బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతి బిడ్డ జన్మహక్కు. ఈ హక్కును భారతీయ సమాజంలో బాలురతో సమానంగా బాలికలు పొందలేకపోతున్నారు. ఆడపిల్లను అనేక సామాజిక కట్టుబాట్ల మధ్య బంధించడంతోపాటు లింగ విచక్షణ, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, భ్రూణ హత్యలు, హింస, వరకట్న సమస్య, పేదరికం, రక్తహీనత, పోషకాహార లోపం తదితర అంశాలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఫలితంగా ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత సాధించిన తరవాత 30 శాతం, పదో తరగతి తరవాత 57 శాతం బాలికలు బడి మానేస్తున్నట్లు కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. ఈ సంఖ్య కరోనా వల్ల మరింత పెరిగినట్లు అధ్యయనాలు ధ్రువీకరిస్తున్నాయి.
ఆన్‌లైన్ విద్య అందకుండా..
కరోనా మహమ్మారి కారణంగా బడులు మూతపడటంతో చేపట్టిన 'ఆన్‌లైన్ విద్య' ప్రభావం బాలురతో పోలిస్తే బాలికలపై తీవ్రంగా పడి, డిజిటల్ అంతరాలకు దారి తీసింది. ఇంట్లో చదువు కోసం స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ వంటి ఉపకరణాలను ఇవ్వడంలో బాలికల కంటే అబ్బాయిలకే ప్రాధాన్యమిచ్చారు. గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన ఒక విద్యా సంబంధ సర్వేలో కోటి మంది బాలికలు బడి మానేసే అవకాశం ఉందని వెల్లడైంది. 37 శాతం అబ్బాయిలతో పోలిస్తే కేవలం 26 శాతం బాలికలే ఆన్‌లైన్ అధ్యయనాల కోసం స్మార్ట్‌ఫోన్లు, అంతర్జాల సదుపాయాన్ని కలిగి ఉన్నారని, 71 శాతం బాలికలు ఇంట్లో, ఆన్‌లైన్ తరగతుల సమయంలో కూడా ఇంటి పని చేయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయగా, ఇది కేవలం 38 శాతం బాలురపై మాత్రమే ఉందని సర్వే పేర్కొంది. మరోవైపు కుటుంబ పరిస్థితులు దిగజారడం వల్ల బాలికలు బాలకార్మికులుగా మారడం సహా బాల్య వివాహాలూ పెరిగాయి. అంతిమంగా బాలికల భద్రత, సంరక్షణ మరింత ప్రశ్నార్థకంగా మారాయి.
ఈ ఏడాది కేటాయింపులేం లేవు..
ఇలాంటి పరిస్థితుల్లో బాలికల విద్యా వికాసానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని విద్యావేత్తలు అభిలషించినా, వాస్తవిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. లింగపరమైన దుర్విచక్షణను తొలగిస్తూ బాలికల నిష్పత్తిని పెంచేందుకు తోడ్పడే 'బేటీ బచావో, బేటీ పడావో' పథకం- బాలికలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, ఉన్నత విద్యాభ్యాసానికి చేయూతనిస్తుంది. ఇందులో ఇప్పటికే పలు ఇతర పథకాలను విలీనం చేశారు. ఈ పథకానికి ప్రతి ఏటా బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఉండేవి. ఈ ఏడాది ఎలాంటి కేటాయింపులూ లేకపోవడం గమనార్హం. దీనికి బదులుగా, 'ప్రధానమంత్రి మాతృ వందన', 'మహిళాశక్తి కేంద్ర పరిశోధన' వంటి ఇతర పథకాలతో పాటు 'బేటీ బచావో- బేటీ పడావో'ను 'సమర్త్య యోజన' కింద కలిపి, ఉమ్మడిగా రూ.2,522 కోట్లు కేటాయించారు. ఈ నాలుగు పథకాలకు వేర్వేరుగా కేటాయింపులుంటే నిధులు పెరిగేవని ఆర్థికవేత్తల అభిప్రాయం.
బడ్జెట్లో కోతలు..