కొద్దిరోజులుగా కిలో టమోటాను రూపాయి లేదా రెండు రూపాయలకు విక్రయించాల్సిన దుస్థితిలో రైతులు కుమిలిపోతున్నారు. పొలంలో వాటిని కోసిన కూలీలకిచ్చిన సొమ్ము కూడా చేతికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల కోయకుండానే పశువులకు వదిలేస్తున్నారు. ప్రజలంతా నాణ్యమైన కూరగాయలు తింటే పోషకాహారం అంది ఆరోగ్యంగా ఉంటారనే అవగాహన కల్పించడానికి 2021ని 'అంతర్జాతీయ పండ్లు, కూరగాయల సంవత్సరం'గా ఐక్యరాజ్యసమితి ఇటీవల ప్రకటించింది. కూరగాయలు పండించే రైతుల ఆదాయానికి పూచీకత్తు లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల కొరత తీవ్రంగా ఉంది. పక్కరాష్ట్రాల నుంచి రోజూ వస్తే తప్ప ప్రజలకు అన్నంలోకి కూర దొరకని దుస్థితి నెలకొంది.
ఆహారధాన్యాల దిగుబడుల్లో స్వయంసమృద్ధి సాధించామని చెబుతున్నారే గానీ, ప్రజలకు అవసరమైన అన్ని రకాల కూరగాయలు, పండ్లు మాత్రం దొరకడం లేదు. వేల మైళ్ల దూరంలో ఉన్న చిలీ వంటి చిన్న దేశం నుంచి పండ్లు హైదరాబాద్‌కు తెప్పించి అమ్ముతున్నారు. ఐరాస అయిదేళ్ల క్రితం ప్రకటించిన 'ప్రపంచ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ)' ప్రకారం ఆరోగ్య సంరక్షణకు ప్రతిఒక్కరూ పండ్లు, కూరగాయలు తినాలి. వాటిని కొనే ధరతో పోలిస్తే ఎన్నో రెట్లు అధిక పోషక విలువలను అవి మన శరీరానికి అందిస్తాయనే నిపుణుల మాట నిజమే అయినా- ప్రజలకు అవి అందుబాటులో లేనప్పుడు పోషకాహారం ఎలా లభిస్తుందనేది కీలకప్రశ్న.
ఉత్పత్తి, వినియోగం అంతంతమాత్రమే..
భూమిపై నాలుగు లక్షల రకాల మొక్కలు ఉంటే- అందులో ఆహారాన్ని అందించే రకాలు 80 వేలకు పైమాటేనని 'ప్రపంచ వ్యవసాయ, ఆహార సంస్థ (ఎఫ్‌ఏఓ)' తాజా నివేదికలో వెల్లడించింది. వీటిలో తొమ్మిది రకాల మొక్కల నుంచి వస్తున్న పంటలే ప్రపంచ ఆహారోత్పత్తుల్లో 66 శాతం దాకా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2018లో 108.90 టన్నుల కోట్ల టన్నుల కూరగాయలు, 86.80 కోట్ల టన్నుల పండ్ల దిగుబడి వచ్చింది. భారతదేశంలో 2018-19లో 18.58 కోట్ల టన్నుల కూరగాయలు పండితే ఆలుగడ్డలు, టమోటాలు, ఉల్లిగడ్డలే 9.57 కోట్ల టన్నులున్నాయి. మొత్తం కూరగాయల్లో ఈ మూడు రకాలే సగభాగం ఉండటంతో మిగతావాటికి కొరత ఏర్పడి ధరలు మండుతున్నాయి. మానవజాతి వేలాది రకాల విలువైన మొక్కలను పట్టించుకోనందువల్ల ప్రజలకు పండ్లు, కూరగాయల రూపంలో పోషకాలు సమగ్రంగా అందడం లేదు. అభివృద్ధి చెందుతున్న పేదదేశాలు వరి, మొక్కజొన్న, గోధుమలు వంటి ప్రధాన ఆహారోత్పత్తులను ప్రజలకు అందిస్తే చాలన్నట్లు వాటినే ఎక్కువగా సాగు చేయిస్తున్నాయి. అభివృద్ధి చెందిన ఐరోపా దేశాలు పండ్లు, కూరగాయల దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. వ్యవసాయ పరిశోధన సంస్థలదీ అదే దారి.
ఉదాహరణకు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇరి) జన్యుబ్యాంకులో లక్షా 32 వేల రకాల వరి వంగడాల జన్యువులను భద్రపరచారు. కానీ వరిబియ్యంకన్నా ఎన్నోరెట్లు ఎక్కువగా పోషకాలను మనిషి శరీరానికి అందించే కూరగాయ పంటల జన్యువులు ప్రపంచ పరిశోధన సంస్థల్లో 12 వేల రకాలే ఉన్నాయి. కేవలం ఒకే ఒక వరి పంటపై పరిశోధనలు చేసే 'ఇరి'కి 2019లో ఇచ్చిన బడ్జెట్ రూ.533 కోట్లు. ఎన్నో రకాల కూరగాయల పంటలపై పరిశోధనలు చేసే ప్రపంచ కూరగాయల పరిశోధన సంస్థకు అందింది రూ.146 కోట్లు మాత్రమే. ఇక పండ్ల మొక్కలపై ప్రపంచ పరిశోధన సంస్థ అంటూ ప్రత్యేకంగా లేనే లేదు. భారతదేశంతో పాటు, తెలుగు రాష్ట్రాలూ అదే దారిలో పయనిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి 2018-19లో రెండు రాష్ట్రాల్లో 9.90 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటలు సాగుచేసి 96 లక్షల టన్నులు పండించాయి. తెలుగురాష్ట్రాలకన్నా చిన్నదైన బిహార్ 21 లక్షల ఎకరాల్లో సాగుచేసి కోటీ 66 లక్షల టన్నులు పండించి దేశానికి అందించిందని జాతీయ ఉద్యాన మండలి(ఎన్‌హెచ్‌బీ) తాజా నివేదికలో వెల్లడించింది.