హాయిగా ఉండాలన్నా అడవులు బాగుండాలి. మనిషి స్వార్థం మితిమీరి అరణ్యాలు నానాటికీ తరిగిపోతున్నాయి. ముఖ్యంగా నేల మీద ఉన్న అడవులను, వాటిలోని సంపదను దోచుకున్నది సరిపోలేదన్నట్లు ప్రస్తుతం మనిషి చూపు పర్వత ప్రాంతాల్లోని అడవులపై పడింది. ఫలితంగా ఆ అరణ్యాలు సైతం క్రమంగా అంతరించిపోతున్నాయి. ప్రపంచంలోని ఉష్ణమండల పర్వత ప్రాంత అడవుల్లో దాదాపు సగం ఆగ్నేయాసియా దేశాల్లోనే ఉంటాయి.

ఎత్తయిన ప్రాంతాల్లో ఉండే ఈ అడవులు జీవ వైవిధ్యానికి ఆలవాలాలు. భూగ్రహం మీద మరెక్కడా కనిపించని అనేక జీవజాతులు పర్వతప్రాంత అడవుల్లోనే నివసిస్తాయి. మనిషి చర్యల వల్ల ఈ అడవులు కుంచించుకుపోతుండటంతో ఆయా జాతులన్నీ అంతరించిపోయే ప్రమాదం దాపురిస్తోంది. మరీ ప్రధానంగా ఎత్తయిన ప్రాంతాల్లో ఉండే అడవులను ఇటీవల సాగుకు అనుకూలంగానూ మార్చేస్తున్నారు.

తీవ్ర ప్రభావం

అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పలు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శతాబ్దపు తొలి రెండు దశాబ్దాల కాలంలో ఉష్ణమండల పర్వత ప్రాంత అడవుల్లో కర్బన నిల్వల సాంద్రత గణనీయంగా తగ్గిపోయిందని, అడవులు కూడా అంతరించిపోయాయని వెల్లడైంది. 2000 సంవత్సరంలో పర్వత పాదాల వద్దే ఎక్కువగా అడవుల నరికివేత కనిపించగా, మరో పదేళ్ల తరవాత కొండల పైభాగాలకూ ఆ విధ్వంసం విస్తరించింది. 2001 నుంచి 2019 మధ్య దక్షిణాసియాలో ఏకంగా 6.10 లక్షల చదరపు కిలోమీటర్ల మేర అడవులు అంతరించిపోయాయి. ఇది థాయ్‌లాండ్‌ మొత్తం భూభాగం కంటే ఎక్కువ! ఇందులో దాదాపు 31 శాతం- అంటే 1,89,100 చదరపు కిలోమీటర్లు పర్వతాల పైభాగాల్లోని అరణ్యాలే. వీటన్నింటినీ నరికేసి వ్యవసాయానికి అనుకూలంగా మార్చేసుకున్నారు. ఈ విధ్వంస వేగం పోనుపోను పెరుగుతూ పోయింది.

కొండల పైభాగాల్లోనే..

ఒక్క 2019లోనే మొత్తం అడవుల నరికివేతలో దాదాపు 42 శాతం కొండల పైభాగాల్లో చోటుచేసుకుందని పరిశోధకులు చెబుతున్నారు. ఏడాదికి 15 మీటర్ల చొప్పున పైకి వెళుతూ అడవులను హరిస్తున్నారు. ప్రధానంగా వరి, ఆయిల్‌పామ్‌, రబ్బరు తోటల పెంపకానికి అడవులను నరికేస్తున్నారు. పెద్దమొత్తంలో ఆదాయం లభిస్తుండటం, వాటి సాగుకు తగినంత భూమి కొనాలన్నా, లీజుకు తీసుకోవాలన్నా ఎక్కువ మొత్తంలో ధనం వెచ్చించవలసి రావడంతో స్వార్థపరుల కళ్లు కొండలమీద పడ్డాయి.

మొదట్లో కొన్ని దశాబ్దాల పాటు కేవలం పర్వత పాద ప్రాంతాల్లోనే అడవులను నరికేసి, తమకు కావల్సిన తోటలు పెంచుకుంటూ వచ్చారు. పర్వతాల పైభాగాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, ఏటవాలు వంటి పరిస్థితులు సాగుకు సానుకూలంగా కనిపించడంతో అక్కడి అడవులనూ ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న అడవులపైనా కబ్జాదారుల కళ్లు పడుతున్నాయని, వారివద్ద పనిచేసేవారు సైతం వరిసాగు వంటి వాటి కోసం యథేచ్ఛగా అడవులను నరికేస్తున్నారని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దెబ్బతిన్న జీవితాలు..

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వందకోట్ల ప్రజలు పర్వతప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. పశువుల మేతకు, వంటచెరకుకు వారికి అడవులే ఆధారం. కానీ, వాళ్లెవరూ చెట్లను నరకరు. కేవలం ఎండి కిందపడిన పుల్లలనే తెచ్చుకుంటారు. అడవులను నరికేయడం వల్ల వారి జీవితాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. పై ప్రాంతాల్లో అడవులు క్షీణిస్తుండటంతో వర్షాలు కురిసినప్పుడు దిగువ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. మట్టిపెళ్లలు విరిగిపడుతున్నాయి. భూమి కోసుకుపోయిన మట్టి, వ్యవసాయ వ్యర్థాలు ఆ వరదతో కలవడంతో కింది ప్రాంతాల్లో నీటి నాణ్యత, అందుబాటు సైతం దారుణంగా దెబ్బతింటున్నాయి.

2018లో ఇండోనేసియా ఆగ్నేయ ప్రాంతంలో వచ్చిన వరదల కారణంగా ఎన్నో వేలమంది నిర్వాసితులయ్యారు. మరణాలూ సంభవించాయి. అడవులను నరికేయడమే దీనికి కారణం. అరణ్యాలు లేకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో వర్షాలు కూడా తగ్గిపోతున్నట్లు గుర్తించారు. ప్రభుత్వాలు దీనిపై ఇలాగే అలక్ష్యం వహిస్తే పర్యావరణానికి పెనుముప్పు తప్పదు.

ప్రభుత్వాల ఉదాసీనత

అడవులను నరికేసిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సగటున రెండు డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగినట్లు ఈ ఏడాది జరిగిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇది ఎన్నో దుష్పరిణామాలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉండే అనేక క్షీరదాలు, పక్షులు, ఉభయచర జీవులు అడవుల మీదే ఆధారపడతాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆయా ప్రాంతాల్లో నివసించే జంతుజాతులు తమ ఆవాసాలను మార్చుకుంటున్నాయి. మరికొన్ని జాతులు పూర్తిగా అంతర్థానమవుతున్నాయి. ఎక్కడో ఎత్తయిన ప్రాంతాల్లో ఉండటంతో ఆ అడవుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు.

అంత ఎత్తయిన ప్రాంతాల మీద నిఘా ఉంచడం కష్టమని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే పర్వత ప్రాంత అడవుల మీద నిఘా ఉంచడం పెద్ద కష్టమేం కాదు. డ్రోన్ల సాయంతో ఎక్కడ ఏం జరుగుతోందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. వాటి ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటేనే అడవులను, వాటిపై ఆధారపడిన జీవావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది.

- రామశేషు

ABOUT THE AUTHOR

...view details