తెలంగాణ

telangana

ETV Bharat / opinion

EU against China: డ్రాగన్‌కు దీటుగా ఐరోపా ఎత్తుగడ - చైనా గ్లోబల్ గేట్​ వే ఈయూ

EU against China: చైనా చేపట్టిన బీఆర్ఐ ప్రాజెక్టుకు పోటీగా ఐరోపా సమాఖ్య బృహత్తర ప్రణాళికను రూపొందించింది. గ్లోబల్ గేట్​ వే పేరుతో రూ.25 లక్షల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈయూతో డ్రాగన్‌ వాణిజ్య సంబంధాలు ఇటీవల కుదుపులకు లోనైన నేపథ్యంలో తాజా పరిణామాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

EU against china
EU against china

By

Published : Dec 4, 2021, 7:12 AM IST

EU against China: అంతర్జాతీయ మౌలిక వసతుల రంగాన్ని మేలి మలుపు తిప్పగల ఓ బృహత్తర ప్రణాళికను ఐరోపా సంఘం (ఈయూ) సిద్ధం చేసింది. ప్రపంచవ్యాప్తంగా రవాణా, డిజిటల్‌, ఇంధన, ఆరోగ్య సేవల అనుసంధానతను బలోపేతం చేయాలన్న సంకల్పంతో ‘అంతర్జాతీయ సింహద్వారం (గ్లోబల్‌ గేట్‌ వే)’ ప్రణాళికను ప్రతిపాదించింది. దీనికింద 2027కల్లా వివిధ దేశాల్లో రూ.25 లక్షల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని తలపోసింది. చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌(బీఆర్‌ఐ)కు ఇది పోటీ అని, ప్రత్యామ్నాయమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. హాంకాంగ్‌తో పాటు షింజియాంగ్‌ ప్రాంతంలో హక్కుల ఉల్లంఘనలకు చైనా పాల్పడుతున్న తీరుపై పలు ఐరోపా దేశాలు గుర్రుగా ఉండటం, ఈయూతో డ్రాగన్‌ వాణిజ్య సంబంధాలు ఇటీవల కుదుపులకు లోనవడం వంటి పరిణామాల నేపథ్యంలో- వాటికి బలం చేకూరుతోంది.

EU Global Gateway
Global Gateway Explain Telugu

అంతర్జాతీయంగా ప్రాబల్యం పెంచుకునేందుకు చైనా 2013లో బీఆర్‌ఐకి శ్రీకారం చుట్టింది. వర్ధమాన దేశాల్లో ఓడరేవులు, పైప్‌లైన్లు, రోడ్లు, డిజిటల్‌ సాంకేతికత, ఆరోగ్య సేవలు, హరిత ఇంధన సదుపాయాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమని చెప్పడంతో 150కి పైగా దేశాలు తొలుత దానికి మద్దతు తెలిపాయి. నిజానికి ఆసియా, ఆఫ్రికాలతో పాటు పలు ఐరోపా దేశాలతో రాజకీయ, ఆర్థిక సంబంధాలు నెలకొల్పుకొనేందుకు బీఆర్‌ఐ ద్వారా మార్గం సుగమం చేసుకోవాలన్నది డ్రాగన్‌ వ్యూహం. అందుకే బీఆర్‌ఐ కింద పేద దేశాలకు లక్షల కోట్ల రూపాయల రుణాలు అందిస్తోంది. నిధులు సమకూర్చడం స్వాగతించాల్సిన అంశమే అయినా- రుణాల మంజూరులో పారదర్శకత కొరవడుతోంది. ఒప్పంద నిబంధనలను బయటపెట్టకుండా రుణ స్వీకార దేశాలకు డ్రాగన్‌ షరతులు విధిస్తోంది. తమవద్ద అప్పు తీసుకొని ప్రారంభించే ప్రాజెక్టులకు మరే ఇతర దేశాలు/ సంస్థల నుంచి నిధులు తీసుకోకుండా అడ్డుపుల్లలు వేస్తోంది. శ్రీలంక, పాకిస్థాన్‌, ఉగాండా, కిర్గిజ్‌స్థాన్‌, హంగేరీ తదితర దేశాల్లో ప్రాజెక్టులకు చైనా నిధులు అందిస్తున్న తీరుపై ఇటీవల పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. బీఆర్‌ఐ కింద కొన్ని దేశాల్లో చేపడుతున్న ప్రాజెక్టులపైనా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మాంటెనిగ్రో వంటి బాల్కన్‌ దేశాల్లో చైనా ప్రాయోజిత ప్రాజెక్టులు పర్యావరణాన్ని దెబ్బతీసేలా, కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. డ్రాగన్‌ రుణ ఒప్పందాలు భారీయెత్తున అవినీతికీ ఆస్కారం కల్పిస్తున్నాయి. దరిమిలా రుణం పొందిన దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఓ వివాదాస్పద హైవే ప్రాజెక్టు కోసం చైనా నుంచి తీసుకున్న 100 కోట్ల డాలర్ల రుణం చెల్లించేందుకు సాయం చేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈయూను మాంటెనిగ్రో వేడుకుంది. డ్రాగన్‌కు 180 కోట్ల డాలర్ల రుణం చెల్లించలేక కిర్గిజ్‌స్థాన్‌ తంటాలు పడుతోంది. ఈ పరిణామాలతో బీఆర్‌ఐ విషయంలో పలు దేశాలకు భ్రమలు తొలగిపోతున్నాయి.

