తెలంగాణ

telangana

ETV Bharat / opinion

విద్యార్థుల భావోద్వేగ నైపుణ్యాలకు పదును - భావోద్వేగ నైపుణ్యాలు

తోటి విద్యార్థుల సహచర్యం, తరగతి బోధన, విద్యాలయ వాతావరణం కొరవడి గృహ నిర్బంధంలాంటి పరిస్థితుల్లో ఉండిపోయి విద్యార్థులు ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల కోసం- అమెరికాలోని లైఫ్‌ విశ్వవిద్యాలయం, యునెస్కో పరిధిలోని మహాత్మాగాంధీ శాంతి, సుస్థిరాభివృద్ధి కేంద్రం రూపొందించిన 'సుగుణ శిక్షణ - స్వీయప్రేరిత అభ్యసన' కోర్సును అమలు చేసే విషయాన్ని పరిశీలించాలంటూ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు యూజీసీ సూచించింది.

emotional intelligence
భావోద్వేగ నైపుణ్యాలు

By

Published : Jun 28, 2021, 7:27 AM IST

పరీక్షలంటే కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, జీవితానికే అన్నట్లుగా నేటితరం విద్యార్థుల సన్నద్ధత ఉంటోంది. అయితే- సరైన ప్రణాళిక కొరవడి, పాఠాలు అర్థంకాక, ఆకళింపు చేసుకోలేక ఒత్తిడి బారిన పడుతున్నారు. అదే సమయంలో వారికి భావోద్వేగ మేధా నైపుణ్యాల (ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌) బోధన కొరవడుతున్నట్లు నిపుణులు ఆలస్యంగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది విద్యార్థులు కొవిడ్‌ మహమ్మారి కారణంగా దాదాపు ఏడాదిన్నర కాలంగా గడపదాటలేదు. అభ్యసన ప్రక్రియను దాదాపుగా ఆన్‌లైన్‌లోనే కొనసాగిస్తున్నారు.

ఒత్తిడిలో విద్యార్థులు..

తోటి విద్యార్థుల సహచర్యం, తరగతి బోధన, విద్యాలయ వాతావరణం కొరవడి గృహ నిర్బంధంలాంటి పరిస్థితుల్లో ఉండిపోయి ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల కోసం- అమెరికాలోని లైఫ్‌ విశ్వవిద్యాలయం, యునెస్కో పరిధిలోని మహాత్మాగాంధీ శాంతి, సుస్థిరాభివృద్ధి కేంద్రం రూపొందించిన 'సుగుణ శిక్షణ - స్వీయప్రేరిత అభ్యసన' కోర్సును అమలు చేసే విషయాన్ని పరిశీలించాలంటూ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు యూజీసీ సూచించింది. జాతీయ నూతన విద్యా విధానంలో ఆశించిన 21వ శతాబ్దపు భావోద్వేగ మేధా నైపుణ్యాల్ని పెంపొందించేందుకు విద్యార్థులకు ఈ కోర్సు సహాయ పడుతుందని యూజీసీ భావిస్తోంది. ఇప్పటికే 50కి పైగా దేశాలలో వేలమంది ఇందులో శిక్షణ పొందుతున్నట్లు యునెస్కో సైతం ప్రకటించింది.

మూడు సిరీస్‌లు.. 10 నైపుణ్యాలు

ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా విద్యార్థులు- టెలివిజన్‌, కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్లకు అంకితమై పోవడంతో శారీరకంగానే కాకుండా మానసికంగానూ కుంగిపోయినట్లు కరేబియన్‌ దేశమైన సెయింట్‌ విన్సెంట్‌కు చెందిన సెయింట్స్‌ జేమ్స్‌ వైద్యవిద్యా సంస్థ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండే, 70 శాతం విద్యార్థుల్లో స్వల్ప నుంచి తీవ్రస్థాయి కుంగుబాటు కనిపించిందని పరిశోధకులు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సర్వేల్లో దాదాపుగా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం కావడంతో ఈ భావోద్వేగ మేధా నైపుణ్యాల కోర్సుపై ఆసక్తి పెరిగింది. ఇందులో బహుముఖ భావనలతో కూడిన స్వీయప్రేరిత అభ్యసనలతో మూడు సిరీస్‌లు, 10 నైపుణ్యాలు ఉంటాయి.

సిరీస్​ల పరంగా..

