స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్న భారతీయ మహిళలు సహజంగానే ఈ దేశ రాజకీయ స్రవంతిలో మొదటి నుంచీ అంతర్భాగంగా ఉన్నారు. చాలా దేశాల్లో మహిళలు సుదీర్ఘ ఉద్యమాలు నడిపి కానీ ఓటు హక్కు సాధించుకోలేకపోయారు. భారతదేశంలో తొలి ఎన్నికల నుంచే మహిళలు ఓటుహక్కు వినియోగించుకొంటున్నారు. అలాగని భారతీయ మహిళ స్థితిగతులు దివ్యంగా ఉన్నాయని చెప్పలేం. వారి ఎదుగుదలకు అన్ని రంగాల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయి. పని, వేతనాలు మొదలుకొని వారసత్వ హక్కుల వరకు అంతటా దుర్విచక్షణను ఎదుర్కొంటున్నారు.
దీన్ని సరిదిద్ది మహిళలకు సాధికారత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం 1990లోనే జాతీయ మహిళా సంఘం (ఎన్‌సీడబ్ల్యూ) చట్టాన్ని తీసుకొచ్చినా 1992 జనవరి 31న కమిషన్‌ను చట్టబద్ధ సంస్థగా నెలకొల్పింది. రాజ్యాంగం, వివిధ చట్టాలు మహిళలకు కల్పించిన హక్కులను సంరక్షించడం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి పరిష్కారాలు ప్రతిపాదించడం ఈ సంస్థ బాధ్యతలు. మహిళల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షించి, తదుపరి కార్యాచరణను సిఫార్సు చేయడం, మహిళా హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయం కోసం పోరాడటమూ సంస్థ కార్యకలాపాల్లో భాగమే. అధ్యక్షులు, కార్యదర్శి, అయిదుగురు సభ్యులతో ఎన్‌సీడబ్ల్యూ ఏర్పడింది.
పిలిచి విచారించే అధికారం...
ఒక దావాను విచారించే సివిల్ కోర్టుకు ఉండే అధికారాలన్నీ ఎన్‌సీడబ్ల్యూకు ఉంటాయి. దేశంలో ఏ రంగంలోని వ్యక్తినైనా పిలిచి విచారించడం, సంబంధిత పత్రాలను సమర్పించాల్సిందిగా ఆదేశించడం, అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాలు సేకరించడం, ఏ కోర్టు లేక ఏ ప్రభుత్వ కార్యాలయం నుంచైనా సాధికార రికార్డులను కోరడం, సాక్షులను రప్పించి విచారించడం వంటి అధికారాలు ఎన్‌సీడబ్ల్యూకు ఉన్నాయి. అంతేకాకుండా, మహిళలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు లేక విధానాలను రూపొందించే ముందు కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీడబ్ల్యూని సంప్రదించాల్సి ఉంటుంది. ఇన్ని అధికారాలున్న ఎన్‌సీడబ్ల్యూ గడచిన మూడు దశాబ్దాల్లో మహిళాజనోద్ధరణలో అనితర సాధ్యమైన విజయాలను నమోదు చేసి ఉండాల్సింది. మహిళల స్థితిగతులు ఈపాటికి అద్భుతంగా మెరుగుపడి ఉండాలి. కానీ, వాస్తవంలో అలా జరిగిన దాఖలా లేదు.
సాటి ఆసియా దేశాల్లో ఇంతగా లేదు..
స్త్రీలపై మానభంగాలు పెచ్చరిల్లాయి. ఎన్నోచోట్ల మహిళలు వేధింపులకు గురవుతున్నారు. పిల్లలు, ముఖ్యంగా మగ పిల్లలను కనలేని వనితల స్థితి దుర్భరంగా ఉంటోంది. ఆస్తిలో వాటా కోరే మహిళలను అణగదొక్కడం సర్వసాధారణమైపోయింది. అభివృద్ధి సూచికల్లో మహిళలు అట్టడుగున ఉన్నారు. భారత్‌లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మంది స్త్రీలే ఉన్నారని 2011 జనగణన తేల్చింది. సాటి ఆసియా దేశాల్లోనూ ఇంతటి అధ్వాన లింగనిష్పత్తి లేదు. 2014-15లో ప్రాథమిక తరగతుల్లో ప్రతి 100 మంది బాలురకు 93 మంది బాలికలే ఉన్నారు. మాధ్యమిక తరగతుల్లో 95 మంది, సెకండరీ తరగతుల్లో 91 మంది, సీనియర్ సెకండరీ తరగతుల్లో 90 మంది బాలికలే ఉన్నారు.
కీలకమైన మార్పులు అవసరం
2011లో అఖిల భారత స్థాయిలో కార్మిక భాగస్వామ్య రేటు పురుషులకు 53.26 శాతమైతే, స్త్రీలకు కేవలం 25.51శాతం. భారతీయ పురుషులకన్నా స్త్రీలు 19శాతం తక్కువ సంపాదిస్తున్నారు. పురుషుడు సగటున రోజుకు రూ.242.49 సంపాదిస్తుంటే, స్త్రీ సంపాదన కేవలం రూ.196.30 మాత్రమే. 2014 సార్వత్రిక ఎన్నికల తరవాత లోక్‌సభ సభ్యుల్లో మహిళలు 12శాతం (64మంది) మాత్రమే. 75 మంది సభ్యుల కేంద్ర మంత్రిమండలిలో మహిళలు (12 శాతం) తొమ్మిది మందే. ఈ పరిస్థితిని మార్చడం ఒక్క ఎన్‌సీడబ్ల్యూతోనే సాధ్యపడుతుందని భావించలేం. ఈ సంఘానికి అప్పగించిన బృహత్తర విధులు నెరవేరాలంటే ఎన్‌సీడబ్ల్యూ నిర్మాణం, పనివిధానాల్లో లొసుగులను తొలగించడానికి కీలకమైన మార్పులు తీసుకురావలసి ఉంటుంది.
ఆ స్వేచ్ఛ ఎన్‌సీడబ్ల్యూకి లేదు..