మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై శ్రీలంకను జవాబుదారీగా నిలబెట్టాలనే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించాలా, వ్యతిరేకించాలా అనే విషయంలో నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు వీడింది. ఈ వ్యవహారంలో భారత్ లౌక్యంగా వ్యవహరించింది. యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో తాజాగా మంగళవారం జరిగిన ఓటింగ్ ప్రక్రియకు గైర్హాజరవడం ద్వారా తన వైఖరిని తెలివిగా ప్రదర్శించింది. 2009లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టీటీఈ)తో సాయుధ పోరు ముగిసిన అనంతరం బాధితులకు సరైన న్యాయం చేయలేదనే ఆరోపణలపై ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న యూఎన్‌హెచ్‌ఆర్‌సీ సమావేశాల్లో శ్రీలంక మానవ హక్కులపై తీర్మానాన్ని ఎదుర్కొంటోంది.
భారత వైఖరిపై ప్రశంసలు..
యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో భారత్ ప్రదర్శించిన వైఖరిపై ఈ రంగంలోని నిపుణుల నుంచీ ప్రశంసలు అందుతుండటం గమనార్హం. 'చైనాతో కొనసాగుతున్న సంబంధాల కారణంగా భారత్ విషయంలో శ్రీలంక వైఖరి అర్థం చేసుకోదగినదే. డ్రాగన్‌తో లంక సంబంధాల విషయం మనకు అనవసరం, కాకపోతే, భారత భద్రత, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకూడదు. కొలంబో ఓడరేవు అభివృద్ధి కోసం భారత్, జపాన్‌లు చేసిన వినతిని మన్నించే విషయంలో శ్రీలంక సునిశితత్వాన్ని ప్రదర్శించింది. చైనా నావికా సౌకర్యాల విషయంలోనూ లంక నేతలు జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. కాబట్టి, మన భద్రతా పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో భారత్ నిర్ణయం సరైనదే' అని మాజీ దౌత్యవేత్త జి.పార్థసారథి వ్యాఖ్యానించారు. దక్షిణ శ్రీలంకలోని తమిళులకు భారత్‌తో ఎలాంటి సమస్యలు లేవు. భారత్ భారీస్థాయిలో ఆర్థిక సహాయమూ అందజేస్తోంది.
శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని వారికోసం సాయుధ పోరు తరవాత గృహ నిర్మాణం తదితర రూపంలో భారీగా సహాయ సహకారాలు అందజేసింది. తమ అంతర్గత సమస్యలను పరిష్కరించుకొనే విషయంలో లంకదే బాధ్యత. తమిళులు, శ్రీలంక మధ్య చర్చల వాతావరణం నెలకొనేలా భారత్ ప్రోత్సాహం అందిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఓటింగ్‌కు భారత్ గైర్హాజరవడం స్వాగతనీయ పరిణామం. తమిళుల ఆకాంక్షలను నెరవేర్చడం, పౌరులందరి హక్కులు, స్వేచ్ఛను పరిరక్షించే విషయంలో అంతర్జాతీయ సమాజంతో కలిసి సాగాలని శ్రీలంక ప్రభుత్వానికి భారత్ విన్నవించింది. 2009లో సాయుధ పోరు ముగిసిన అనంతరం ఒక పొరుగు దేశంగా లంక సహాయ, పునరావాస, పునర్నిర్మాణ ప్రక్రియకు భారత్ తోడ్పాటు అందించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.