తెలంగాణ

telangana

By

Published : Oct 26, 2021, 5:53 AM IST

ETV Bharat / opinion

Plastic Pollution: ప్రాణాంతక ప్లాస్టిక్‌పై ప్రజాఉద్యమం

సుమారు వందేళ్లక్రితం పుట్టిన ప్లాస్టిక్‌ విశ్వవ్యాప్తంగా మానవ జీవనంలో అంతర్భాగమైపోయింది. దశాబ్దాలుగా తయారైన వందల కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో (Plastic Pollution in India) అయిదింట నాలుగొంతుల మేర పునశ్శుద్ధికి నోచుకొనకుండా భూమిపైనో సముద్ర జలాల్లోనో పేరుకుపోయి- జీవావరణానికి నిలువెల్లా తూట్లు పడుతున్నాయి. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తుల్ని సమర్థంగా అరికట్టడం మానవాళి భవితవ్యానికి ప్రాణావసరం. లేదంటే రేపటి తరం భయానక ముప్పు బారినపడే ప్రమాదం ఉంది.

Plastic Pollution
ప్లాస్టిక్

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై నిషేధాంక్షల (Plastic Ban in India) అమలుకు రెండేళ్లక్రితం ప్రతినపూనిన కేంద్రం, ఇటీవల నిర్దిష్ట విధినిషేధాలను క్రోడీకరించింది. ఆ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్ని పట్టాలకు ఎక్కించే యత్నాలు రాష్ట్రాలవారీగా నమోదవుతున్నాయి. తెలంగాణ పురపాలకశాఖ తరఫున స్థానిక సంస్థలకు తాజాగా ఆదేశాల జారీ, అందులో భాగమే. పునర్వినియోగానికి పనికిరాని పచారీ సరకుల సంచులు, సీసాలు, క్యాండీలకు ఉపయోగించే పుల్లలు, స్ట్రాలు, చిన్నకప్పులు, గిన్నెల వంటివన్నీ ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ ఉత్పాదనలుగా ఐక్యరాజ్యసమితి లోగడ నిర్ధారించింది. ఆ నిర్వచనానికే కేంద్రం ఓటేసిన దృష్ట్యా- వాటన్నింటిపైనా 2022 సంవత్సరం జులై ఒకటో తేదీనుంచి నిషేధం అమలుకానుంది. వంద మైక్రాన్ల (మైక్రాన్‌ అంటే మీటరులో పది లక్షలో వంతు) కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్‌ లేదా పీవీసీ బ్యానర్లనూ ఆ జాబితాలో చేర్చారు. వచ్చే ఏడాది డిసెంబరు 31వ తేదీనుంచి ప్లాస్టిక్‌ కవర్లు, చేతిసంచులు 120 మైక్రాన్ల మందంకన్నా తక్కువ ఉండటాన్ని అనుమతించరు! మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ ప్రభృత రాష్ట్రాల్లో ఇలా వాడి అలా పారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తుల విక్రయాలు, నిల్వ, వినియోగాలను శిక్షార్హమైనవిగా గతంలోనే ప్రకటించినా ఒరిగిందేముంది? ప్రాంతాలవారీగా, సంస్థలవారీగా, ప్రభుత్వపరంగా ఇటువంటి ఆంక్షలు గతంలోనూ పలుమార్లు జారీ అయినా- చాలాచోట్ల దస్త్రాలకు, ప్రకటనలకే పరిమితమయ్యాయి. హెచ్చరికలు, జరిమానాలు దాదాపుగా ప్రభావశూన్యమైన నేపథ్యంలో- జనచేతన కార్యక్రమాలపై ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది. స్థానిక ప్రజానీకం క్రియాశీలక భాగస్వామ్య పాత్ర పోషించిన సిక్కిమ్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణ విజయవంతమైంది. జాతీయ స్థాయిలో ఆ స్ఫూర్తి పరిఢవిల్లేలా విస్తృత అవగాహన సదస్సుల నిర్వహణ బాధ్యతను కేంద్రం, రాష్ట్రాలు చురుగ్గా అందిపుచ్చుకోవాలి!

సుమారు వందేళ్లక్రితం పుట్టిన ప్లాస్టిక్‌ విశ్వవ్యాప్తంగా మానవ జీవనంలో అంతర్భాగమైపోయింది. చేతిసంచులు, కాఫీ కప్పుల నుంచి కంప్యూటర్ల వరకు అన్నింటా తన ఉనికిని చాటుకుంటోంది. దశాబ్దాలుగా తయారైన వందల కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో అయిదింట నాలుగొంతుల మేర పునశ్శుద్ధికి నోచుకొనకుండా భూమిపైనో సముద్ర జలాల్లోనో పేరుకుపోయి- జీవావరణానికి నిలువెల్లా తూట్లు పడుతున్నాయి. భారత్‌లో ప్రతిరోజూ సగటున 26వేల టన్నులదాకా ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగుపడుతున్నాయని, ఏడాదిలో ఆ రాశి 95 లక్షల టన్నులకు చేరుతోందన్నది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అంచనా. అవి చివికి ఛిద్రమై నేలలో కలిసిపోయేలోగా దశాబ్దాల తరబడి వాననీటిని భూమిలోకి ఇంకనివ్వకుండా భీకర వరదలకు కారణమవుతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలను జీర్ణించుకోలేక పెద్దయెత్తున సముద్ర పక్షులు, చేపలు, క్షీరదాలు మృత్యువాత పడుతున్నాయి. ఇండియాలో చనిపోతున్న ప్రతి ఆవు, గేదె పొట్టలో 30, 40 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటపడుతున్నాయి. సూక్ష్మ ప్లాస్టిక్‌ మానవ శరీర కణాల్ని, డీఎన్‌ఏను సైతం దెబ్బతీసి తీవ్ర అనారోగ్య సమస్యలు సృష్టిస్తున్నట్లు అధ్యయనాలెన్నో స్పష్టీకరిస్తున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాల కట్టడిలో విఫలమైతే రేపటి తరానికి అణ్వస్త్రాలను మించిన భయానక ముప్పు తప్పదని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించి ఏడేళ్లు గడిచినా, పరిస్థితి ఏమాత్రం తేటపడలేదు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తుల్ని సమర్థంగా అరికట్టడం మానవాళి భవితవ్యానికి ప్రాణావసరం. అందుకు తగ్గట్లు జర్మనీ, ఇంగ్లాండ్‌ తదితరాల తరహాలో ఉత్పత్తి, వినియోగాలపై ఆంక్షలు కట్టుదిట్టంగా అమలుకు నోచుకునేలా పౌరసమాజం కలిసిరావాలి. చిన్నప్పటినుంచీ అమ్మానాన్నల సూచనలు, ఉపాధ్యాయుల బోధనలు, పౌరస్పృహ రగిలించే పాఠ్యాంశాల కూర్పుపై ప్రభుత్వాలు శ్రద్ధ పెడితే రేపటి తరంలో బాధ్యతాయుత వర్తన మొగ్గతొడుగుతుంది. సుస్థిర ప్రజాభాగస్వామ్యంతోనే ప్లాస్టిక్‌ వ్యతిరేక పోరాటం ఫలప్రదమవుతుంది!

ఇదీ చూడండి:ప్లాస్టిక్‌ వ్యర్థాలు కుప్పలుతెప్పలు.. పునర్వినియోగం అంతంతే

ABOUT THE AUTHOR

...view details