అంతర్జాలమే కార్యక్షేత్రంగా, స్మార్ట్‌ఫోన్లే నయా దోపిడి సాధనాలుగా సైబర్ నేరగాళ్లు అంతకంతకు పేట్రేగిపోతున్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ పార్లమెంటుకు ఇటీవల వెల్లడించిన సమాచారం ప్రకారం, 2019లో దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ దాడుల సంఖ్య దాదాపు నాలుగు లక్షలు. మరుసటి ఏడాది కొవిడ్ మహాసంక్షోభం మాటున అవి పదకొండున్నర లక్షలకు మించిపోయాయి. ఏడాది వ్యవధిలో దేశంలోని 52 శాతం సంస్థలు సైబర్ దాడులకు గురైనట్లు 'సోఫోస్' అధ్యయనం వెల్లడించింది. ఒక్క సంవత్సర కాలంలో విశ్వవ్యాప్తంగా సైబర్ నేరాల బాధితులుగా లెక్కతేలిన 35కోట్లమందిలో భారతీయులు 13కోట్లమంది అని మరో అధ్యయనం స్పష్టీకరించింది.
కలిసికట్టుగా సమరం సాగిస్తేనే..
ఆన్‌లైన్ నేరాలు, గ్యాంబ్లింగ్ ఘటనలు, రుణ యాప్‌ల పేరిట దారుణాలు పోనుపోను పెచ్చరిల్లుతున్నా- విచారణ ఒక కొలిక్కి వచ్చి సూత్రధారులు, పాత్రధారుల జాతకాలు బట్టబయలై శిక్ష ఖరారవుతున్న సందర్భాలు స్వల్పమే. సరైన సాక్ష్యాధారాలు కొరవడి 50శాతానికిపైగా సైబర్ మోసాల కేసులు ప్రాథమిక దశలోనే మూతపడుతున్నాయి. గోవాలాంటి చోట్ల కొన్నేళ్లుగా ఒక్క కేసులోనూ సైబరాసురుల నేరనిర్ధారణ జరగనే లేదంటే- కేటుగాళ్లు కొరమీనుల్లా ఎలా జారిపోతున్నారో తేటపడుతూనే ఉంది. ఒక కేసులో నిందితుల ఆచూకీ గుర్తించేలోగానే మరో 20, 30 కేసులు వచ్చిపడుతున్నాయని, ఇతర రాష్ట్రాలకు వెళ్లి గుట్టుగా మకాం వేసి నేరగాళ్లను పట్టుకోగలిగినా చోరీసొత్తు అప్పటికే చేతులు మారిపోతున్నదని పోలీస్ బృందాలు నిస్సహాయత వ్యక్తపరుస్తున్నాయి. కొంతమంది నిర్వాహకులపై చర్యలు చేపడుతున్నట్లు ఉన్నత న్యాయస్థానానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా నివేదించినా- మృత్యుపాశాలు విసరుతున్న రుణయాప్‌లను టోకున చాపచుట్టడం ఇప్పటికీ సాధ్యపడలేదు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కీలక విభాగాల తోడ్పాటుతో కలిసికట్టుగా సమరం సాగిస్తేనే తప్ప, సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడదు.
వర్క్ ఫ్రం హోంతో..
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో 'ఇంటి నుంచి పని' పద్ధతికి ప్రాచుర్యం లభించిన దరిమిలా- దిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో వ్యక్తిగత కీలక సమాచారం తస్కరించి కోరిన మొత్తం ముట్టజెప్పాల్సిందేనన్న డిమాండ్లు జోరెత్తాయి. ఒక వైద్య విద్యార్థిని పేరిట తొమ్మిదో తరగతి విద్యార్థి అసభ్య సందేశాలు పంపించి అడ్డంగా దొరికిపోయిన ఉదంతం భాగ్యనగరంలోనే వెలుగుచూసింది. క్రెడిట్ కార్డు సమాచారం, బీమా వివరాలు తదితరాల్ని దొంగిలించే ఫిషింగ్ బాగోతాలు, రుణ పందేరాలూ ఖరీదైన బహుమతుల రూపేణా మాయవలలు... లెక్కకు మిక్కిలి. ఫిషింగ్, ఆన్‌లైన్ వేధింపుల వంటివి ఫలానా సెక్షన్ల ప్రకారం శిక్షార్హాలని చాటే చట్టాలెన్ని కొలువు తీరినా- నేరగాళ్లను సత్వరం జైలు ఊచల వెనక్కి పంపకపోతే... ఉండీ లేనట్టే!
వ్యూహాలకు పదును..
అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, రష్యా, బ్రెజిల్ ప్రభృత దేశాలు సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. దేశీయంగా ఒక్క ఏడాది వ్యవధిలోనే లక్షా పాతికవేల కోట్ల రూపాయల మేర కొల్లగొట్టిన సైబర్ చోర ముఠాలను ఇంకా ఉపేక్షించడమేమిటి? ఒక వ్యక్తిని హతమారిస్తే ఉరిశిక్ష విధించే దేశంలో, అసంఖ్యాక బాధితుల ఉసురు తీస్తున్న కర్కశ బృందాల భరతం పట్టకపోవడమేమిటి? అవసరమైతే చట్టాల్ని తిరగరాయాలి, సాకల్యంగా సమీక్షించాలి. '112' నంబరుకు ఫిర్యాదు చేసిన రెండుగంటల వ్యవధిలో సైబర్ నేరం తాలూకు లబ్ధిదారుడి ఖాతానుంచి బాధితుడికి సొమ్మును భద్రంగా అందజేయడానికి ఉద్దేశించిన వ్యవస్థను బెంగళూరు నగర పోలీస్ విభాగం పట్టాలకు ఎక్కించింది. ఇతర రాష్ట్రాలకూ దాన్ని విస్తరించి, సైబర్ ముష్కరులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో కఠిన శిక్షలు విధించి త్వరగా అమలుపరచేలా చూడాలి. సైబర్ నేరాల ఉరవడికి పగ్గాలు బిగించేలా సాంకేతికతను మెరుగుపరచుకోవడంలోనూ కేంద్రం, రాష్ట్రాలు పరస్పర సమన్వయంతో ముందడుగేయాలి!
ఇదీ చదవండి:మరో 100రోజుల వరకు కరోనా ముప్పు: వైద్యులు
ఇదీ చదవండి:'వైరస్‌ను తేలికగా తీసుకోవడమే అత్యంత ప్రమాదకరం'