సాధారణంగా తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా ఉత్పన్నమవుతుంది. దాన్ని కలిపేయడం వల్ల నిర్వహణ పరంగా సమస్య తలెత్తుతోంది. చెత్తను పనికిరానిదిగా భావించకుండా ఆర్థిక వనరుగా మార్చితేనే ఈ సమస్యకు గట్టి పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం పోగుపడుతున్న చెత్తను సరైన రీతిలో శుద్ధి చేస్తే 80 నుంచి 90 శాతం తిరిగి వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. గతంలో పల్లెల్లో పశుసంపద అధికంగా ఉండటం వల్ల పేడతో పాటు, ఇంట్లోని చెత్తను పెంట కుప్పలపై పోయడం వల్ల కుళ్లి ఎరువయ్యేది.
వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగి, పశు సంపద తగ్గడం వల్ల చెత్తను వృథాగా ఇంటి చుట్టుపక్కల, రోడ్లపై వేయడం పరిపాటిగా మారింది. గ్రామాల్లో చెత్త సమస్యగా మారకముందే ప్రభుత్వాలు దృష్టి సారించి వ్యర్థాల నిర్వహణను చురుగ్గా చేపట్టాలి. చెత్త సేకరణ, రవాణా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహణ వంటివి ఘన వ్యర్థాల పరిష్కారానికి కీలకం. సహజ వనరుల సంరక్షణ కోసం వ్యర్థాల నుంచి సంపద సృష్టించే ప్రయత్నాలను విరివిగా చేపట్టాలి. ఇందుకు ప్రజల చొరవ చాలా ముఖ్యం. ఇంటి వద్ద వ్యర్థాల నిర్వహణతోపాటు, సామూహిక నిర్వహణకూ పాటుపడాలి. చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చుకునేలా కంపోస్ట్ గుంతల వంటి విధానాలను ప్రోత్సహించాలి. తడి వ్యర్థాలను ఎరువుగా మార్చడానికి వర్మి కంపోస్ట్ వంటి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
ఆ దేశాలు ఆదర్శం..
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో స్వీడన్, ఫ్రాన్స్, రువాండా, చైనా వంటి దేశాలు ప్రభావశీల పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలోనే సమర్థమైన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ స్వీడన్‌లో ఉంది. అక్కడ ఒక్కశాతం లోపు వ్యర్థాలు మాత్రమే భూమిలో కలిసేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. 50శాతం గృహ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. స్పెయిన్‌లోనూ వ్యర్థాలతో కరెంటు తయారవుతోంది. టోక్యో ఒలింపిక్స్ విజేతలకు అందించే పతకాలను సుమారు 50వేల టన్నుల ఎలెక్ట్రానిక్ వ్యర్థాలతో తయారు చేయడం విశేషం. ఘన వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తిచేసే దేశంలోకెల్లా అతి పెద్ద కేంద్రం దిల్లీలో ఉంది.
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో స్వయం సహాయక సంఘాల సాయంతో ఘన, ద్రవ వనరుల కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పాలిథీన్, ప్లాస్టిక్ వ్యర్థాలను స్థానిక రోడ్ల నిర్మాణంలో వాడుతున్నారు. మన దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా వెలువడుతున్నాయి. వాటిని రీ-సైక్లింగ్ చేసే పరిశ్రమ ఏటా మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో తమిళనాడులో వేయి కిలోమేటర్ల మేర గ్రామీణ రోడ్లను నిర్మించారు. హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్లాస్టిక్ రహదారుల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నారు. భారత్ పెట్రోలియం సంస్థ వ్యర్థాల నుంచి డీజిల్ తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. తెలంగాణలో పల్లె ప్రగతి కార్యక్రమంలో సుమారు 12,600 గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటుచేశారు. 11,500 పైచిలుకు గ్రామాల్లో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. తద్వారా గ్రామ పంచాయతీలు చెత్త నిర్వహణతో పాటు, ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నాయి.