కొవిడ్ మహమ్మారి సంప్రదాయ విద్యావిధానానికి పలు సవాళ్లు విసిరింది. అదే సమయంలో, ఎన్నో సంస్కరణలకు తలుపులు తెరవడానికి అవకాశాలు కల్పించింది. ఈ క్రమంలో సంక్షోభాలను అవకాశాలుగా మలచుకునే వ్యూహంతో ప్రభుత్వం మున్ముందు అన్ని స్థాయుల్లో డిజిటల్ విద్య దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. 'ప్రధానమంత్రి ఈ-విద్య' కార్యక్రమం అటు వేసిన బలమైన అడుగుగా భావించవచ్ఛు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సహకరిస్తే, విద్యాభ్యాసంలో ఆన్‌లైన్ పద్ధతి అత్యంత ఆదరణ పొందగల వీలుంది. మనదేశంలో నాలుగు గోడల మధ్య బోధించే విద్యా విధానమే ఎన్నో ఏళ్లుగా ఆచరణాత్మకంగా ఉంటూ వస్తోంది. అంతర్జాల సాంకేతిక పరిజ్ఞానం అత్యంత వేగంగా ముందడుగు వేస్తున్న కాలంలో సైతం సంప్రదాయ విద్యారంగం అడుగులు ముందుకు పడటం లేదు. ఆన్‌లైన్ విద్యాబోధన వల్ల అభ్యసన ప్రక్రియ బలహీనపడుతుందనేది పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల వాదన. ఇలా బలంగా పాతుకుపోయిన అభిప్రాయాల కారణంగా ఆన్‌లైన్ విద్యకు అంతగా ఆదరణ దక్కలేదు. భారత్‌లోకి కొవిడ్ అడుగుపెట్టి, వేగంగా వ్యాపించడంతో దేశంలోని విద్యాకేంద్రాలు చాలావరకు మూతపడ్డాయి. అవి త్వరలో తెరుచుకునే అవకాశాలూ అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఈ సరికొత్త మార్పులకు సంబంధించిన వాస్తవాన్ని గ్రహించిన పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ కేంద్రాలు ఆన్‌లైన్ విద్యా పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నాయి. దీనినే ప్రధాన పద్ధతిగా మార్చుకున్నాయి. ఫలితంగా, విద్యారంగంలోని కీలక శక్తులు సైతం ఆన్‌లైన్ విద్యపై వ్యతిరేక అభిప్రాయాలకు తిలోదకాలిస్తూ, వేగంగా వస్తున్న మార్పుల్ని అందిపుచ్చుకోవడం ప్రారంభించాయి. ఆన్‌లైన్ విద్యపై విద్యార్థుల్లోనూ సానుకూలత, ఆమోదనీయత పెరగడానికి పలుకారణాలు తోడయ్యాయి. ఒక్క ముక్కలో- రాబోయే కాలంలో విద్యా పద్ధతి విభిన్నంగా ఉండబోతోంది.
డిజిటల్ అభ్యసనం వైపు...
రాబోయే కాలంలో ఇలాంటి పరిసితి వాస్తవరూపం దాల్చే అవకాశం ఉండటంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ ఈ మార్పు దిశగా ముందు వరసన నడిచేందుకు కృషి చేస్తోంది. 'పీఎం ఈ-విద్య' కార్యక్రమం ద్వారా డిజిటల్ అభ్యసన ప్రక్రియను ప్రోత్సహించే దిశగా సాగుతోంది. తాజా పరిణామాలపై హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ స్పందిస్తూ... కొవిడ్ కారణంగా విద్యారంగానికి ఎదురైన సవాలును ఎదుర్కొనేందుకు విద్యావ్యవస్థలో భారీ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంతంలో చదివే విద్యార్థికి అందుబాటులో ఉండే పాఠ్యసామగ్రి పల్లెలో ఉండే విద్యార్థికి సైతం సమాన స్థాయిలో ఉండాలంటున్నారు. ఈ దిశగా తొలి అడుగుగా, పాఠ్య ప్రణాళికను సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేస్తున్నామని, విభిన్న రంగాల భౌగోళిక ప్రాంతాలు, నేపథ్యాలు ఉండే విద్యార్థులందరికీ ‘పీఎం ఈ-విద్య’ సమాన అవకాశాలను కల్పిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖ 2020-21 సంవత్సరానికిగాను యూజీసీ నుంచి ముందస్తు ఆమోదం లేకుండా పూర్తిస్థాయి ఆన్‌లైన్ డిగ్రీ కోర్సుల నిర్వహణకు విశ్వవిద్యాలయాల్ని ఎంపిక చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ లక్ష్యసాధన కోసం విద్యార్థులకు నాణ్యమైన విద్యను కొనసాగేలా చూసేందుకు కొత్త ఆన్‌లైన్ కోర్సుల్ని ప్రారంభించేందుకు హెచ్‌ఆర్‌డీ శాఖ 100 ఉన్నత విద్యాసంస్థలను ఎంపిక చేయనుంది. భారత్‌లో ప్రస్తుతం 50.40 కోట్ల క్రియాశీలక అంతర్జాల వినియోగదారులు ఉన్నారు. కొత్త విద్యావిధానం కింద ప్రభుత్వం అంతర్జాల వినియోగదారులు పెద్దసంఖ్యలో ఉండటాన్ని సావకాశంగా మలచుకుని ఉన్నత విద్యలో ‘స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్)’ని పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మనదేశంలో 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసులో 15 కోట్ల మంది ఉండగా, 3.7 కోట్ల మంది (26.3శాతం) మాత్రమే విద్యావ్యవస్థలో నమోదయ్యారు. ఇది అమెరికాలో 88 శాతం, బ్రిటన్‌లో 60 శాతం, చైనాలో 48 శాతంగా ఉంది. ఉన్నత విద్యలో జీఈఆర్‌ను పెంచేందుకు దేశవ్యాప్తంగా 736 జిల్లాల్లో కనీసం ఒకటి చొప్పున బహుళ అంశాలతో కూడిన కళాశాలలను ఏర్పాటు చేయాలని హెచ్‌ఆర్‌డీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి కళాశాలలను డిజిటల్ సాధన సంపత్తితో తీర్చిదిద్దాలని, దానివల్ల ఆ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉండేవారికీ ఆన్‌లైన్ విద్యను అందించడం సాధ్యమవుతుందని భావిస్తోంది.
అదేబాటలో యూజీసీ