తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భూతాపాన్ని కట్టడి చేస్తేనే భవిత! - environmental pollution in india

భీకర తుపానులు, వరదలు, ఆకస్మికంగా కురుస్తున్న కుండపోత వర్షాలు, గణనీయంగా పడిపోతున్న, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, చలిగాలులు, వడగాలులు పెరుగుతున్న భూతాపానికి నిదర్శనం. సుస్థిరాభివృద్ధితోపాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే శిలాజ ఇంధన వినియోగం తగ్గాలి. ప్రమాదపుటంచుల్లో ఉన్న పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే వాతావరణంలో సంభవిస్తున్న పెనుమార్పులకు మూలకారణమైన భూతాపాన్ని కట్టడి చేయాల్సిందే!

weather pollution in india
భూతాపాన్ని కట్టడి చేస్తేనే భవిత!

By

Published : Mar 8, 2021, 7:24 AM IST

ఉత్తర భారతంలో వేగంగా కరుగుతున్న మంచు తాకిడికి హిమానీ నదాలు పొంగిపొర్లి భీభత్సం సృష్టించిన పరిస్థితి- వాతావరణంలోని అనూహ్య మార్పులకు అద్దం పట్టింది. ప్రమాదపుటంచుల్లో ఉన్న పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే వాతావరణంలో సంభవిస్తున్న పెనుమార్పులకు మూలకారణమైన భూతాపాన్ని కట్టడి చేయాల్సిందే! ఆ దిశగా కీలకమైన ప్యారిస్‌ ఒప్పందం అమలులో ప్రపంచదేశాల మధ్య సమన్వయం కొరవడింది. ట్రంప్‌ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం ప్యారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు గతంలో ప్రకటించడంతో ప్రతిష్టంభన నెలకొంది. అగ్రరాజ్యంలో ప్రభుత్వం మారి బైడెన్‌ రావడంతో- ప్యారిస్‌ ఒప్పందం అమలుపై మళ్లీ ఆశలు చిగురించాయి.

మూడో స్థానంలో భారత్‌..
భారత్‌లో శిలాజ ఇంధన వినియోగం కారణంగా వెలువడుతున్న కాలుష్యంవల్ల ఏటా పదిలక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, 9.80లక్షల మంది శిశువులు నెలలు నిండకుండానే జన్మిస్తున్నారని- నిరుడు విడుదలైన గ్రీన్‌పీస్‌ ఆగ్నేయాసియా అధ్యయనం వెల్లడించింది. కర్బన ఉద్గారాల మూలంగా ఉత్పన్నమవుతున్న వాయుకాలుష్యం వల్ల భారీగా నష్టపోతున్న దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో ఉంది. భారత్‌లో విస్తరిస్తున్న వాయుకాలుష్యంవల్ల ఏటా వాటిల్లుతున్న నష్టం స్థూల దేశీయోత్పత్తిలో 5.4 శాతానికి సమానం. దేశంలో ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వాయుకాలుష్యంవల్లేనని భారత వైద్య పరిశోధన మండలి గతంలోనే వెల్లడించింది.

అసమానతలకు ఆజ్యం

మనం పీల్చే గాలిలో నాణ్యత ప్రమాణాలు దిగజారిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ వాయు నాణ్యత సూచీలోని 180 దేశాల జాబితాలో భారత్‌ అట్టడుగున ఉంది. మరోవంక ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య పూరిత నగరాల్లో భారత్‌లోనే 15నగరాలు ఉన్నాయి. మోటారు వాహనాలు, పారిశ్రామికవాడల నుంచి వెలువడుతున్న ఉద్గారాలు వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. గడచిన యాభయ్యేళ్లుగా పెరుగుతున్న భూతాపం దేశాల మధ్య అసమానతలకు ఆజ్యం పోస్తోంది. భీకర తుపానులు, వరదలు, ఆకస్మికంగా కురుస్తున్న కుండపోత వర్షాలు; గణనీయంగా పడిపోతున్న, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు; చలిగాలులు, వడగాలులు పెరుగుతున్న భూతాపానికి నిదర్శనం. సుస్థిరాభివృద్ధితోపాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే శిలాజ ఇంధన వినియోగం తగ్గాలి.

