తెలంగాణ

telangana

ETV Bharat / opinion

విద్యుత్తును ఆదా చేసే మార్గాలివే.. - విద్యుత్​ వార్తలు

ఎంతో విలువైన విద్యుత్తును వృథా చేయకుండా వాడుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉంది. ఒక యూనిట్‌ను ఆదా చేస్తే, రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్లే. ఆ మేరకు ఉత్పత్తి కేంద్రాలు, సరఫరా, పంపిణీ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం తలెత్తక పోవడం వల్ల లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది.

electricity
విద్యుత్తును ఆదా చేసే మార్గాలివే..

By

Published : Dec 15, 2020, 9:34 AM IST

వ్యవసాయ రంగంలో విద్యుత్తు పాత్ర ఎంతో కీలకం. దేశంలో నేడు రెండు కోట్ల ఇరవై లక్షల వ్యవసాయ మోటార్లు ఉండగా, ఏటా మరో అయిదు లక్షలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. దేశం మొత్తం విద్యుత్తు వినియోగంలో 18శాతం వ్యవసాయ రంగానికే వాడుతున్నట్లు కేంద్ర విద్యుత్తు ప్రాధికార సంస్థ (సీఈఏ) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎంతో విలువైన విద్యుత్తును వృథా చేయకుండా వాడుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉంది. ఒక యూనిట్‌ను ఆదా చేస్తే, రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్లే. ఆ మేరకు ఉత్పత్తి కేంద్రాలు, సరఫరా, పంపిణీ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం తలెత్తక పోవడం వల్ల లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది.

నాసిరకం మోటార్లు తొలగించాలి

కేంద్ర ప్రభుత్వ అధీనంలోని, ఇంధన సామర్థ్య విభాగం (బీఈఈ) అంచనాల ప్రకారం, మొత్తం వాడకంలో వృథా అవుతున్న విద్యుత్తు సగటున పది నుంచి 15శాతం మధ్య ఉండగా, వ్యవసాయ రంగంలో అత్యధికంగా 35 నుంచి 40శాతందాకా ఉంది. ఈ వృథాను అరికడితే సంవత్సరానికి సుమారు 5,565 కోట్ల యూనిట్ల విద్యుత్తు (సుమారు రూ.28 వేల కోట్ల విలువ) ఆదా అవుతుంది. 4.2 కోట్ల టన్నుల హానికర కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల కాకుండా నివారించవచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విద్యుత్తు ఆదా కోసం 'అగ్రికల్చరల్‌ డిమాండ్‌-సైడ్‌ మేనేజ్‌మెంట్‌' అనే బృహత్తర కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నాసిరకం మోటార్లను (25-30% సామర్థ్యం) తొలగించి వాటి స్థానంలో అత్యధిక సామర్థ్యం (50-60%) గల బీఈఈ, అయిదు నక్షత్రాల ప్రమాణంగల కొత్త మోటారును అమర్చడం. మొట్టమొదట అత్యధికంగా విద్యుత్తు వినియోగిస్తున్న హరియాణా, పంజాబ్‌, రాజస్థాన్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టింది. ఫలితాల గణాంకాలను విశ్లేషించగా, సుమారు 25 నుంచి 37శాతం వరకు ఆదా అవుతున్నట్లు తేలింది. ఇప్పటి వరకు లక్షకుపైగా పాత వ్యవసాయ పంపుసెట్లు మార్చినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

