వాతావరణ మార్పులపై (Climate Change News) హాలీవుడ్ సినిమాలు చూపించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం నిజజీవితంలో మనకు అనుభవంలోకి వస్తున్నాయి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, అడవుల్లో కార్చిచ్చులు, ప్రపంచవ్యాప్తంగా వరదల బీభత్సం నిత్యం వార్తల్లో కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ మార్పులపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి సన్నద్ధమవుతోంది. బ్రిటన్‌లోని గ్లాస్గో వేదికగా ఈ నెల 31 నుంచి నవంబర్ 12 వరకు (COP26 News) సీఓపీ-26 (వాతావరణ మార్పుల సదస్సు) జరగనుంది. 2015 పారిస్ ఒప్పందం నేపథ్యంలో వాతావరణ మార్పులను నివారించేందుకు నిరుడు సీఓపీ-25లో 197 దేశాలు సమాలోచనలు చేశాయి. సీఓపీ-25 అనంతరం సాధించిన పురోగతిని వివిధ దేశాల అధ్యక్షులు, దౌత్య, వ్యాపారవేత్తలు తాజా సదస్సులో చర్చించనున్నారు. ప్యారిస్ ఒప్పందంలో భాగంగా సగటు భూ ఉష్ణోగ్రతల్లో పెంపు రెండు డిగ్రీల సెల్సియస్ మించకుండా చూసుకుంటూనే, మొత్తంగా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని 197 దేశాలు అంగీకరించాయి. ఇందుకోసం ఆయా దేశాలు కర్బన ఉద్గారాలను భారీగా తగ్గించి 2010 నాటి స్థాయికి తీసుకురావాలి. 2030 నాటికి లక్ష్యాన్ని సాధించే దిశగా ఆయా దేశాలు జాతీయంగా నిర్దేశిత ప్రణాళికలు (ఎన్‌డీసీ) ఏర్పరచుకోవాలి. పేద, వర్ధమాన దేశాలపైనే వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉందన్నది కాదనలేని సత్యం.
కాలుష్యం పెరిగిపోవడంలో పాశ్చాత్య దేశాలదే ప్రధాన వాటా. ప్రపంచ జనాభాలో 30శాతమే అయినా 75శాతం వనరులను ఉపయోగించుకుంటూ అధిక మొత్తంలో కర్బన ఉద్గారాలను అవి విడుదల చేస్తున్నాయి. ఇందులో 100 పేద, వర్ధమాన దేశాల వాటా 3.6శాతం మాత్రమే. ఈ దేశాల్లో కరవు తాండవిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తీరప్రాంతాలు (Effects of Global Warming) నీట మునుగుతున్నాయి. జీవవైవిధ్యం దెబ్బతిని, అనేక వన్యప్రాణులు వేగంగా అంతరించిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలంటే హరిత గృహ వాయువులను తగ్గించేందుకు కృషి చేయాలని భారత్ సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు డిమాండ్ చేశాయి. దీంతో సుమారు రూ.7.49 లక్షల కోట్ల విలువైన వార్షిక హరిత పర్యావరణ నిధి(జీసీఎఫ్)ని ఏర్పాటు చేసేందుకు పాశ్చాత్య దేశాలు అంగీకరించాయి. వాతావరణ మార్పులతో అల్లకల్లోలంగా మారిన దేశాలను ఆదుకునేందుకు, కర్బన ఉద్గారాలను సమర్థంగా తగ్గించిన దేశాలకు రివార్డులందించేందుకు ఈ నిధిని వినియోగించనున్నారు. సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, బయోడీగ్రేడబుల్ (బ్యాక్టీరియాతో నశింపజేసే) ఉత్పత్తుల పరిశ్రమలో నూతన ఆవిష్కరణలకు ఆర్థిక ప్రోత్సాహకాలూ అందించవలసి ఉంది.
జీసీఎఫ్ వినియోగంలో ప్రభుత్వాలు జవాబుదారీతనంగా ఉండేందుకు అవసరమైన న్యాయపరమైన యంత్రాంగాన్ని రూపొందించడంపై సీఓపీలో చర్చించడం అత్యావశ్యకం. పారదర్శకత, జవాబుదారీతనంతోనే ఆ నిధులను న్యాయబద్ధంగా వినియోగించుకోవచ్చు. జీసీఎఫ్‌లో అందుతున్న వాటా చర్చనీయాంశంగా మారింది. 2017లో ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలకు వార్షిక 10వేల కోట్ల డాలర్ల నిధి నుంచి తక్కువ మొత్తమే అందింది. సుమారు 710 కోట్ల డాలర్లు రుణాల రూపంలో దక్కాయి. జీసీఎఫ్‌లో అధిక మొత్తం పునరుత్పాదక ఇంధన వనరులు, పర్యావరణ అనుకూల వాహన తయారీ వంటి రంగాల్లో ఉన్న అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకే దక్కింది. వాతావరణ మార్పులతో అధిక ముప్పును ఎదుర్కొంటున్న పేద, వర్ధమాన దేశాలు జీసీఎఫ్‌తో లబ్ధి పొందేలా చర్యలు చేపట్టడం తప్పనిసరి. సత్ఫలితాలు దక్కాలంటే పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఈ నిధులను స్థానికంగా పర్యావరణ అనుకూల పరిశ్రమలకు అందుబాటులో ఉంచాలి. వాతావరణ మార్పులకు అనుగుణంగా సమర్థ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు అన్ని దేశాల మధ్య జవాబుదారీతనాన్ని పెంచే దిశగా సీఓపీ-26లో చర్చలు జరగడం అత్యావశ్యకం.