కట్టడి చేసే దిశగా..

ప్రపంచ దేశాల సంగతి ఎలా ఉన్నా ప్యారిస్‌ ఒప్పందం మేరకు భూతాపాన్ని కట్టడి చేసే కార్యాచరణను ఈ ఏడాదినుంచే అమలు చేయాలన్న కృతనిశ్చయంతో భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. పదిలక్షలకు మించిన జనాభా ఉన్న పట్టణాలు వాయుకాలుష్యాన్ని కట్టడి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన గాలిని అందించేందుకు గట్టి ప్రణాళికలు రూపొందించుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఆ మేరకు రాష్ట్రాలను ప్రోత్సహించి వాటికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించడం పర్యావరణ పరిరక్షణ దిశగా కీలకమైన ముందడుగు! ఆ మేరకు విధివిధానాలు, ప్రమాణాల రూపకల్పన బాధ్యతను పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల విభాగానికి కేంద్రం అప్పగించింది.

వ్యవసాయ రంగంలో..

ప్యారిస్‌ ఒప్పందం కార్యాచరణలో భాగంగా కర్బన ఉద్గారాల నియంత్రణకు అనుకూలించని, పాతబడిన థర్మల్‌ విద్యుచ్ఛక్తి కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించడం ప్రశంసనీయం. దేశ జనాభాలో 70 శాతానికిపైగా ప్రజలకు ఊతమందిస్తున్న వ్యవసాయరంగంలో శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించి, రైతాంగాన్ని సౌరవిద్యుత్తువైపు ప్రోత్సహించేందుకు ప్రారంభించిన 'ప్రధానమంత్రి కుసుమ్‌' పథకాన్ని దేశమంతటా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 35 లక్షల సోలార్‌ పంపుసెట్లను అమర్చుకునేందుకు రైతులు సంసిద్ధత వ్యక్తం చేయడం పర్యావరణ పరిరక్షణ చైతన్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. నిరుపయోగ భూముల్లో సౌర విద్యుత్తు కేంద్రాలు ఏర్పాటు చేసుకుని, ఉత్పత్తయిన సౌర విద్యుత్తును పవర్‌గ్రిడ్‌తో అనుసంధానించేందుకు ముందుకు వచ్చే రైతాంగానికి ప్రోత్సాహం, సబ్సిడీ కల్పిస్తే కొంతలో కొంతైనా కర్బన ఇంధన ఉద్గారాలకు ముకుతాడు వేయవచ్చు.

తు.చ. తప్పకుండా..

వాయుకాలుష్యం కట్టడికి 'నీతి ఆయోగ్‌' రూపొందించిన అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను క్షేత్రస్థాయిలో తు.చ. తప్పకుండా అమలు చేయాలి. కాలుష్యకారక వాహనాలు, పరిశ్రమలపై భారీ జరిమానాలు విధించాలి. కార్చిచ్చు-దావానలం బారినపడకుండా అటవీ ప్రాంతాల పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సౌర విద్యుత్తు, విద్యుత్‌ వాహనాల తయారీ రంగంలో భారీ పెట్టుబడుల కల్పనకు ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించాలి. ఈ చర్యల ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించి భూతాపానికి ముకుతాడు వేయవచ్చు. అత్యుత్తమ ప్రజారవాణా వ్యవస్థలున్న బెర్లిన్‌, షాంఘై, లండన్‌, ప్యారిస్‌, మాడ్రిడ్‌, సియోల్‌ల స్ఫూర్తి- భారత్‌లోనూ వెల్లివిరియాల్సిన అవసరం ఉంది. మితిమీరుతున్న కర్బన ఉద్గారాలు, వాయుకాలుష్యాన్ని కట్టడి చేయకపోతే భూమి మీద జీవరాశుల్లో అయిదో వంతు జీవుల మనుగడకు ముప్పు పొంచి ఉంది.

-డాక్టర్‌ జీవీఎల్‌ విజయ్‌కుమార్‌, భూ విజ్ఞానశాస్త్ర నిపుణులు

ఇదీ చూడండి:కాలుష్యానికి కోరలు- జాతికి వాయుగండం!

ABOUT THE AUTHOR

...view details