తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'ప్రపంచాన్ని జయించినా... భారత్​పై నా లెక్క తప్పిందే?' - కరోనా వైరస్ తాజా వార్త

కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎవరి నోట విన్న ఇదే పేరు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మందికి వైరస్ సోకిందని... ఎంతో మందిని బలి తీసుకుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. అగ్రరాజ్యమైన అమెరికా మహమ్మారి ధాటికి అతలాకుతలమవుతోందని, ఐరోపా దేశాల్లో అయితే ఈ వైరస్​ విలయతాండవం చేస్తోందని చెవులు కొరుక్కుంటున్నారు. కానీ ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నప్పటికీ భారత్​లో మాత్రం దీని ప్రభావం ఒకింత తక్కువగానే ఉందని చెప్పక తప్పదు. మరి ప్రపంచ దేశాలను పక్కన పెడితే కరోనా వైరస్​ మన భారతదేశం గురించి ఎలా అనుకుంటుందో తెలుసుకుందాం!

Conquering the world ... Is my assessment of India wrong?
ప్రపంచాన్ని జయించినా... భారత్​లో ఓడిపోతున్నానే!

By

Published : May 3, 2020, 4:57 PM IST

కరోనా అనే నేను...

‘కరోనా అనే నేను... మీ ఆరోగ్య, ఆర్థిక విచ్ఛిత్తికి ఎల్లవేళలా కృషి చేస్తానని... మొండితనాన్ని పుణికి పుచ్చుకొని నా ఉనికిని చాటుతానని నా విధి నిర్వహణలో రాగ ద్వేషాలకు తావివ్వనని... అస్మదీయులు-తస్మదీయులనే తారతమ్యం చూపనని... నాకు అందరూ 'భస్మ'దీయులే అని, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరోనాశుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నా...

ప్చ్‌! ఎంత ఘనంగా ప్రమాణస్వీకారం చేసి ఏం లాభం...

నా పని నన్ను మీరు సరిగా చేసుకోనివ్వడం లేదుగా! చైనాలో చీల్చిచెండాడా... ఇటలీలో అల్లకల్లోలం సృష్టించా... స్పెయిన్‌కు పెయిన్‌ అంటే ఏమిటో రుచి చూపించా! పెద్దన్న అమెరికా ఇగోను టచ్‌ చేసి ఇరకాటంలో పెట్టా! మీ భారతదేశంలో మాత్రం ఒకింత నత్తనడక నడుస్తున్నా! కొంచెం వేగం పెరిగినా ఇది ప్రపంచంతో పోల్చుకుంటే- అబ్బే... బొత్తిగా తుస్సే!

కారణం ఏమిటా అని ఆరాతీస్తే- అసలు విషయం తెలిసింది. నాకు ప్రధానంగా ఇద్దరు శత్రువులు తయారయ్యారని! ఒకరు లాఠీ పట్టుకుని... ఖాకీ చొక్కా వేసుకున్న పోలీసు! మరొకరు మెడలో స్టెతస్కోపుతో... చేతిలో సూదిమందుతో వైద్యుడు! ఈ ఇద్దరూ నా పని నన్ను చేసుకోనివ్వడం లేదు.

మీరే చెప్పండి- నాకూ ‘కరోనా కుటుంబం’ ఉంది. నా టార్గెట్లు నాకుంటాయి! నేను బద్దలు కొట్టాల్సిన రికార్డులూ నాకుంటాయి! ఇవి చేరుకోకుంటే నా ‘కరోనా కుటుంబం’ ముందు నా ఇతర వైరస్‌ బంధువుల ముందు నా పరువు బరువు ఏం కావాలి?!

మా పెదనాన్న మశూచి పిశాచిని టీకాతో ఠికాణా లేకుండా చేశారు. మా పిన్ని పోలియోను పో... పొమ్మని వెళ్లగొట్టారు. మా చిన్నాన్న ఎయిడ్స్‌కూ ఇప్పుడు ఎవరూ పెద్దగా భయపడటం లేదు. హాయిగా ఆయుర్దాయం పెంచేసుకుంటున్నారు. మా వేలువిడిచిన వియ్యంకుడు జికా నుంచి జింకల్లా తప్పించుకున్నారు. మా మేనమామ ఎబోలా సైతం తొందరగానే చాప చుట్టేశాడు. మా మరదలు పిల్ల నిఫా పాచికల్నీ పారకుండా చేశారు. మా బావమరిది సార్స్‌ మీ ముందు పగిలిన సాసరే అయ్యాడు. అంతెందుకు- స్పానిష్‌ ఫ్లూ నుంచి స్వైన్‌ ఫ్లూ వరకు మీ మానవులు అన్నింటినీ తట్టుకున్నారు. ఎన్నింటినో జయించారు. రేపోమాపో నా తోకా కత్తిరిస్తారు. నా కోరలూ పీకేస్తారు. ఈ లోపు నా ఆకలి నేను తీర్చుకోవాలి కదా!

