ఇకపై లాక్‌డౌన్ నిరవధికంగా కొనసాగే అవకాశాలు తక్కువే. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి సంస్కరణల బాటన సాగాల్సిందే. ప్రస్తుతం కరోనా వైరస్ ఉద్ధృతి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. 1991 నాటి అసంపూర్ణ సంస్కరణల అజెండాను పరిపూర్తి చేయడానికి ఇది సరైన తరుణమని భావించాలి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ గడువు మే 17వ తేదీతో ముగియనుంది. దానివల్ల కరోనా వైరస్ నాశనం కాదనేది నిష్ఠుర సత్యం. దీన్ని మరింతగా పొడిగిస్తే, మరిన్ని ఇక్కట్లు తప్పేలా లేవు. నిర్దిష్టమైన టీకా అందుబాటులోకి వచ్చేంతవరకు మనం వైరస్‌తో కలిసి బతకడాన్ని అలవాటు చేసుకోవాల్సిందే. టీకా కోసం వేచి చూస్తూ ఆర్థిక వ్యవస్థను మూసి ఉంచుకోలేమన్నది సుస్పష్టం. అందుకని, వైరస్‌తో కలిసి నడిచే దిశగా ప్రభుత్వాలు, ప్రజలు సంసిద్ధమవ్వాలి.
వృద్ధికి అనుకూల వాతావరణం అవసరం
సరైన స్పష్టత లేకుండా, స్థానిక ప్రభుత్వాలు, విభిన్న రాష్ట్రాల మధ్య తగిన సమన్వయం లేకుండా వాణిజ్య, పరిశ్రమల వర్గాలకు సడలింపులు కల్పించి, ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభిస్తే గందరగోళ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఉదాహరణకు యజమానులు, ఉద్యోగుల రాకపోకలకు అవసరమైన రవాణా సౌకర్యాల్ని పునరుద్ధరించకుండా గురుగ్రామ్, నోయిడాల్లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చినంత మాత్రాన ఉపయోగమేమీ ఉండదు. అంతేకాదు, వారందరినీ తమ కర్మాగారాలు ఉండేచోటనే ఉండాలంటూ ఒత్తిడి చేయడమూ సమంజసం కాదు. ఆర్థిక కార్యకలాపాల్ని పునఃప్రారంభించే విషయంలో ప్రజలు కొన్ని ఇబ్బందుల్ని భరించైనా ముందుకొచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వాలు వారికి ఆటంకాలు కల్పించకుండా ఉంటే మంచిది.
వలస కూలీల పరిస్థితి దయనీయం
లాక్‌డౌన్ కాలంలో పేదలు, దినసరి కూలీలు పరిస్థితి దయనీయంగా మారింది. రోజువారీ కూలి డబ్బులు అందకపోతే వారు బతుకీడ్చే పరిస్థితి లేదు. ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత వారికి సమృద్ధిగా ఆహారం, తగిన పని దొరుకుతుందన్న హామీ కూడా లేదు. తమకూ తమ కుటుంబాలకు కడుపు నిండా తిండిపెట్టే విషయంలో గూడుకట్టుకున్న నిస్పృహే వారిని నగరం బాట పట్టేలా ముందుకు తోసింది. ఇప్పుడు నగరం విడిచి వెళ్లాలంటూ మహమ్మారి వారిని తరమడంతో వలస కూలీలు సొంతూళ్లకు వెళుతున్నారు. అక్కడ వారికి కడుపులు నిండకపోయినా, కనీసం తల దాచుకునేందుకు ఓ గూడైనా ఉంటుంది. మరీ ముఖ్యంగా, తమ బాధలు, చిన్నచిన్న కష్టాల్ని పంచుకునేందుకు నగరంలో లభ్యంకాని, ఒక సామాజిక ఉపశమనం సొంతూళ్లలో దొరుకుతుంది. పేదల కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వలస కూలీలు వాటి నుంచి ప్రయోజనాలు పొందవచ్చు. రబీ పంట కోత, నూర్పిడికి, ఖరీఫ్ పంట విత్తడానికి వారిని ఉపయోగించుకునే మార్గాలున్నాయి. వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడంతో పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వ్యవసాయ కూలీల కొరత నెలకొంది.