'ప్రకృతి సమస్యల పరిష్కారంలో మేము భాగస్వాములం' అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్యసమితి నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అలాగే, 'ప్రకృతితో సామరస్యంగా జీవించు' అంటూ జీవవైవిధ్య పరిరక్షణకు దశాబ్ద ప్రణాళికను అమలు చేస్తోంది. అడవుల దహనం, జనాభా పెరుగుదల, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, ఇష్టారాజ్యంగా పరిశ్రమల ఏర్పాటు, యథేచ్ఛగా గనుల తవ్వకాలు, నగరీకరణ, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం, వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం తదితరాలు జీవవైవిధ్యానికి చేటుచేస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా రోజుకు సగటున 200 జీవులు అంతరిస్తున్నట్లు అంచనా! అతిపెద్ద సముద్ర జీవుల్లో ఒకటైన వేల్ షార్క్ (తిమింగలం) వంటివి ఎన్నో అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి చేరుతున్నాయి. పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించి, సత్వరం జీవవైవిధ్యాన్ని కాపాడుకోకపోతే 2050 నాటికి ఊహకందని విపరీత పరిణామాలెన్నో చోటుచేసుకుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అమెరికా కలిసివచ్చేనా?
జీవుల మద్య భేదాన్నే జీవవైవిధ్యం అంటారు. ప్రకృతి ఈ సమతౌల్యాన్ని కోల్పోతే జంతువులు, పక్షుల నుంచి మనుషులకు సోకే రోగాలు పెచ్చుమీరుతాయి. మృత కళేబరాలను తినే రాబందు జాతి దాదాపు అంతరించిపోయింది. దానితో చనిపోయిన జంతువుల శరీరాలు కుళ్లిపోయి సూక్ష్మజీవులు విస్తరించి రోగాలు ప్రజ్వరిల్లుతున్నాయి. లక్షల కొలదీ ఉన్న జీవరాశుల్లో ఏ ఒక్క జీవజాతి అంతరించినా దాని ప్రభావం మానవ మనుగడమీద పడుతుంది. 'తేనెటీగల సంతతి అంతరించిపోతే నాలుగేళ్లకు మానవజాతి కనుమరుగవుతుంది' అన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావనార్హం. అందుకే భవిష్యత్తు తరాలకు జీవవైవిధ్యమే వెలకట్టలేని ఆస్తి అని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది.
ఆ సదస్సు ఆన్‌లైన్ వేదికగా..
196 దేశాలు భాగస్వామ్య పక్షాలైన అంతర్జాతీయ జీవ వైవిధ్య ఒడంబడికకు (యూఎన్‌సీబీడీ) అనుగుణంగా జీవవైవిధ్య పరిరక్షణకు ఐరాస కృషిచేస్తోంది. ప్రతీ రెండేళ్లకోసారి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ) నిర్వహించే సదస్సులో సాధించిన ప్రగతిని చర్చించి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తోంది. సీఓపీ-11 సదస్సుకు 2012లో హైదరాబాద్ ఆతిథ్యమిచ్చింది. సీఓపీ-15 వచ్చే అక్టోబరులో చైనాలోని కున్మింగ్ నగరంలో జరగాల్సి ఉంది. కరోనాతో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ సదస్సు ఆన్‌లైన్ వేదికగా జరిగే అవకాశముంది. మరోవైపు, అనేక విషయాల్లో ప్రపంచ పెద్దన్నగా వ్యవహరించే అమెరికా అంతర్జాతీయ జీవ వైవిధ్య ఒడంబడికలో ఇప్పటికీ చేరకపోవడం గమనార్హం. మానవాళికి చేటుచేసే ఆయుధాల వ్యాపారంలో ముందుండే అగ్రరాజ్యం యూఎన్‌సీబీడీని మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. బైడెన్ అధ్యక్షులయ్యాక అమెరికా తీరు కాస్త మారినట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో యూఎన్‌సీబీడీలోనూ అమెరికా చేరి, జీవవైవిధ్య పరిరక్షణకు ఆర్థికంగా చేయూతనిస్తుందని ప్రపంచదేశాలు ఆశిస్తున్నాయి.