రైతులకు కరంటు వాడకంపై సరైన అవగాహన లేకపోవడంతో వ్యవసాయంలో వృథా అధికంగా ఉంటోంది. రోజులో పరిమిత సమయాల్లోనే విద్యుత్తు అందుబాటులో ఉండటంవల్ల (తెలంగాణలో తప్ప) అవసరానికంటే ఎక్కువ శక్తిసామర్థ్యాలతో కూడిన నాసిరకం మోటార్లు కొనుగోలు చేయడం, దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యుత్తు స్వల్ప రుసుములతోనో, ఉచితంగానో లభ్యం కావడంతో ఆదాపై శ్రద్ధ చూపించడం లేదని తెలుస్తోంది. మంచి సామర్థ్యంగల మోటారుతోపాటు నాణ్యమైన పరికరాలు వాడితే మరో నాలుగు నుంచి ఆరు శాతంమేర అదనంగా విద్యుత్తు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో రాష్ట్రాల విద్యుత్తు నియంత్రణ మండళ్లు అన్ని రంగాల్లో వినియోగం వద్దే వృథాను అరికట్టేందుకు కృషిచేస్తున్నాయి. దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా లక్షల కోట్ల రూపాయల విద్యుత్తు రాయితీ భరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 24.31 లక్షల పంపుసెట్లపై, రూ.10వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 18.37 లక్షల పంపుసెట్లపై, రూ.6,000 కోట్లు భరిస్తున్నాయి. కొత్త కనెక్షన్ల కారణంగా ఏటికేడాది రాయితీ భారం పెరిగిపోతోంది. ఇప్పుడున్న నాసిరకం వ్యవసాయ మోటార్లను తొలగించి, వాటి స్థానంలో నాణ్యమైన అత్యంత సామర్ధ్యం గలవాటిని ఏర్పాటుచేస్తే వృథా తగ్గడంతోపాటు ప్రభుత్వాలు రాయితీల భారాన్నీ తగ్గించుకోవచ్చు. పాత మోటారు స్థానంలో కొత్తది అమర్చేందుకు సుమారు రూ.50వేల నుంచి రూ.70వేల దాకాఖర్చయ్యే అవకాశమున్నా- ఆ డబ్బును మూణ్నాలుగేళ్లలోనే విద్యుత్తు ఆదా రూపంలో తిరిగి పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటైన ఇంధన సామర్థ్య సేవల సంస్థ వంటివి తమ సొంత పెట్టుబడితో నాసిరకం మోటార్లు తొలగించి, నాణ్యమైన వాటిని సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఆదా మార్గాలివీ...

విద్యుత్తు పంపిణీ సంస్థలు వ్యవసాయ ఫీడర్లలో అధిక ఓల్టేజి పంపిణీ వ్యవస్థ పద్ధతిలో రెండు నుంచి అయిదు మోటార్ల వరకు చిన్న ట్రాన్స్‌ఫార్మర్లు స్థాపించడం ద్వారా, నాణ్యమైన విద్యుత్తును పంపిణీ చేయడమే కాకుండా, సరఫరా మార్గాల్లో నష్టాలను కొంతమేరకు తగ్గించుకున్నాయి. సెల్‌ఫోన్‌ అంతర్జాలం పరిజ్ఞానం ద్వారా ఎక్కడి నుంచైనా అవసరమైనప్పుడే పంపుసెట్లను నడిపే అవకాశాల్ని రైతులు పరిశీలించాలి. వ్యవసాయ విద్యుత్తు వినియోగాన్ని లెక్కించేందుకు ప్రతి పంపుసెట్టుకు మీటర్‌ను అమర్చడం అత్యధిక ఖర్చు, శ్రమతో కూడిన పని. అందుకని, ప్రత్యేక వ్యవసాయ ఫీడర్ల ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దే మీటర్లు నెలకొల్పడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించవచ్చు. నాసిరకం మోటార్లను తయారీ వద్దే నిషేధించి, నాణ్యమైన వాటికి రాయితీలు సమకూర్చితే, అందుబాటు ధరలో లభిస్తాయి. కరెంటు ఆదా కోసం సాగునీటి యాజమాన్యంపైనా దృష్టి సారించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పీఎమ్‌కేఎస్‌వై) పథకం ద్వారా నీటి సంరక్షణ విధివిధానాలను రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టింది. ఇలాంటి కార్యక్రమాలు సమర్థంగా అమలు కావాలంటే- వ్యవసాయ, విద్యుత్తు, నీటిపారుదల తదితర శాఖలు ఒక కమిటీగా ఏర్పడి రైతులను కూడా భాగస్వాములుగా చేర్చాలి. అందరి సూచనలు, సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే అత్యంత విలువైన విద్యుత్తు, నీటి వృథాను అరికట్టవచ్చు.

- ఇనుగుర్తి శ్రీనివాసాచారి

ABOUT THE AUTHOR

...view details