రోజువారీ కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు, సంబంధిత మరణాలు ఎప్పటికప్పుడు గత రికార్డుల్ని బద్దలు కొడుతూ దూసుకుపోతున్న తీరు భీతిల్లజేస్తోంది. ఇప్పటికే కోటిన్నర దాటిపోయిన కేసులు, దాదాపు లక్షా 80వేల మరణాలతో తీవ్ర భయాందోళనలో ఉన్న జనావళిని పదికిపైగా రాష్ట్రాల్లో కొవిడ్ ఉద్ధృతి బెంబేలెత్తిస్తోంది. దక్షిణాఫ్రికా, బ్రిటన్, బ్రెజిల్ రకాల ఉరవడితో ఇండియాలో మొదలైన మలిదశ కొవిడ్ విజృంభణ, మరిన్ని ప్రమాదకర ఉత్పరివర్తనాలతో జన సమూహాల్ని చుట్టబెట్టేస్తోంది. తొలి దశ లక్షణాలకు భిన్నంగా ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడమే ఇబ్బందిగా మారి రోగులు ఆసుపత్రులకు పోటెత్తుతుండటంతో పలు రాష్ట్రాల్లో ఆరోగ్య వ్యవస్థలు చేతులెత్తేసే దుస్థితి దాపురించింది.
పౌర సమాజంతోనే..
కొవిడ్ పాజిటివ్ వ్యక్తుల నుంచి రెండు మీటర్ల దూరం వరకు వైరస్ తాలూకు సూక్ష్మ కణాలు వ్యాపిస్తున్నాయని, వైరస్ లోడు ఆధారంగా గాలిలో వ్యాప్తి ఉంటోందని సీసీఎంబీ ఈ నెల తొలివారంలో ప్రకటించింది. గాలి ద్వారా కరోనా వ్యాపిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తల బృందమూ తాజాగా హెచ్చరించింది. ముక్కు నోరుతోపాటు కళ్లనుంచీ వైరస్ చొరబడుతోందన్న విశ్లేషణల్ని ఏమాత్రం విస్మరించే వీల్లేదు. నిరుడు ఎన్నో యుద్ధాల పెట్టుగా విరుచుకుపడి సామాజిక ఆర్థిక రంగాల్ని నుగ్గునూచ చేసిన కొవిడ్ మహమ్మారి- మలి దశలో మరింత మాయావిగా మారి ప్రాణాంతక సవాళ్లు రువ్వుతోందిప్పుడు! బతికుంటే బలుసాకు తినవచ్చునంటూ మహారాష్ట్ర లాక్‌డౌన్ బాటపట్టగా, తాజాగా దిల్లీ అదే పని చేసింది. యూపీలో తీవ్ర ప్రభావిత అయిదు నగరాల్లో లాక్‌డౌన్‌కు అలహాబాద్ హైకోర్టు ఆదేశించినా, యోగి సర్కారు దాన్ని బేఖాతరు చేస్తోంది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 20 లక్షలు దాటడంతో ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, ప్రాణాధార ఔషధాలకు కొరత వెంటాడుతోంది. ఆక్సిజన్ బట్వాడాకు, వ్యాక్సిన్ సమధిక ఉత్పత్తికి, ఔషధాల తయారీ పెంపుదలకూ కేంద్రం భరోసా ఇస్తున్నా- కొవిడ్ నియంత్రణకు సమకట్టాల్సింది పౌర సమాజమే. 70శాతం కొవిడ్ కట్టడి జరిగేది ముందు జాగ్రత్తలతోనే!