ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ స్పృహ పెరుగుతోంది. వాతావరణంలో కొత్తగా ఉద్గారాలు పెరగకుండా ఉండే తటస్థ స్థాయి (నెట్ జీరో)ని సాధించేందుకు చాలా దేశాలు ముందుకొస్తున్నాయి. ఆసియా దిగ్గజాలుగా పేరొందిన చైనా, జపాన్, రిపబ్లికన్ ఆఫ్ కొరియా వంటి దేశాలు 2050-60 నాటికి ఉద్గారాలను తటస్థ స్థాయికి చేరుస్తామని ప్రతినబూనాయి.
భారత్ కీలకం..
భారత్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అధిక ప్రోత్సాహమిస్తూ ముందడుగు వేస్తోంది. 2022 నాటికి 175 గిగావాట్లు, 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2015 నాటి పారిస్ ఒప్పందానికి అనుగుణంగా అడుగులు వేయడంలో- జీ20 దేశాల్లో భారత్ ముందుంది. భారత్‌కు తగినంత పునరుత్పాదక ఇంధన వనరులు అందుబాటులో ఉన్నాయని, దీనిద్వారా 2050 నాటికి ఆరువేల టెరావాట్‌అవర్ (టీడబ్ల్యూహెచ్) శక్తిని కర్బన రహితంగా అందించగలదని ఇంధన పంపిణీ సంఘం (ఈటీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది. విద్యుత్తు వినియోగదారులపై ఏ మాత్రం భారం మోపకుండా ఆర్థిక ప్రగతి సాధించవచ్చని, సౌర, పవన విద్యుత్తులు ఇందుకు దోహదం చేస్తాయని అభిప్రాయపడింది. 2019లో గ్రిడ్ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తిలో సౌర పవన విద్యుత్తుల వాటా ఎనిమిది శాతం. నూక్లియర్, హైడ్రో, బయోమాస్ తదితరాలతో కలిపి దీని వాటా 25శాతం. 2030 నాటికి ఇది 32 శాతానికి చేరుతుందని ఈటీసీ పేర్కొంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవి తప్పితే, కొత్తగా బొగ్గు ఆధారిత విద్యుత్తు కేంద్రాల ఏర్పాటు చేయకుండానే విద్యుత్తు లక్ష్యాలను సాధించాలని భారత్ యోచిస్తోంది.
శరవేగంగా మార్పులు..
ప్రస్తుతం ఒక్కశాతంగా ఉన్న విద్యుత్తు వాహనాల వినియోగాన్ని 2030 నాటికి 30 శాతానికి పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలకు, వినియోగదారులకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. పెద్ద సంఖ్యలో ఛార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని యోచిస్తోంది. విద్యుత్తు వాహనాల(ఈవీ)పై జీఎస్టీని అయిదు శాతానికి తగ్గించడం, ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్తు వాహనాల అమ్మకం ధరలో బ్యాటరీ ధరలను మినహాయించడం వంటి చర్యలను చేపట్టింది. భారత సౌర ఇంధన సంస్థ (ఎస్‌ఈసీఐ-సెకి) గ్రీన్ హైడ్రోజన్ కేంద్రాల ఏర్పాటుకు బిడ్లను ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. ఎన్టీపీసీ సైతం హరిత ఇంధన సెల్ సాంకేతికతపై నిధులు వెచ్చించాలని, హైడ్రోజన్ పరిజ్ఞానంతో నడిచే వాహనాలను ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోంది. రవాణా రంగం కూడా కర్బనాల్ని తగ్గించుకునే దిశలో ప్రయత్నాలు ప్రారంభించింది.
రైల్వేల్లోనూ..