తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అవినీతిని అంతమొందించే బాధ్యత ప్రధానిపైనే! - eenadu editorial page

స్వయం సమృద్ధ భారత్‌ లక్ష్యసాధనకు అవినీతి పెద్ద అవరోధంగా మారిందని ప్రధాని మోదీ ఆవేదన చెందారు. సర్వ శక్తులొడ్డి దానిపై పూర్తిస్థాయి యుద్ధం చేయాలని నిఘా వారోత్సవాల సందర్భంగా ఏర్పాటైన సదస్సులో ఉద్బోధించారు. అవినీతిపరుల పీచమణిచే సంస్థగా ఆవిర్భవించిన కేంద్ర నిఘా సంఘం ప్రభావశూన్యమైందని సుప్రీంకోర్టు అయిదేళ్ల క్రితమే చెప్పింది. ఎన్నికల్లో అక్రమ నగదు ప్రవాహం జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ దారుణ వ్యవస్థకు చికిత్స చేయాల్సిన బాధ్యత ప్రధాని మోదీపైనే ఉంది!

eenadu today editorial about corruption in india
అవినీతిని అంతమొందించే బాధ్యత ప్రధానిపైనే ఉంది!

By

Published : Oct 29, 2020, 7:56 AM IST

న ఖావూంగా- న ఖానే దూంగా (అవినీతి గడ్డి- నేను తినను, తిననివ్వను) అంటూ మోదీ ప్రధానమంత్రిత్వం చేపట్టిన కొత్తల్లో, 180 దేశాల అవినీతి సూచీలో ఇండియా స్థానం 85; అయిదేళ్ల తరవాత కూడా భారత్‌ 80వ స్థానంలో ఉండటమే నిర్వేదం రగిలిస్తోంది. స్వయం సమృద్ధ భారత్‌ లక్ష్యసాధనకు అవినీతి పెద్ద అవరోధంగా మారిందంటూ అన్ని శక్తులూ కూడదీసుకొని దానిపై పూర్తిస్థాయి యుద్ధం చేయాలని నిఘా వారోత్సవాల సందర్భంగా ఏర్పాటైన సదస్సులో ప్రధాని ఉద్బోధించారు.

సరైన శిక్షలు పడనందునే..

ఆర్థిక నేరాలు, మాదక ద్రవ్యాల సరఫరా, నకిలీ నగదు చలామణి, ఉగ్రవాద నిధులు వంటివన్నీ ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయన్న ప్రధాని విశ్లేషణలో ఏమాత్రం పొల్లు లేదు. రాజ్య వ్యవస్థకు అతిపెద్ద శత్రువైన అవినీతి కారణంగా అభివృద్ధి మందగించడంతోపాటు సామాజిక సమతౌల్యమూ నాశనమవుతుందన్న మోదీ- దేశానికి చెదపురుగులా దాపురించిన వారసత్వ అవినీతి ఎలా పెచ్చరిల్లుతోందో కూడా వివరించారు. అవినీతి కేసుల్లో సత్వరం సరైన శిక్షలు పడనందునే అక్రమార్కులకు పట్టపగ్గాలుండటం లేదన్నది పచ్చి నిజం. అన్ని రకాల అవినీతికీ తల్లివేరు రాజకీయ అవినీతేనన్నది నిష్ఠుర సత్యం.

అలా అయితే ఏం ప్రయోజనం..?

అవినీతిపరుల పీచమణిచే సంస్థగా ఆవిర్భవించిన కేంద్ర నిఘా సంఘం ప్రభావశూన్యమైందని, రాష్ట్రాల్లో సెంట్రల్‌ విజిలెన్స్‌ కార్యాలయాలు తపాలా పనికే పరిమితమవుతున్నాయని సుప్రీంకోర్టు అయిదేళ్ల క్రితమే తలంటేసింది. కాలం చెల్లిన చట్టాల రద్దు, అనుమతి నిబంధనల సరళీకరణ, ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటలీకరణ వంటివి మెచ్చదగిన నిర్ణయాలే అయినా- రాజకీయ అవినీతి కశ్మలాన్ని, ఎన్నికల్లో అక్రమ నగదు ప్రవాహాల్ని ప్రక్షాళించకుంటే ప్రయోజనం ఏముంది? ఆవు (నేతాగణం) చేలో మేస్తుంటే, దూడ (బ్యూరోక్రసీ) గట్టున ఎందుకు మేస్తుంది?