‘బతికి బట్టకట్టాలంటే... మూతికి బట్టకట్టాల్సిందే’ అని మీలో చాలామందికి జ్ఞానోదయమైంది. పొద్దస్తమానమూ కర శుభ్రకర కారకాల (హ్యాండ్‌ శానిటైజర్ల)తో ఓ... చేతులు తెగ తోమేసుకుంటున్నారు. ఎక్కడపడితే అక్కడ పిచ్చిపిచ్చిగా రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. నాకూ ప్రాణముంటుందని... దానికీ బాధ ఉంటుందని మాత్రం ఆలోచించడం లేదు. ఆ శుచీ శుభ్రత నన్ను ఎంత బాధపెడుతున్నాయో మీకు తెలుసా?! ఆ రసాయనాల ఘాటుకు నా గుండె ఎన్నిసార్లు మౌనంగా రోదించిందో మీకేమన్నా అర్థమవుతోందా!

పోనీ ఒకరి మీద నుంచి మరొకరి మీదకు పేనులా దూకి పెత్తనం చలాయిద్దాం అనుకుంటుంటే- మీరేమో దూరం దూరం అంటూ భౌతికదూరం పాటిస్తున్నారు. కళ్లులేని కబోదిని... కాళ్లు చేతులూ లేని ప్రత్యేక ప్రతిభావంతుడిని! నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టాలా? తేలిగ్గా నాకు చిక్కొచ్చు కదా!

అసలే ఈ మధ్య నేను దశకంఠ రావణుడిలానూ మారాను. పాస్‌పోర్టు, వీసాల ఊసే లేకుండా- దేశదేశాలు చుట్టేస్తూ నా రూపాన్ని పదిరకాలుగా మార్చుకున్నా. సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయినట్లు మిమ్మల్నీ ఎత్తుకుపోదామనుకుంటుంటే- లాక్‌డౌన్‌, భౌతిక దూరాలు మిమ్మల్ని లక్ష్మణ రేఖల్లా కాపాడుతున్నాయి. మిమ్మల్ని గీత దాటించాలని అప్పుడప్పుడూ సంఖ్యను తగ్గిస్తూ... బంగారు లేడిలా ఏమారుస్తూనే ఉన్నా! అయినా మీరు నా వలకు చిక్కడం లేదు.

కానీ, మీలోనూ కొందరు నాకు వీరాభిమానులున్నారు! వాళ్లు మాత్రం మూతికి గుడ్డ కట్టరు. హస్తరేఖలు అరిగిపోయేలా ఇరుగుపొరుగూ చేతులు కడుగుతున్నా- వీళ్లకు ఒళ్లు బద్ధకం. భౌతికదూరానికి దూరంగా... మహమ్మారినైన నాకు దగ్గరగా వస్తుంటారు. వీళ్లే ‘కరోనా’భిలాషులు... నా ‘ఆశ’య సాధకులు!

ఇంకొందరు మాత్రం నా ఆయువుపట్టు పట్టి, నా ప్రాణం గుట్టు రట్టు చేసేందుకు నిద్రాహారాలు మాని ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు. ఒక్క చిట్టి చిలుకలో నా ప్రాణాన్ని పెట్టి- మీ చేతుల్లో పెట్టడానికి నేనేమైనా అమాయక మాయల ఫకీరునా? జగమొండి కరోనాను! అందుకే నా ప్రాణాన్ని నా అభిమానులందరిలో తలా కొంచెం దాస్తున్నా!

కొన్ని రోజులు కాగానే లాక్‌డౌన్‌ ఎత్తేస్తారు. ఎత్తీఎత్తివేయంగానే మిమ్మల్ని అమాంతం చుట్టేసుకుంటా. అయినా నా పిచ్చిగానీ మీరు అప్పుడు కూడా నా చేతికి చిక్కుతారా ఏమిటి? భౌతికదూరం, మూతికి మాస్కు, పవిత్ర జలాల్లా మీ దగ్గర కర శుభ్రకర కారకాలు ఉన్నంతవరకు నా ఆటలు మీ దగ్గర సాగవు. ఆ శానిటైజర్‌ను నా నెత్తిన జల్లి నన్ను నామరూపాల్లేకుండా చేస్తారు. ప్చ్‌... ఏం చేస్తాం... ఎన్నెన్నో అనుకుంటాం... అన్నీ అవుతాయా ఏమిటి?

- ఎం.డి.దస్తగిర్‌

ABOUT THE AUTHOR

...view details