మొదటి సిరీస్‌లో విద్యార్థి తన గురించి అవగాహన పెంపొందించుకోవడం ముఖ్యమైనది. దీనిద్వారా విద్యార్థులు తమ శారీరక, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. దీనివల్ల ఒత్తిడి సందర్భాల్లో అవాంఛనీయ నిర్ణయాలు తీసుకునే బలహీనత నుంచి బయటపడే నైపుణ్యం పెరుగుతుంది. ఫలితంగా స్వీయ నియంత్రణ, అంతర్గత ప్రశాంతత లభించి తమపై తమకు విశ్వాసం పెరుగుతుంది. అనవసర ఆందోళన, అఘాయిత్యాల వైపు మనసు మళ్ళకుండా మనోధైర్యం కలుగుతుంది. ఇతరులతో సుహృద్భావ సంబంధాలు పెంపొందించుకునే నైపుణ్యాలు రెండో సిరీస్‌లో ఉంటాయి. ఆధునిక నాగరికతకు మూలమైన మానవ సంబంధాలను మెరుగు పరుచుకోవడంపై ఇది దృష్టి పెడుతుంది. ప్రతి మాట, ప్రతి పనిలోనూ మానవతను ప్రదర్శించడం, స్థితప్రజ్ఞను ఏర్పరచుకోవడం, కృతజ్ఞతాభావం పెంపొందించుకోవడం, సానుభూతిని అలవాటు చేసుకోవడం వంటి నైపుణ్యాలకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. తోటివారిపట్ల, ప్రతి జీవిపైనా కరుణ, జాలి, దయ కలిగి ఉండాలన్నది ఈ సిరీస్‌లో నేర్చుకోవచ్చు.

లోతైన అవగాహన..

సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడానికి కరుణ మాత్రమే సరిపోదు. విమర్శనాత్మక విశ్లేషణ, వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకోవడం చుట్టూ ఉండే ప్రపంచంపై లోతైన అవగాహన కలిగి ఉండడం వంటి నైపుణ్యాలు మూడవ సిరీస్‌ ద్వారా అలవడతాయి. పరస్పర అవగాహన, అభినందించే తత్వం, వివేచనతో విమర్శించడం వంటి నైపుణ్యాలన్నీ ఈ కోర్సులో ఉంటాయి. పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉచితంగా బోధించే ఈ కోర్సు వ్యవధి 40 గంటలు. వ్యక్తిగత శ్రద్ధతో వేగంగా పూర్తి చేయవచ్చు. పరీక్షలు, అసైన్‌మెంట్లు ఉండవు. కోర్సు ముగింపులో విద్యార్థులకు యునెస్కో, లైఫ్‌ విశ్వవిద్యాలయం, మహాత్మాగాంధీ శాంతి, సుస్థిరాభివృద్ధి కేంద్రం సంయుక్తంగా ధ్రువపత్రం జారీచేస్తాయి.

ఉపాధ్యాయులకూ అవసరమే..

భావోద్వేగ నైపుణ్యాల సాధన కేవలం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకూ అవసరమే. ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్న విద్యార్థుల స్థానిక పరిస్థితులు, వారి మనోభావాలను అర్థం చేసుకుని పాఠాలను సరళంగా బోధించడానికి ఉపాధ్యాయులకు సరైన ప్రణాళిక అవసరం. సరైన గృహ లేదా కార్యాలయ వాతావరణాన్ని సృష్టించుకొని భావోద్వేగాలను సమన్వయ పరుస్తూ బోధన కొనసాగించడానికి ఈ కోర్సు తోడ్పడుతుంది. పనుల్లో ఒత్తిడిని జయించి, పని, జీవనం మధ్య సమతౌల్య సాధనకు, ఇంటా, బయట పనితీరు సంబంధాల మెరుగుదలను దృష్టిలో పెట్టుకుంటే ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులకే కాదు- అందరికీ ఉపయోగపడుతుంది. లాక్‌డౌన్లు, జనజీవనంపై ఆంక్షలు, ఎప్పటికప్పుడు మారుతున్న కొవిడ్‌ నిబంధనల మధ్య విద్యావ్యవస్థ గాడి తప్పింది. అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యా ప్రణాళికల అమలులో వెనుకంజలో ఉన్నాయి. పరీక్షలపై అనిశ్చితితో విద్యార్థులంతా సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒత్తిడిని జయించి భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడంలో తోడ్పడే శిక్షణలు కేవలం ఉపయుక్తమే కాదు, అత్యవసరమైనవి!

- డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి
(అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం)

ABOUT THE AUTHOR

...view details