ఒడుదొడుకుగా ఉండే రాతి బంజరు భూములు, ఆక్సిజన్ కూడా అందని ఎత్తైన భూభాగాలు, ఒళ్లును ముళ్లులా గుచ్చుకునే శీతల పవనాలు... తూర్పు లద్దాఖ్‌లో ఉండే ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు చైనా సైనికులకు కొత్తే కావచ్చు. కానీ బెబ్బులిలా ఎగసిపడే భారత సైన్యానికి కాదు. మన యోధులకు ఈ పరిస్థితుల్లో మనుగడ సాధించడం కొట్టిన పిండి.
సియాచిన్ హిమానీనదంతో పాటు ఉత్తర సిక్కింలోని ఎత్తైన ప్రాంతాల్లో భారత సైన్యం విధులు నిర్వహించే ప్రాంతాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. భారత సైన్యంలోని 350 యూనిట్లు ఇలాంటి పరిస్థితుల్లోనే విధులు నిర్వహిస్తాయి. రాష్ట్రీయ రైఫిల్స్, అసోం రైఫిల్స్, ప్రత్యేక దళాలకు చెందిన 70 యూనిట్లు వీటికి అదనం.
వెయ్యి మంది ఉండే ప్రతి పదాతి దళ యూనిట్‌లోని సభ్యులను రెండు సంవత్సరాల పాటు లద్దాఖ్‌లో మోహరిస్తారు. ఇందులో ఒక సంవత్సరం సియాచిన్‌లో ఉండాలి. అక్కడికి వెళ్లే ముందు సైనికులంతా సియాచిన్ యుద్ధ పాఠశాలలో కఠోర శిక్షణను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యుద్ధ పాఠాశాల సముద్ర మట్టానికి 12 వేల ఎత్తులో ఉంది.
చైనాకు లేదీ అనుభవం!
సియాచిన్‌లో మోహరించిన తర్వాత పరిస్థితులను బట్టి విధుల కోసం 90 రోజుల పాటు అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోకి సైనికులను పంపుతారు. ఈ ప్రదేశాలు సముద్ర మట్టానికి 18 వేల నుంచి 20 వేల ఎత్తున ఉంటాయి. ఉడికే రక్తాన్ని సైతం గడ్డకట్టించే చలి, మైనస్ 50 డిగ్రీలకుపైగా పడిపోయే ఉష్ణోగ్రతలు, 24 గంటలూ ఎటు చూసినా మంచు... చైనా సైనికులకు ఇలాంటి పరిస్థితులపై అవగాహన లేదు. ఇలాంటి కఠినమైన యుద్ధక్షేత్రాల్లో విధులు నిర్వహించిన అనుభవం లేదు.
విహారయాత్ర అనుభూతి
సియాచిన్‌లో విధులు పూర్తి చేసుకున్న తర్వాత తూర్పు లద్దాఖ్‌కు చేరుకుంటారు. 12 నుంచి 18 వేల ఎత్తు ఉండే ప్రాంతాల్లో పహారా కాస్తారు. లద్దాఖ్‌తో పోలిస్తే ఎన్నో రెట్లు తీవ్రమైన పరిస్థితులను సియాచిన్‌లో ఎదుర్కొంటారు సైనికులు. కాబట్టి సియాచిన్ నుంచి వచ్చిన సైనికులకు లద్దాఖ్‌లో పరిస్థితులు అంత ప్రమాదకరంగా కనిపించవు. ఇక్కడ హిమపాతాల ప్రమాదం ఉండదు, భూభాగంలో పగుళ్లు ఉన్నాయేమోనన్న అనుమానాలు అవసరం లేదు. మంచు బాధలూ అంతగా ఉండవు. అందుకే ఇక్కడికి వచ్చిన జవాన్లకు విహారయాత్రకు వచ్చిన అనుభూతి కలుగుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు.
ఎల్ఏసీకి సియాచిన్ బలగాలు