తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కుండపోత- గుండెకోత.. అంచనాలకు అందని రుతుపవనాలు.. విపత్తులతో భారీ నష్టం - హిమాచల్ ప్రదేశ్ వరదలు 2023

EL Nino Effect In India 2023 : దేశంలో ఈసారి వర్షాపాతం సాధారణంగానే ఉండవచ్చని వాతావరణ శాఖ ఇదివరకు పలుమార్లు చెప్పుకొచ్చింది. అయితే అంతా అనుకున్నట్లే జూన్​ నెలలో పెద్దగా ప్రభావం చూపాని వానలు.. జులైలో కుండపోతను తలపిస్తున్నాయి.

EL Nino Effect In India 2023
దేశంలో ఎల్​నినో ప్రభావం

By

Published : Jul 12, 2023, 10:03 AM IST

Updated : Jul 12, 2023, 10:44 AM IST

EL Nino Effect In India 2023 : ఎల్‌నినో ముప్పు పొంచి ఉన్నప్పటికీ 2023 నైరుతి రుతుపవన కాలంలో దేశీయంగా సాధారణ వర్షపాతమే నమోదు కావచ్చునంటూ వాతావరణ విభాగం మొన్న ఏప్రిల్‌, మే నెలల్లో ఒకటికి రెండుసార్లు సెలవిచ్చింది. కానీ, అంచనాలకు అందకుండా సాగిన రుతుపవనాలు- ఒకే సమయంలో భిన్న ప్రాంతాలను విభిన్న కష్టనష్టాల పాల్జేశాయి. సరైన వానలకు నోచుకోని దక్షిణ భారతంలో అన్నదాతల ఆశల మొలకలు ఒకపక్క ఎండిపోతున్నాయి. మరోవైపు- భారీ వర్షాలు, వరదలతో హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, దిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్‌ అతలాకుతలమవుతున్నాయి. గడచిన యాభై ఏళ్లలో ఏనాడూ ఇంతటి కుండపోతను చవిచూడలేదన్న హిమాచల్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ వ్యాఖ్య- పరిస్థితి తీవ్రతను పట్టించేదే.

నైరుతి రుతుపవనాల అసాధారణ గమనంపై ఎల్‌నినో ప్రభావం ఉందని, బిపోర్‌జాయ్‌ తుపాను వల్ల అవి అతివేగంగా ఉత్తర భారతానికి విస్తరించాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2013 ఉత్తరాఖండ్‌ వరద బీభత్సం దరిమిలా దేశం తరచూ ఏదో ఒక పెనుఉత్పాతం బారినపడుతూనే ఉంది. ఆకాశం చిల్లుపడినట్లుగా ఒక్కసారిగా విరుచుకుపడే అతివృష్టి గండాలు పోనుపోను పెచ్చరిల్లనున్నాయని శాస్త్రలోకం ఎప్పటినుంచో హెచ్చరిస్తోంది. గడచిన కొన్నేళ్లలో విలయ విధ్వంసం సృష్టించిన విపత్తుల నుంచి గుణపాఠాలు నేర్వడంలో యంత్రాంగం వైఫల్యం- ప్రజాభద్రతను ప్రతిసారీ పెనుప్రమాదంలోకి నెడుతోంది. నియంత్రణ కరవైన నిర్మాణ కార్యకలాపాలు, తీరైన ప్రణాళికలేమీ లేకుండానే చేపడుతున్న అభివృద్ధి పనులు, జలవనరుల ఆక్రమణల వంటి వాటితో వరదనష్టాలు ఇంతలంతలవుతున్నాయి. పర్యావరణ వినాశనంతో తీవ్రతరమవుతున్న వాతావరణ మార్పులు- మానవాళి భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తున్నాయి!

పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితల జలాలు వేడెక్కడం మూలంగా ఉద్భవించేదే ఎల్‌నినో. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వర్షపాతాల తీరుతెన్నులు మారిపోతాయి. కొన్నిచోట్ల కుంభవృష్టి కురిస్తే- మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టి తరహా స్థితిగతులు కోరచాస్తాయి. ప్రతి రెండు- పది సంవత్సరాలకు ఒకసారి మోస్తరు నుంచి తీవ్రస్థాయి ఎల్‌నినోలు సంభవిస్తుంటాయి. 2001-2020 మధ్యకాలంలో ఇండియా తొమ్మిది ఎల్‌నినో సంవత్సరాలను ఎదుర్కొంటే- వాటిలో నాలుగేళ్లలో కరవు కోరల్లో చిక్కుకుంది. ఆయా సంవత్సరాల్లో ఖరీఫ్‌ దిగుబడులు తెగ్గోసుకుపోవడంతో దేశీయంగా ద్రవ్యోల్బణం ఎగబాకింది. ఈ ఏడాది ఎల్‌నినో వల్ల ఇండియాతో పాటు మిగిలిన దక్షిణాసియా దేశాలు, ఇండొనేసియా, ఆస్ట్రేలియాల్లో ఉష్ణోగ్రతలు అధికమై దుర్భిక్షం నెలకొనే ప్రమాదమున్నట్లు ప్రపంచ వాతావరణ సంస్థ రెండు నెలల క్రితమే హెచ్చరించింది.

దేశీయంగా 60శాతం సాగుభూములకు వర్షాలే ఆధారం. రుతుపవనాలు గతితప్పితే- వ్యవసాయం, దాని అనుబంధ వృత్తులు దెబ్బతింటాయి. దాంతో వస్తుసేవలకు గిరాకీ పడిపోయి పరిశ్రమలూ వ్యాపారాలూ పడకేస్తాయి. వర్షాభావంతో ఆహారోత్పత్తి మందగిస్తే- ధరలకు రెక్కలొచ్చి సామాన్యుల జీవితాలు ఇంకా దుర్భరమవుతాయి. ఎల్‌నినో దుష్ప్రభావాలను దీటుగా ఎదుర్కొనేందుకు స్వల్ప, దీర్ఘకాల ప్రణాళికలతో ప్రభుత్వాలు సన్నద్ధం కావాలి. పంటల సాగు, ఆహార నిల్వల పరంగా తగిన జాగ్రత్తలు వహించడం, రైతాంగానికి దన్నుగా నిలవడం అత్యంత కీలకం. వేసవి వరదలతో ఇటలీ, తీవ్ర కాటకాలతో ఉత్తర అమెరికా ఇప్పటికే ఎల్‌నినో బాధిత ప్రాంతాలయ్యాయి. మూడు లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.248 లక్షల కోట్లు) మేరకు ప్రపంచార్థికానికి ఎల్‌నినో గండికొట్టనుందన్నది అంచనా! వాతావరణ మార్పులతో వసుధ రుజాగ్రస్తమవుతున్న కొద్దీ ఎల్‌నినో ప్రతికూల ప్రభావాలు అనూహ్యం కావచ్చుననే విశ్లేషణలు వెలువడుతున్నాయి. కర్బన ఉద్గారాల కట్టడిలో ప్రపంచ దేశాల సమష్టి కృషి ప్రాణావసరమని అవి చాటిచెబుతున్నాయి!

Last Updated : Jul 12, 2023, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details