మహోద్ధృతంగా సాగుతున్న రైతు ఉద్యమం మరోసారి రక్తసిక్తమైంది. నిరవధిక నిరసనవ్రతంలోని అన్నదాతల మీదకు కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కాన్వాయ్‌లోని కారు దూసుకెళ్లింది. నాలుగు నిండు ప్రాణాలను కర్కశంగా చిదిమేసింది. ఆగ్రహోదగ్ధులైన రైతుల ప్రతిదాడిలో మరో వాహనంలోని నలుగురు హతులయ్యారు. మంత్రి కుమారుడు ఉద్దేశపూర్వకంగానే కారును రైతులపైకి ఉరికించారని ఉద్యమనేతలు ఆరోపిస్తున్నారు. 'మా అబ్బాయికి ఏ పాపమూ తెలియదు' అని అమాత్యశేఖరులు నమ్మబలుకుతున్నారు. లఖింపూర్ ఖేరి జిల్లాలో చోటుచేసుకొన్న ఈ హింసాత్మక ఘటనలపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించి నిజానిజాలు నిగ్గుతేలుస్తామని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అసువులు బాసిన అన్నదాతల కుటుంబాలకు రూ.45 లక్షల పరిహారమూ అందిస్తామంటోంది. 'సాగుచట్టాలను నిరసిస్తున్న వారికి కర్రలతో బుద్ధి చెప్పండి' అంటూ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ రెండు రోజుల క్రితమే భాజపా శ్రేణులను ఎగదోశారు. కట్టుదాటిన ఉద్యమకారుల తలలు పగలగొట్టండని ఐఏఎస్ అధికారి ఆయుష్ సిన్హా అంతకు మునుపు పోలీసులను రెచ్చగొట్టారు. రాష్ట్రాలతో, రైతు సంఘాలతో చర్చించకుండా కేంద్రం ఏకపక్షంగా పట్టాలెక్కించిన మూడు చట్టాలతో తమ భవిష్యత్తు అగమ్యగోచరం కాబోతోందన్న ఆందోళనే- అన్నదాతలను రోడ్ల మీదకు ఈడ్చింది. పిల్లాజెల్లాతో కలిసి పలు బాధలను పంటిబిగువున భరిస్తూ నెలల తరబడి ఉద్యమపథంలో కొనసాగేలా చేసింది. రక్తాశ్రువులు చిందిస్తున్న వారి గోడు ఆలకించకుండా- ఉగ్రవాదులు, రాజకీయ ప్రేరేపితులంటూ నేతాగణాలు నోరు పారేసుకుంటున్నాయి! 'రైతు సంఘాలతో ఎన్నోమార్లు చర్చించాం. కానీ, తమకేమి కావాలో వారు ఇప్పటివరకు సూటిగా చెప్పలేదు' అని ప్రధాని మోదీ తాజాగా విమర్శించారు. తమ పాలిట నల్లశాసనాలైన ఆ మూడింటిని పూర్తిగా రద్దు చేసి, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కర్షకులు ఏనాడో సర్కారుకు స్పష్టంచేశారు. ఆ దిశగా పట్టువిడుపులు ప్రదర్శించడానికి అధికార పక్షం సంసిద్ధమైతేనే- సంక్షుభిత రైతులోకానికి సాంత్వన చేకూరుతుంది!
సాగు చట్టాలపై వెనక్కి తగ్గడమే మేలు
రాష్ట్రాలతో, రైతు సంఘాలతో చర్చించకుండా కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలతో తమ భవిష్యత్తుపై బెంగతో అన్నదాతలు చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో పలు ఘటనల్లో ప్రాణనష్టం జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశానికి వెన్నెముక వంటి అన్నదాతకు భవితపై భరోసా ఇచ్చేలా మూడు సాగు చట్టాలను సమీక్షిస్తేనే రైతులకు సాంత్వన చేకూరే అవకాశం ఉంది.
పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కని దుర్భరావస్థలో దేశవ్యాప్తంగా కర్షక కుటుంబాలు కునారిల్లుతున్నాయి. వ్యవసాయంపై ఆధారపడిన వారిలో రోజుకు 28 మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. సాగుదారుల జీవితాల్లో వెలుగు నింపడానికంటూ కేంద్రం తెచ్చిన చట్టాలు అందుకు అక్కరకు రాకపోగా- బడుగు రైతుల భవితను కార్పొరేట్లకు బలిపెట్టబోతున్నాయనే ఆందోళనలు నిరుటి నుంచే వ్యక్తమవుతున్నాయి. వాటిని మన్నించకపోగా- అన్నదాతల అభ్యర్థన మేరకే ఆ శాసనాలను రూపొందించామని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా లోగడ సెలవిచ్చారు. పార్లమెంటులో మెజారిటీతో ఆమోదించిన చట్టాలను వెనక్కు తీసుకొంటే- రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడతాయని మరో మంత్రి రాందాస్ ఆఠ్వలే ప్రవచించారు. చట్టసభల్లోని సంఖ్యాబలంతో నెగ్గుకొచ్చినంత మాత్రాన సర్కారీ నిర్ణయాలన్నీ ప్రజాస్వామ్యబద్ధం కాజాలవన్నది వాస్తవం. ప్రజాప్రతినిధుల సమష్టి భాగస్వామ్యం, కూలంకష చర్చలకు అవకాశం లేకుండా శాసనాలకు పురుడుపోయడం- రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకే విరుద్ధం! అన్నదాతల ఆందోళనల ప్రభావం కొన్ని రాష్ట్రాలకే పరిమితమని, తమకు ఢోకాలేదని అధికారపక్షం తలపోస్తే- పర్యవసానాలు అనుభవంలోకి వచ్చేసరికి అంచనాలన్నీ తలకిందులు కావచ్చు. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కాదని ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నోసార్లు నిరూపితమైంది. 'రాజకీయాల కన్నా దేశ ప్రయోజనాలకు గొడుగుపట్టడమే భారత ప్రజాతంత్రం విశిష్టత' అన్న వాజ్‌పేయీ స్ఫూర్తిసందేశాన్ని అవలోకిస్తే- తన కర్తవ్యమేమిటో ప్రభుత్వానికి అవగతమవుతుంది. దేశానికి వెన్నెముక వంటి అన్నదాతకు భవితపై భరోసా ఇచ్చేలా మూడు సాగు చట్టాలను సత్వరం ఉపసంహరించుకోవడమే ప్రాప్తకాలజ్ఞత అనిపించుకుంటుంది!
ఇవీ చదవండి: