తెలంగాణ

telangana

ETV Bharat / opinion

నిపుణ భారత్‌- ఆరంభ అభ్యసనానికి దన్ను - నూనత విద్యావిధానం

దేశంలోని బాలలందరికీ అవగాహనతో కూడిన పఠనం, ప్రాథమిక గణితాల్లో ప్రావీణ్యాన్ని పెంపొందించే ధ్యేయంతో 'నిపుణ భారత్‌ మిషన్‌'ను ఇటీవల కేంద్ర విద్యాశాఖ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన సమగ్రశిక్ష ఆధ్వర్యంలో 'నిపుణ భారత్‌'ను అమలు చేస్తున్నారు. మూడు నుంచి తొమ్మిదేళ్లలోపు చిన్నారుల అభ్యసన అవసరాలను గుర్తించి, వారి విద్యాభివృద్ధికి ఇది కృషి చేస్తుంది. అయితే నిపుణ భారత్ మిషన్​ అమలకు నిధుల కొరత, సమన్వయం లోపించి అభ్యసన సామర్థ్యాలపై ప్రభావం పడుతోందని నిపుణులు అభిప్రాయడుతున్నారు.

Nipun Bharat Mission
నిపుణ భారత్‌ మిషన్​

By

Published : Aug 12, 2021, 8:01 AM IST

అభ్యసనంలో పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్య చాలా కీలకం. ఈ దశలోనే పిల్లల్లో శారీరక, మానసిక వికాసం వేగంగా ఉంటుంది. బాల్యారంభ దశ చదువును శిశు విద్యగా పేర్కొంటారు. ఇటీవల దీనికి ప్రాధాన్యం పెరిగింది. శిశు విద్యను అంగన్‌వాడీలు, ప్లే స్కూళ్లు అందిస్తున్నాయి. పాఠశాల విద్యకు అవసరమైన నైపుణ్యాలను ఇక్కడ నేర్పిస్తారు. తరవాత వీరు ప్రాథమిక పాఠశాలలో చేరతారు. ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యు డైస్‌) 2019-20 గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 1.4 కోట్ల పూర్వ ప్రాథమిక, 12.2 కోట్ల ప్రాథమిక విద్యార్థులున్నారు. పాఠశాల విద్యలో సగానికిపైగా ఉన్న వీరందరికీ నాణ్యమైన విద్య అందడం లేదు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో అధిక శాతం విద్యార్థులు చదవడం, రాయడం, గణించడం వంటి కనీస అభ్యసన సామర్థ్యాల్లో వెనకబడటమే దీనికి నిదర్శనం.

అసర్‌-2018, ఎన్‌సీఈఆర్‌టీ జాతీయ అచీవ్‌మెంట్‌ సర్వే-2017 నివేదికలూ దీన్ని ధ్రువీకరిస్తాయి. ఈ తరుణంలో దేశంలోని బాలలందరికీ అవగాహనతో కూడిన పఠనం, ప్రాథమిక గణితాల్లో ప్రావీణ్యాన్ని పెంపొందించే ధ్యేయంతో 'నిపుణ భారత్‌ మిషన్‌'ను ఇటీవల కేంద్ర విద్యాశాఖ ప్రారంభించింది. ఇందులో భాగంగా పిల్లలంతా మూడో తరగతి ముగించుకునే సరికి ప్రాథమిక అక్షరాస్యత, కనీస గణిత జ్ఞానాన్ని అలవరచుకోవాలని, 2026-27 విద్యాసంవత్సరం నాటికి ఈ లక్ష్యాలను సాధించాలని నిర్దేశించారు.

