పల్లెల్లో గ్రామ స్వరాజ్యం పరిఢవిల్లినప్పుడే అసలైన ప్రజాస్వామ్యం ఉనికిలోకి వచ్చినట్లని మహాత్మా గాంధీ అనేవారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు ఎన్నికయ్యాయి. నిరుడు తెలంగాణలో పంచాయతీ పాలక వర్గాలు కొలువుతీరాయి. గ్రామాల సమగ్ర అభివృద్ధి, గ్రామీణుల సాధికారత కోసం గ్రామ పంచాయతీలకు మార్గనిర్దేశం చేయడంలో ప్రభుత్వ వ్యవస్థలు దీర్ఘకాలంగా విఫలమవుతూనే ఉన్నాయి. కొండ, కోనల్లోని ఆదివాసుల సంప్రదాయ గ్రామసభలకు సముచిత గౌరవం ఇవ్వడానికి ఉద్దేశించిన పంచాయతీరాజ్- షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం (పీసా చట్టం-1996) అమలులోకి వచ్చి పాతికేళ్లయింది. ఆదివాసుల జీవనోపాధుల మెరుగుదల, అటవీ హక్కుల కల్పన, మౌలిక వసతుల అభివృద్ధి తదితర కీలక అంశాల్లో వారికి స్వయంపాలన హక్కులు కల్పించే పీసా చట్టం స్ఫూర్తిని ఇన్నేళ్లలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయనే చెప్పాలి.
గ్రామసభల స్ఫూర్తికి తూట్లు
పంచాయతీ రాజ్ చట్టాన్ని దేశమంతటా ఒకే రీతిన అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులతో పాటు, వారి మద్దతు సంఘాలు పెద్దయెత్తున ఉద్యమించాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం దిలీప్‌సింగ్ భూరియా ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ సవరణతో 1992లో అమలులోకి వచ్చిన పంచాయతీ రాజ్ చట్టంపై ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సులతో పార్లమెంటు 1996లో పీసా చట్టాన్ని (పంచాయతీ రాజ్ షెడ్యూల్డ్ ప్రాంతాల విస్తరణ చట్టం) ఆమోదించింది. దాంతో ఆదివాసీ ప్రాంతాల్లో పరిపాలన, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామసభలను కేంద్ర బిందువుగా మార్చారు. రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలు జాబితాలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, బిహార్‌లలోని షెడ్యూలు ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రాంతాలన్నింటికీ ఈ చట్టం వర్తిస్తుంది. దాని ప్రకారం నోటిఫై చేసిన గ్రామసభలకు ఆ ప్రాంతంలోని సహజ వనరులపై పూర్తి యాజమాన్య హక్కులు ఉంటాయి.
జల, అటవీ వనరులను తమ అవసరాలకు వాడుకుని సంరక్షించుకునే విధంగా గ్రామసభలను సుశిక్షితం చేయాలి. విద్యా, వైద్య కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యత ఉంటుంది. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, నష్ట పరిహార పంపిణీ, గనుల తవ్వకాలకు అవసరమైన లీజుల మంజూరుకు గ్రామసభల అనుమతి తప్పనిసరి. ఆవాసాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన; గిరిజనాభివృద్ధి ఉప ప్రణాళిక నిధులను ఖర్చు చేసేందుకు తప్పనిసరిగా గ్రామసభల పాత్ర ఉండాలి. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు, చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు, మద్యం అమ్మకాలు, వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ తదితర విషయాల్లో గ్రామసభలకు పూర్తి అధికారాలు ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల కోసం విడుదలయ్యే జమా ఖర్చుల ధ్రువపత్రాలను అధికారులు గ్రామసభల నుంచి తీసుకోవాలి.
అమలులో అశ్రద్ధ
మహోన్నత లక్ష్యాలతో అమలులోకి తెచ్చిన పీసా చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు అంతులేని అశ్రద్ధ కనబరుస్తున్నాయి. చట్ట నియమాల రూపకల్పనలో ఏళ్ల తరబడి కాలయాపనవల్ల అసలు లక్ష్యం పూర్తిగా నీరుగారింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో చట్టం అమలులోకి వచ్చిన 15ఏళ్ల అనంతరం అంటే 2011లో సంబంధిత నియమ నిబంధనలు రూపొందించింది. ఆ నియమాలు వచ్చిన రెండేళ్ల తరవాత 2013లో గిరిజన సంక్షేమ శాఖ- జిల్లా, మండల, పంచాయతీల వారీగా గ్రామసభలను గుర్తించి, జాబితాను ‘నోటిఫై’ చేసింది. రాష్ట్ర విభజన జరిగాక ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ‘పీసా’ అమలు ద్వారా గిరిజన ప్రాంతాల్లో గ్రామసభలకు హక్కులు వర్తింపజేసే ప్రయత్నమే జరగలేదు.
పాతికేళ్లయినా..