China BRI vs Global Gateway

ప్రపంచవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనలో తమ భాగస్వామ్యం కొరవడితే భవిష్యత్తులో ప్రతికూల పరిస్థితులు ఎదురు కావచ్చని ఈయూ గుర్తించింది. అందుకే తాజా ప్రణాళికను తెరమీదకు తెచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతిపాదించిన ‘బిల్డ్‌ బ్యాక్‌ బెటర్‌ వరల్డ్‌ (బీ3డబ్ల్యూ)’ కింద చేపట్టే ప్రాజెక్టులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఐరోపా సంఘం భావిస్తోంది. గ్లోబల్‌ గేట్‌వేలో భాగంగా ఐరోపా ప్రయోజనాలను పరిరక్షిస్తూనే... ఆఫ్రికా, ఆసియాల్లో పెట్టుబడులకు అది ప్రాధాన్యమివ్వనుంది. సుపరిపాలన, ఉన్నత ప్రమాణాలు, పారదర్శకత పెంపునకు తోడ్పడగల ప్రాజెక్టులకు చేయూతనందించనుంది. వ్యాపారానుకూల పరిస్థితులను సృష్టించే ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లు, రవాణా నడవాలు, శుద్ధ ఇంధన సరఫరా మార్గాల ఏర్పాటుపై దృష్టిపెట్టనుంది. బీద దేశాలు అప్పుల ఊబిలో చిక్కుకుపోకుండా ఉండేందుకు గ్లోబల్‌ గేట్‌ వే కింద పారదర్శకంగా రుణాలు మంజూరు చేస్తామని; ప్రజాస్వామ్య విలువలు, మానవహక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామని ఈయూ చెబుతోంది. ఈ ప్రకటన పరోక్షంగా డ్రాగన్‌ను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నదే. 2017 తరవాత బీఆర్‌ఐ విషయంలో చైనా దూకుడు తగ్గడం ఈయూకు కలిసివచ్చే అంశం. తాజా ప్రణాళికకు అవసరమైన 25 లక్షల కోట్ల రూపాయలు వివిధ ఆర్థిక సంస్థలు, అభివృద్ధి బ్యాంకులు, సభ్యదేశాలతోపాటు ప్రైవేటు సంస్థలు/ వ్యక్తుల నుంచీ సమీకరించాలన్నది ఈయూ యోచన. కొవిడ్‌ నేపథ్యంలో, ఇంత పెద్దమొత్తంలో నిధులు సమీకరించడం గడ్డు సవాలే. దాన్ని అధిగమించి, తక్కువ ధరల్లో నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో సఫలమైతే... అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ రంగాల్లో ఈయూ మరింత శక్తిమంతంగా మారుతుంది!

-నవీన్‌ కుమార్‌

ABOUT THE AUTHOR

...view details