దేశంలో అభివృద్ధి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల ప్రక్రియలో కీలక మార్పులకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ చేస్తున్న కసరత్తు వివాదాస్పదంగా మారింది. పర్యావరణ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు చట్టాల్లోని లోపాలను సరిదిద్దాల్సింది పోయి- వాటిని మరింత నిర్వీర్యం చేసేందుకు తెగబడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 పరిధిలోని పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) నోటిఫికేషన్-2020 ప్రక్రియను నిలిపివేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ఈ ప్రకటన ముసాయిదాపై సలహాలు, అభ్యంతరాల స్వీకరణకు మంత్రిత్వశాఖ జూన్ 30 వరకు గడువిచ్చింది.
అదే అసంతృప్తి..
కరోనా వైరస్- లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ గడువుపై గత వారం దిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆంగ్లం, హిందీ భాషల్లో మాత్రమే కాకుండా దేశంలోని మిగతా అన్ని భాషల్లో నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచాలంది. సూచనలను స్వీకరించేందుకు ఆగస్టు 11 వరకు గడువును పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. కొన్ని దశాబ్దాలుగా దేశంలో పర్యావరణ అనుమతుల ప్రక్రియలో లోపాలపై పర్యావరణ వాదులు, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన ప్రమాదంపై ఉన్నతాధికార సంఘం తమ నివేదికలో కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో పర్యావరణ అనుమతుల ప్రక్రియలోని లోపాలను బహిర్గతం చేసింది.
సవరణలతో దిగజారిన పరిస్థితి
ప్రజల ఆకాంక్షలు, పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ లక్ష్యాలను విస్మరించి ఈఐఏ నిబంధనలను అంతకంతకూ సరళతరం చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. 1994 నోటిఫికేషన్ స్థానే అమలులోకి తెచ్చిన ఈఐఏ 2006 నిబంధనల్లో స్థానిక సంస్థల భాగస్వామ్యాన్ని తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా ఈఐఏ అమలు ప్రక్రియలో వివిధ దేశాల ధోరణిని విశ్లేషిస్తే- మన దేశ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారైంది. దిల్లీకి చెందిన ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ పరిశీలన ప్రకారం అభివృద్ధి చెందిన ఐరోపా, అమెరికా దేశాల్లో ఈఐఏ ప్రక్రియ అమలులో రాజీపడకుండా ప్రజల భాగస్వామ్యాన్ని ఇతోధికం చేశాయి. పరిశ్రమలు, ప్రాజెక్టుల యాజమాన్యాల జవాబుదారీతనం పెరిగేలా పటిష్ఠంగా చట్టాలు అమలు చేస్తున్నాయి. భారత్‌లో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ ప్రైవేటు యాజమాన్యాల కనుసన్నల్లో నిర్వహించే మొక్కుబడి తంతుగా మారింది. ఈఐఏ నివేదికలను తయారు చేసే గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలపైనా నియంత్రణ కొరవడింది. ఈ వ్యవహారాలన్నింటినీ చూసుకోవలసిన రాష్ట్రాల్లో కాలుష్య నియంత్రణ మండళ్లకు ఆర్థిక, మానవ వనరులు కరవయ్యాయి.
ఆందోళన..
కొత్త నోటిఫికేషన్ ముసాయిదాలో ప్రాజెక్టు, పరిశ్రమలు భూసేకరణ పూర్తి చేయకుండానే పర్యావరణ అనుమతులు మంజూరు చేసే వీలు కల్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజల నుంచి సూచనలను, వినతులను తీసుకునే ప్రక్రియకు కేవలం 20 రోజులే గడువివ్వడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. యాజమాన్యాలు తమ ప్రాజెక్టు వాస్తవస్థితి నివేదికను ఏడాదికి ఒకసారి ఇస్తే చాలు. ప్రాజెక్టు ప్రభావిత ప్రజలతో సంప్రదింపుల ప్రక్రియనూ పూర్తిగా నిర్వీర్యం చేశారు. పర్యావరణ వ్యవస్థల యాజమాన్యంలో సుస్థిర నిర్వహణ విధానాలను విస్మరించారు. ఈ ధోరణితో అడవులు, సముద్ర తీరం వంటి సహజ వనరులతో పాటు, వాటిపై ఆధికంగా ఆధారపడి జీవించే ఆదివాసులు, మత్స్యకారులు, భూమి హక్కు లేని ఇతర అసంఘటిత రంగాలకు చెందిన వృత్తిపనివారిపై తీవ్ర ప్రభావం ప్రసరించే అవకాశం ఉంది.
చట్టాల అమలుకు భరోసా ఏదీ?