తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఫాదర్స్ డే రోజు​.. మీ తండ్రికి ఇవ్వాల్సిన '5' స్పెషల్​ 'ఆర్థిక' బహుమతులు ఇవే! - తండ్రి కోసం కూతురు ఇచ్చే బహుమతి

Fathers day Special Gifts : మీరు మీ తండ్రిని ప్రేమిస్తున్నారా? ఆయన కోసం ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే కచ్చితంగా మీ తండ్రి కోసం 5 ఆర్థిక బహుమతులు ఇవ్వండి. అవేంటంటే?

Etv father's day special gifts
Etv father's day special gifts

By

Published : Jun 17, 2023, 1:22 PM IST

Fathers Day Special Gifts : తల్లిదండ్రులు మనల్ని కని, పెంచిన దైవాలు. వారిని గౌరవించడం మన బాధ్యత. తల్లి మనకు నవమాసాలు మోసి, జన్మనిస్తే.. తండ్రి మాత్రం జీవితాంతం మన బాగోగులు చూస్తూ, మనల్ని వృద్ధిలోకి తేవడానికి అహర్నిశలూ శ్రమిస్తారు. అలాంటి తండ్రిని గౌరవిస్తూ చేసుకునే పండుగే ఫాదర్స్ డే.

ఏటా.. జూన్ 18న అందరూ ఫాదర్స్ డే ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ప్రియమైన తండ్రి కోసం విలువైన బహుమతులు కూడా ఇస్తారు. కానీ ప్రతి బిడ్డ.. తన తండ్రి కోసం కచ్చితంగా ఇవ్వాల్సిన ఆర్థిక బహుమతులు కొన్ని ఉంటాయి. అవేంటో చూద్దాం.

1. ఆరోగ్య బీమా
Health Insurance : వృద్ధాప్యంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య సమస్యలు కచ్చితంగా వస్తాయి. అందువల్ల మీ తల్లిదండ్రుల భవిష్యత్​ వైద్య, ఆరోగ్య అవసరాల కోసం మంచి హెల్త్​ ఇన్సూరెన్స్ తీసుకోండి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్​కు వర్తించే, పూర్తి కవరేజ్​ను కల్పించే ఆరోగ్య బీమా తీసుకోండి. దీని వల్ల హెల్త్​ చెక్​-అప్​, ప్రివెంటెవ్​ స్క్రీనింగ్స్, డాక్టర్స్​ కన్సల్టేషన్​ అన్నీ చేసుకోవచ్చు. ఈ విలువైన బహుమతి మీ తండ్రికి ఇవ్వడం వల్ల.. ఆయన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఆయనపై ఎలాంటి ఆర్థిక భారం పడదు కనుక జీవిత చరమాంకంలో ప్రశాంతంగానూ ఉంటారు.

2. ఆర్థిక అత్యవసర నిధి ఏర్పాటు
Emergency Fund : మీ తండ్రి పేరు మీద ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయడమే కాదు. ప్రత్యేకంగా ఆర్థిక అత్యవసర నిధిని కూడా ఏర్పాటు చేయాలి. దీని వల్ల భవిష్యత్​లో అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు కూడా.. ఎలాంటి ఒడుదొడుకులకు లోనుకాకుండా చూసుకోవచ్చు. ఉదాహరణకు అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు రావడం, ఉద్యోగం కోల్పోవడం లేదా అత్యవసరంగా ఇంటికి మరమ్మత్తులు చేయాల్సిరావచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆర్థిక అత్యవసర నిధి చాలా ఉపయోగపడుతుంది.

మీరు ముందుగా మీ తండ్రి పేరుతో.. రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఎమర్జెన్సీ ఫండ్​ను ఏర్పాటుచేయండి. ఇది మీకు ఆర్థికంగా కష్టమనిపిస్తే.. మీ తండ్రి పేరు మీద లిక్విడిటీ బాగా ఉండే 'షార్ట్​ టెర్మ్​ డెట్​ ఫండ్స్'​లో ఎస్​ఐపీ చేయడం ప్రారంభించండి.

3. మీ నాన్న అప్పులు తీర్చేయండి
మీ తండ్రి మీ కోసం ఎంతో కష్టపడి ఉంటారు. అలాంటి ఆయన అప్పులను తీర్చడం మీ బాధ్యత. అందువల్ల మీ నాన్నకు ఏవైనా అప్పులుగానీ, లోన్​లుగానీ ఉంటే.. వాటిని తీర్చే ప్రయత్నం చేయండి. అలా వీలుకానీ పక్షంలో కనీసం మీకు వీలైనంత వరకు ఆర్థికంగా సాయం చేయండి. అది మీ తండ్రికి ఎంతో ఆర్థిక సాంత్వన కల్పించడం సహా.. ఆయనకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది.

4. మీ నాన్న కోసం ఎస్ఐపీ (సిప్​) ప్రారంభించండి
SIP PLan : క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టడం.. సంపద వృద్ధి చెందడానికి మంచి మార్గం అవుతుంది. మీరు మీ తండ్రి పేరు మీద సిప్​ చేయడం ప్రారంభించినట్లయితే.. భవిష్యత్తులో అది ఆయనకు మంచి ఆర్థిక భరోసాను అందిస్తుంది. ఇందు కోసం మీరు హై-డివిడెండ్​ ఇచ్చే స్టాక్స్​ను మీ తండ్రి పేరు మీద కొనుగోలు చేయవచ్చు. లేదా ఓ మంచి మ్యూచువల్​ ఫండ్​లో సిప్​ చేయడం ప్రారంభించవచ్చు. అయితే ఇలాంటి పెట్టుబడులు పెట్టే ముందు మీ రిస్క్ టోలరెన్స్, ఫైనాన్షియల్​ గోల్స్​ను దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే మంచి ఫైనాన్షియల్​ అడ్వైజర్​ను సంప్రదించడం ఉత్తమం.

బాండ్స్​లో పెట్టుబడులు పెట్టడం కూడా మంచి ఆప్షన్​. ఎందుకంటే వీటిలో రిస్క్​ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ తండ్రి పేరు మీద గవర్నమెంట్​ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్​ కొనుగోలు చేయవచ్చు. పూర్తిగా రిస్క్ లేని రిటర్న్స్ కోసం మీ తండ్రి పేరు మీద కచ్చితంగా బ్యాంకులో ఫిక్స్​డ్ డిపాజిట్ చేయాలి. అలాగే సీనియర్ సిటిజన్​ సేవింగ్స్ స్కీమ్​ లాంటి ప్రభుత్వ పథకాల్లో మీ నాన్న పేరును నమోదు చేయండి.

5. సమగ్ర ఆర్థిక ప్రణాళికను బహుమతిగా ఇవ్వండి
మీ తండ్రి ఇటీవలే రిటైర్ అయ్యుంటే.. ఆయన కోసం సమగ్ర ఆర్థిక ప్రణాళికను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. భవిష్యత్​ లక్ష్యాలకు అనుగుణంగా మంచి పెట్టుబడులు పెట్టి.. ఇన్​కం జనరేట్​ అయ్యే విధంగా ఆర్థిక ప్రణాళికను అందించవచ్చు.

మీ తండ్రి పదవీ విరమణ తరువాత 'సిస్టమేటిక్ విత్​డ్రావెల్ ప్లాన్'ను ఏర్పాటు చేయండి. దీనివల్ల ఆయనకు రిటైర్మెంట్ తరువాత కూడా క్రమంగా ఆదాయం జనరేట్ అవుతుంది. భవిష్యత్​ భద్రంగా ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details