చిన్నారుల సామర్థ్యం మరింత మెరుగు

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన సమగ్రశిక్ష ఆధ్వర్యంలో 'నిపుణ భారత్‌'ను అమలు చేస్తున్నారు. మూడు నుంచి తొమ్మిదేళ్లలోపు చిన్నారుల అభ్యసన అవసరాలను గుర్తించి, వారి విద్యాభివృద్ధికి ఇది కృషి చేస్తుంది. పిల్లలు పాఠశాలల్లో కొనసాగేలా చూడటం, ఉపాధ్యాయుల సామర్థ్యం పెంపు, నాణ్యమైన అభ్యసన సామగ్రిని అభివృద్ధి చేయడం వంటి వాటిపై దృష్టి సారిస్తుంది. అభ్యసన ఫలితాల సాధనలో ప్రతి చిన్నారి ప్రగతినీ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని నిర్ణయించారు. 'నిపుణ భారత్‌' వల్ల భాషకు సంబంధించి వినడం, మాట్లాడటం, పఠనం, రచన వంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. చిన్నారులు భవిష్యత్తులో మంచి చదువరులుగా, రచయితలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. గణితం పరంగా అంకెలు, సంఖ్యల అవగాహన, ఆకారాలను గుర్తించడం, వస్తువులను పోల్చడం, వర్గీకరించడం వంటి సామర్థ్యాలు అలవడతాయి. సమగ్ర శిక్ష పథకంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జాతీయ, రాష్ట్ర, జిల్లా, బ్లాకు, పాఠశాల స్థాయుల్లో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం అమలు చేస్తుంది.

25 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ

చిన్నారులందరికీ పునాది స్థాయిలోనే పరిపూర్ణమైన అక్షరాస్యత, కనీస గణిత నైపుణ్యాలను అలవరచడానికి ప్రత్యేక కార్యక్రమం అవసరాన్ని జాతీయ విద్యావిధానం-2020 ప్రస్తావించింది. దీనికనుగుణంగా 10+2 విద్య స్థానంలో 5+3+3+4 నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఇందులోని మొదటి అయిదు సంవత్సరాలను సన్నాహక దశగా పేర్కొన్నారు. ఈ దశలో అభ్యసనాభివృద్ధికి నిపుణ భారత్‌ పునాది వేస్తుంది. ఇందులో ఆటబొమ్మలతో బోధన, కథలు చెప్పడం, కళలు, ఆటలు, జట్టుపని, సాంకేతికత ఉండటంవల్ల పిల్లలకు నేర్చుకోవడం సంతోషాన్ని కలిగిస్తుంది. ఫలితంగా అర్ధాంతరంగా చదువును మానేసేవారి సంఖ్యా తగ్గుతుంది. క్షేత్రస్థాయిలో ఈ పథకం పటిష్ఠ అమలుకు 'నిష్ఠ' కార్యక్రమం కింద పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయుల్లోని 25 లక్షల మంది ఉపాధ్యాయులకు ఈ ఏడాది శిక్షణ ఇవ్వనున్నారు.

నిధుల కొరత

'నిపుణ భారత్‌'కు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం ఒక లోటు. సమగ్ర శిక్ష నిధులనే దీనికీ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకానికి 20 శాతం కోత విధించినందువల్ల నిధుల సమస్య తలెత్తవచ్చు. నిపుణ భారత్‌లో పేర్కొన్న మూడు-తొమ్మిది ఏళ్ల బాలలు అంగన్‌వాడీ, పాఠశాల విద్యలో ఉంటారు. ఈ రెండు స్థాయుల్లో వేర్వేరు విద్యా ప్రణాళికలు అమలవుతున్నాయి. వాటి మధ్య సమన్వయం లోపించి అభ్యసన సామర్థ్యాలపై ప్రభావం పడుతోంది.

నూతన విద్యావిధానంలో పేర్కొన్నట్లు ఈ వయసు వారందరినీ తక్షణం పాఠశాల విద్యావ్యవస్థలో భాగం చేయాలి. పూర్వ ప్రాథమిక విద్యలో చాలామంది ప్రైవేటు ప్లే స్కూళ్లకు వెళతారు. అక్కడ బోధనాభ్యసన వారి మానసిక స్థితికి అనుగుణంగా లేకపోవడంతో పిల్లలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఎన్‌సీఈఆర్‌టీ ప్రత్యేక పాఠ్య ప్రణాళిక, బోధన పద్ధతులను రూపొందించింది. ఇవి ఎక్కడా అమలు కావడం లేదు. వీటిని అనుసరించేలా చర్యలు తీసుకోవాలి. కేవలం బట్టీ విధానాలకు పరిమితం కాకుండా, మూల్యాంకనం సమగ్రంగా, సరళమైన పద్ధతిలో సాగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రతి చిన్నారి భవిష్యత్తు ఉజ్జ్వలంగా వెలుగొందే వీలుంటుంది.

రచయిత- సంపతి రమేష్‌ మహారాజ్‌

ఇదీ చూడండి:సంస్కరణలకు మూడు దశాబ్దాలు- అందరికీ అందని ఫలాలు

ABOUT THE AUTHOR

...view details