నేపాల్ రాజకీయ అనిశ్చితికి ముగింపు పలుకుతూ దిగువ సభను ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ధరించింది. ఫలితంగా నేపాల్- భారత్ బంధం మరోమారు తెరపైకి వచ్చింది. కొత్తగా ఎన్నికైన ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా సారథ్యంలో ఇరు దేశాల మైత్రి ఏవైపునకు అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన్ని ప్రధాని పదవిలో ఉంచేందుకు ఆ దేశ రాష్ట్రపతి విద్యాదేవీ భండారీ విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. బలపరీక్షలో మెజారిటీని నిరూపించుకోలేక ఓలీ చతికిలపడ్డారు. అయినా ఆయన సలహాలతోనే ఈ ఏడాది మేలో దిగువ సభను భండారి రద్దు చేశారు. నేపాల్ పార్లమెంట్ రద్దవడం ఐదు నెలల్లో అది రెండోసారి. ఓలీ విజ్ఞప్తి మేరకు అంతకుముందు 2020 డిసెంబర్‌లో దిగువసభను రద్దు చేసి భండారీ విమర్శలు ఎదుర్కొన్నారు.
ఈ మేలో దిగువసభ రద్దుకాగానే ఎన్నికలకు ఓలీ పిలుపిచ్చారు. నవంబర్‌లో ఎన్నికలుంటాయని ప్రకటించారు. ఈ తరుణంలో సుప్రీంకోర్టు తీర్పుతో నేపాల్ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. దిగువ సభను పునరుద్ధరించడమే కాకుండా ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్‌బాను ప్రధానిగా నియమించాలని రాష్ట్రపతికి అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. మేలో దిగువసభను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని తీర్పు వెలువరించింది. ఫలితంగా దేవ్‌బా ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అయితే దిగువసభలో నెలరోజుల్లో జరగనున్న బల పరీక్షలో ఆయన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది.
చైనాతో ఓలీ చెలిమి
దేవ్‌బా నేతృత్వం వహించే నేపాల్ కాంగ్రెస్‌కు భారత్‌తో మంచి మిత్రత్వమే ఉంది. మాజీ ప్రధాని ఓలీ మాత్రం తన హయాములో చైనాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే భారత్‌పై అనేకమార్లు కయ్యానికి కాలుదువ్వారు. ఇందుకు మరో కారణం కూడా ఉంది! 2018 ఎన్నికలకు ముందు ఓలీకి చెందిన యూఎమ్‌ఎల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) పార్టీలో పుష్పకమల్ దహల్ ప్రచండ పార్టీ విలీనమైంది. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఓలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని పీఠాన్ని దశలవారీగా పంచుకోవాలని ఓలీ-ప్రచండ మధ్య ఎన్నికలకు ముందే ఒప్పందం కుదిరింది. ప్రచండకు కుర్చీ ఇవ్వకుండా ఉండేందుకు ఓలీ ఎన్నో ఎత్తులు వేశారు. అందుకోసం భారత్‌పై వ్యతిరేకతను అస్త్రంగా ఉపయోగించుకున్నారు.
కాలాపానీ సరిహద్దు వివాదాన్ని అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చి- ప్రచండ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించారు. అదే అదనుగా చైనాతో మైత్రిని పెంపొందించుకునేందుకు ఓలీ అడుగులు వేశారు. విస్తరణ కాంక్షతో నేపాల్‌పై పట్టుసాధించేందుకు ఎన్నో ఏళ్లుగా తహతహలాడుతున్న చైనాకు అది మంచి అవకాశంగా మారింది. అభివృద్ధి పేరుతో నేపాల్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించింది. చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బీఆర్‌ఐ (బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్) ప్రాజెక్టులో చేరేందుకు చైనాతో ఓలీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొంది.