వంటనూనె ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నూనెల కోసం దిగుమతులపై ఆధారపడటమే ఈ పరిస్థితికి కారణం. ఆర్నెల్లలో అంతర్జాతీయ విపణిలో ముడి పామాయిల్ ధరలు 50శాతం పెరిగాయి. దేశంలో ఏటా వినియోగించే 2.30 కోట్ల టన్నుల నూనెల్లో 1.50 కోట్ల టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. వంట నూనెల కోసం ఏటా రూ.74 వేల కోట్లు విదేశాలకు చెల్లిస్తున్నాం. డెబ్బయ్యో దశకం నుంచి దిగుమతులపైనే ఆధారపడుతూ వస్తున్నాం. గడచిన దశాబ్ద కాలంలో ఒక్క పామాయిల్ దిగుమతే 8.40శాతం పెరిగింది. మన కన్నా చిన్న దేశాలు, సాగు వాతావరణం దృష్ట్యా మనకన్నా మెరుగ్గా లేని దేశాల నుంచి నూనెలు, వాటి ఉత్పత్తులను దిగుమతి చేసుకొవాల్సి వస్తోంది. ఇకనైనా మన ప్రభుత్వాలు తగిన కార్యాచరణతో వ్యవసాయ రంగాన్ని ఆ పంటల వైపు తీసుకెళ్లాల్సి ఉంది.
దిగుమతి సుంకాలు ఎక్కువే..
కరోనా వైరస్ వ్యాప్తి క్రమంలో పంట చేతికొచ్చేనాటికి కార్మికులు అందుబాటులో లేక నూనె ధరలు పెరిగాయి. వేరుసెనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామాయిల్ ధరల్లో గతేడాదితో పోలిస్తే 25 నుంచి 35 శాతం పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా ఆహారం, సౌందర్య లేపనాలు, బయోగ్యాస్ వంటి తయారీలో ఎక్కువగా వాడే పామాయిల్‌ను 90శాతం ఇండొనేసియా, మలేసియా దేశాలే ప్రపంచానికి అందిస్తున్నాయి. ఈ దేశాల ఎగుమతులపైనే భారత్, చైనా ఎక్కువగా ఆధారపడ్డాయి. దేశ అవసరాలు తీర్చే ముడి, శుద్ధ పామాయిల్‌పై 37.5 శాతం నుంచి 45శాతం దాకా దిగుమతి సుంకం విధిస్తున్నారు. పొద్దుతిరుగుడు నూనెపై 35శాతం చెల్లించాల్సి వస్తోంది. దిగుమతి సుంకం తగ్గితే ప్రస్తుత ధరల నుంచి సామాన్యుడికి భారీ ఊరట లభిస్తుంది.
దేశీయంగా తక్కువే..
దేశంలో పాతికేళ్లుగా నూనెగింజల పంటల విస్తీర్ణం ఏ మాత్రం పెరగలేదు. అయినా కొంతమేర ఉత్పత్తి పెరిగిందంటే- అదంతా అన్నదాతల చలవే. పంటల సాగులో వస్తున్న మార్పుల వల్ల దిగుబడులు పెరిగినా, ప్రపంచ సగటుతో పోలిస్తే దేశీయంగా తక్కువే. మన దేశంలో హెక్టారు భూమిలో 1.13 టన్నుల సోయాబీన్ పంట ఉత్పత్తి అవుతోంది. ప్రపంచ సగటు 2.41 టన్నులు. బ్రెజిల్ 2.81 టన్నుల దిగుబడి సాధిస్తోంది. మనవద్ద వేరుసెనగ హెక్టారుకు 1.21 టన్నులమేర పండుతుండగా, అమెరికా రైతులు ఏకంగా 3.80 టన్నులు సాధిస్తున్నారు. అన్ని నూనెగింజల ఉత్పత్తిలోనూ ప్రపంచ సగటుతో పోలిస్తే మనం చాలా వెనకంజలో ఉన్నాం. దేశంలో సోయాబీన్ వార్షిక దిగుబడి కోటి టన్నులు దాటినా పొద్దుతిరుగుడులో కనీసం పది లక్షల టన్నుల వార్షిక దిగుబడిని సాధించలేకపోయాం. మధ్యప్రదేశ్ (27శాతం), రాజస్థాన్(20శాతం), మహారాష్ట్ర (16), గుజరాత్ (15) రాష్ట్రాలే దేశంలోని మొత్తం ఉత్పత్తిలో 78శాతం పండిస్తున్నాయి.
ఆధునిక సేద్యపద్ధతులే ఆలంబన..