ఏడాదిన్నర కాలంగా ప్రపంచంపై కరోనా సాగిస్తున్న భీకరదాడిలో ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. భారత్‌లో నిరుపేదల పరిస్థితి దారుణంగా తయారయింది. ఆకలి రక్కసి కోరలు సాచి విజృంభిస్తోంది. దొరికిన పని చేసుకుని వచ్చినదానితో కలోగంజో తాగుతూ కడుపు నింపుకొంటున్న వారిని పోషకాహార లోపం కొవిడ్ కోరల్లోకి నెట్టేస్తోంది. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు విధిస్తున్న ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఆహార సంక్షోభం పేద, దిగువ మధ్యతరగతిపై పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కరోనా సంక్షోభం కోట్లమందిని ఆకలితో అలమటించేలా చేస్తోంది. ప్రభుత్వాలు- పౌర సమాజాల భాగస్వామ్యం, పటిష్ఠ వ్యూహం అమలుతోనే క్షుద్బాధ నుంచి అభాగ్యులను గట్టెక్కించగలమనే అవగాహనను పెంచడానికి ఏటా మే 28న 'వరల్డ్ హంగర్ డే' నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
పెరుగుతున్న పేదరికం
కరోనా మహమ్మారి రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పొట్టగొట్టింది. తొలిదశ లాక్‌డౌన్‌లో ఉపాధి లేక లక్షలమంది వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. పర్యాటక, ఆతిథ్య రంగాలు పడకేశాయి. తొలి దశ కరోనా, లాక్‌డౌన్ ప్రభావంతో గతేడాది దేశంలో పేదల సంఖ్య 7.5 కోట్లు పెరిగి మొత్తం 13.5 కోట్లకు చేరిందని, వీరి రోజువారీ సంపాదన 150 రూపాయల్లోపేనని అమెరికాకు చెందిన 'ప్యూ' పరిశోధన సంస్థ లెక్కగట్టింది. రెండోదశ పాక్షిక లాక్‌డౌన్లు, కర్ఫ్యూలతో పేదరికం మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో హోటళ్ల రోజువారీ వ్యాపారం రూ.50 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పడిపోవడం ఇందుకో ఉదాహరణ. ఏ రాష్ట్రంలోనూ పూర్తిస్థాయి వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు నాలుగైదు గంటలకు మించి సాగడం లేదు. దీంతో అత్యధికులకు అరకొర వేతనాలే అందుతున్నాయి.
సర్వోన్నత న్యాయస్థానం కలగజేసుకుని..
కరోనా రెండోదశ మొదలయ్యాక దేశంలో 23 కోట్ల మంది రోజువారీ సంపాదన కనీస వేతనం (రూ.375) కంటే తక్కువకు పడిపోయిందని అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం సర్వే తేల్చిచెప్పింది. వలస కార్మికులు, రోజుకూలీలు పని లేక పస్తులుండాల్సిన పరిస్థితి తలెత్తింది. పాక్షిక లాక్‌డౌన్ పేరిట ప్రభుత్వాలూ పట్టించుకోకపోవడంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతోంది. నిరుడు వలస కార్మికులు, పేదల కోసం అదనపు రేషన్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈసారి చేతులెత్తేసింది. ఎఫ్‌సీఐ గోదాముల్లో 7.70 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఉన్నాయని, ఏప్రిల్ నెల అవసరాల కంటే మూడున్నర రెట్ల ఎక్కువ తిండిగింజలతో ప్రభుత్వ గాదెలు కళకళలాడుతున్నాయని ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులు ఇటీవల వెల్లడించారు. ఇంత సమృద్ధిగా తిండి గింజలున్నా ప్రభుత్వం తాము అదనపు రేషన్ ఇవ్వబోమని చెప్పడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కలగజేసుకుని వలస కార్మికులకు రేషన్ కార్డు లేకపోయినా ఆహార ధాన్యాలు ఇవ్వాలని, వారి కోసం కమ్యూనిటీ కిచెన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 2020 మార్చి నుంచి జూన్ వరకు ఆహారధాన్యాల ఉత్పత్తుల ఎగుమతులు 23 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు ఎఫ్‌సీఐ గోదాముల్లో తిండిగింజలు ఇప్పటికే లెక్కకు మిక్కిలిగా పోగుపడ్డాయి. వాటి పంపిణీలో అసమానతలు... కోట్ల మంది ప్రజలను పట్టెడన్నం కోసం అర్థించే నిస్సహాయ స్థితిలోకి నెడుతున్నాయి. ప్రపంచ ఆకలి సూచి (గ్లోబల్ హంగర్ ఇండెక్స్ - జీహెచ్‌ఐ) 2019 ప్రకారం 117 దేశాల్లో మన ర్యాంకు 102. 2020లో 107 దేశాల్లో భారత్ స్థానం 94. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ కంటే మనం వెనకబడి ఉండటం సంక్షేమ పథకాల డొల్లతనాన్ని కళ్లకు కడుతోంది.