అపారదర్శకతే..
ఎన్నికల్లో నల్లధనం స్వేచ్ఛగా ప్రవహించే దేశాల్లోను, సంపన్నుల మాటే చెల్లుబాటయ్యే ప్రభుత్వాలున్న చోట్లా అవినీతి అష్టపాదిలా విస్తరిస్తోందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ మొన్న జనవరిలో స్పష్టీకరించింది. ఇండియా ఆస్ట్రేలియాలు అవినీతిపై అదుపు సాధించలేకపోవడానికి రాజకీయ నిధుల సేకరణలో అపారదర్శకతే కారణమనీ విశ్లేషించింది. దిగువ మధ్యాదాయ దేశమైన ఇండియాలోని పార్టీలు ఎన్నికల వ్యయానికి సంబంధించి అగ్రరాజ్యం అమెరికాతో పోటీపడుతున్న తీరులోనే అవినీతి మూలాలు దాగున్నాయి. రాజకీయ పార్టీల నిధుల్లో పారదర్శకతకు ప్రోది చేస్తున్నామంటూ ఎన్‌డీఏ సర్కారు తెచ్చిన ఎన్నికల బాండ్లు ప్రవచిత లక్ష్యానికే తూట్లు పొడిచాయి.

సింగపూర్​ సిగలో..

అవినీతిని మట్టగించాలన్న గట్టి సంకల్పంతో చేపట్టే కార్యాచరణ ఎంత పటిష్ఠంగా ఉండాలో సింగపూర్‌ సోదాహరణంగా చాటుతోంది. అవినీతి రహిత సింగపూర్‌ను స్వప్నించిన లీ క్వాన్‌ యూ తెచ్చిన రెండు చట్టాలు- నీతి తప్పితే నిలువునా మునుగుతామన్న భీతిని సువ్యవస్థితం చేశాయి. కాబట్టే నేడు అత్యంత నీతివంత దేశాల్లో ఒకటిగా, తలసరి ఆదాయాల్లో మేటిగా సింగపూర్‌ రాణిస్తోంది. అందుకు పూర్తి భిన్నంగా తక్కువ రిస్కుతో అధిక రాబడి మార్గంగా అవినీతి ఇండియాలో ప్రవర్ధమానమవుతోంది. రాజకీయ బాసుల కనుసన్నల్లో మసలుతూ నిఘా దర్యాప్తు సంస్థలు నామమాత్రావశిష్టమై పోవడమూ అవినీతిపరులకు కోరలూ కొమ్ములూ మొలిపిస్తోంది. ప్రజా ప్రయోజనాలు, సేవలతో ముడివడిన సమస్త విభాగాలూ అవినీతి అడుసులో ఈదులాడుతున్నట్లు ఏటికేడు రుజువవుతూనే ఉంది.

నీతి తప్పిన రాజకీయం అవినీతికి ఆలంబనగా మారుతుంటే, ‘క్విడ్‌ ప్రో కో’లతో కొల్లగొట్టిన డబ్బులే పెట్టుబడిగా ఎన్నికల రంగాన్ని దున్నేసి, అధికార సోపానాలు అధిరోహించే అక్రమార్కులతో ప్రజాస్వామ్యం పుచ్చిపోయింది. ఈ దారుణ అవ్యవస్థకు గరళవైద్యం చేసి, దేశాన్ని గాడిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత ప్రధాని మోదీపైనే ఉంది!

ఇదీ చూడండి:అవినీతి కేసుల్లో జాప్యం.. కుంభకోణాలకు పునాదే

ABOUT THE AUTHOR

...view details