ప్రశ్న: కాంగ్రెస్‌లో పాతతరం వర్సెస్ యువతరం అన్న చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో పాటు నాయకత్వ సంక్షోభం కూడా ఉందని తెలుస్తోంది. అసలు సమస్య ఏంటి?
నాయకత్వం విషయంలో ఎలాంటి సమస్య లేదు. 23 మంది సీనియర్ నేతలు(సోనియా గాంధీకి లేఖ రాసిన అసమ్మతి నేతలు) కూడా కాంగ్రెస్ సమస్యలకు పరిష్కారం నాయకత్వ మార్పులో ఉందని సూచించలేదు. నాయకత్వ లోపం ఉందని భావిస్తే.. ఏఐసీసీ సెషన్ జరిగినప్పుడు వారిలో ఎవరో ఒకరు లేచి పోటీలో నిలబడేవారు. గతంలో సోనియా గాంధీకి 9400 ఓట్లు, ప్రత్యర్థిగా నిలిచిన జితేంద్ర ప్రసాదకు 94 ఓట్లు వచ్చాయి. ఆ ఫలితాలే వారికీ పునరావృతమయ్యేవి.
స్వాతంత్య్ర ఉద్యమం నుంచి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 20 ఏళ్ల వరకు అన్ని సామాజిక సమూహాలు కాంగ్రెస్‌తో కలిసే ఉండేవి. 1967 జాతీయ ఎన్నికల వల్లే భారత జాతీయ కాంగ్రెస్(ఐఎన్ఎస్) నుంచి విడిపోయి.. అందరూ సొంత మార్గాలు ఎన్నుకున్నారు. 1990లో మండలాలు ఏర్పడిన తర్వాత వెనుకబడిన అనేక వర్గాలు తమను ప్రత్యేక సమూహాలుగా ఏర్పరచుకున్నాయి. వెనుకబడిన వర్గాలలో యాదవులు అందరికంటే ముందున్నారని, షెడ్యూల్డ్ కులాల్లో జాతవులు అందరికంటే ముందున్నారని వర్గీకరించుకున్నారు. బాబ్రీ ఘటన తర్వాత కూడా మరో గందరగోళం ఏర్పడింది. ముస్లింలు సామూహికంగా కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. ఇలా అందరూ కాంగ్రెస్‌ను వీడి వెళ్లిపోవడం నాయకత్వ సమస్యగా చూడకూడదు.
సమస్యకు పరిష్కారం ఒకటే. విడిపోయిన సామాజిక సమూహాలను తిరిగి ఏకతాటిపైకి తీసుకురావడం. ముఖ్యంగా ప్రాంతీయ, కుల, సమాజ ప్రాతిపదికన ఏర్పడిన పార్టీలు కూటమిలో చేరడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ఇక్కడ కేరళ మోడల్ అనుసరించాలి. ఆ రాష్ట్రంలో.. ఎన్నికలు పూర్తయిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కోసం అన్ని వర్గాలు ముందుకొస్తాయి. సొంత గుర్తింపును కాపాడుకుంటూనే.. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేయాల్న దానిపై ప్రత్యేకమైన నిబంధనలు రూపొందించుకుంటాయి. కూటమి అధికారం చేపడితే అందరికీ ప్రత్యేకమైన శాఖలు కేటాయించి తగిన ప్రాధాన్యం ఇస్తారు.
ప్రశ్న: మీకు సంకీర్ణం ఎందుకు అవసరం? ఈ ప్రాంతీయ పార్టీలు అన్నీ కాంగ్రెస్ అనే గొడుగు కింద పనిచేయాలనుకుంటున్నారా?
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీని ఓడించే ఏకైక మార్గం సంకీర్ణం మాత్రమే. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ సహకారంతో పనిచేయాలని సూచిస్తున్నాను. అందరూ మా నాయకత్వంలోకి వస్తారని చెప్పడం ప్రారంభిస్తే ఎవ్వరూ ఆ నిర్ణయాన్ని అంగీకరించరు. సంకీర్ణ ప్రభుత్వం వస్తే.. అత్యధిక సంఖ్యలో సీట్లు గెలిచిన పార్టీ లేదా ఆ దశలో ఆమోదయోగ్యమైన మరే ఇతర ఫార్ములా ద్వారా అయినా ఏ పార్టీ అయినా నాయకత్వం వహించవచ్చు. 2024లో భాజపాను గద్దె దించాలంటే కేరళ తరహా అఖిల భారత ఐక్య ప్రజాస్వామ్య ఫ్రంట్ అవసరమని నా అభిప్రాయం.
ప్రశ్న: వరుసగా రెండు జాతీయ ఎన్నికల్లో.. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా పదవిని పొందటానికి లోక్‌సభలో కనీస 10 శాతం(54) సీట్లు సంపాదించలేకపోయింది. దానిపై మీ అభిప్రాయం..?
వాస్తవానికి ఇది పెద్ద సవాలు. మాకు నాయకత్వం చేపట్టే అవకాశం వస్తే ఎక్స్ పోస్ట్ ఫాక్టో తీసుకోవాలి. నా సొంత రాష్ట్రం తమిళనాడులో 1967 నుంచి మేము అధికారంలో లేము. భవిష్యత్‌లో కనీసం 600 సంవత్సరాలు అక్కడ అధికారంలో ఉండకపోవచ్చు. కాంగ్రెస్ మద్దతుదారులు లేని గ్రామం తమిళనాడులో ఒక్కటైనా లేదు. అదే మాకు డీఎంకే, ఏఐడీఎంకే రెండింటితోనూ పొత్తు కుదుర్చుకోగల అవకాశం ఇచ్చింది. 1991లో ఏఐడీఎంకేతో మా కూటమి తమిళనాడులోని మొత్తం 39 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది. పార్లమెంటరీ రాజకీయాల్లో విశిష్టత ఇది. మనం ఎక్కడ పోటీ చేస్తున్నాం అనే అంశాన్ని గుర్తించి, మద్దతిచ్చే వర్గాలను తిరిగి సంపాదించడం కీలకం.
ప్రశ్న: ప్రస్తుతానికి కాంగ్రెస్‌కు ఎన్నికల ద్వారా వచ్చే అధ్యక్షుడు అవసరమా?
ప్రస్తుత నాయకత్వం అంతర్గతంగా అన్ని అంశాలపై ఎక్కువ దృష్టిసారిస్తే మరింత మంచిది. రాహుల్ గాంధీ.. తనకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనటానికి కాంగ్రెస్‌కు ప్రతి అవకాశాన్ని ఇచ్చారు. రాహుల్‌తో పాటు సోనియా, ప్రియాంక బాధ్యతలు స్వీకరించమని వెనక్కి తగ్గారు. అయితే కాంగ్రెస్‌లో నాయకత్వం వహించే అభ్యర్థిగా ముందుకు రావడానికి కాంగ్రెస్‌లో ఎవరూ లేరు. భాజపా లక్ష్యం కాంగ్రెస్ ముక్త్ భారత్. గాంధీ-ముక్త్ కాంగ్రెస్ ఉంటే వారు అందులో విజయం సాధించినట్లే. అందుకే మేము నాయకత్వం అంశంపై సమయాన్ని వృథా చేయాలనుకోవట్లేదు.