సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సంవత్సరం బడ్జెట్లో రక్షణ వ్యయానికి పెద్దపీట వేయక తప్పదన్నదే అందరి అభిప్రాయం. భారత్ నేడు కాచుకోవలసినది ఒక్క శత్రువును కాదు. ఏక కాలంలో ఇద్దరిని ఎదుర్కోవలసి రావచ్చు. ఒకవైపు పాకిస్థాన్ ఎప్పటిలాగే వంకర బుద్ధి ప్రదర్శిస్తూ ఉగ్రవాదులను మనపైకి ఎగదోస్తోంది. ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నా సరిహద్దుల్లో గోతులు (సొరంగాలు) తవ్వే బుద్ధి మానడం లేదు. మరోవైపు కయ్యాలమారి చైనా మన తూర్పు సరిహద్దుల్లో చీటికిమాటికి అతిక్రమణలకు దిగుతోంది. దీంతో భారత్ ఏకకాలంలో పాక్, చైనాలను ఢీకొనడానికి సిద్ధంగా ఉండక తప్పడం లేదు. ఇందుకు భారీగానే వ్యయం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఏటి బడ్జెట్లో రక్షణ కేటాయింపులు పెంచుతారన్న అంచనాలు జోరుగా వినిపిస్తున్నాయి.
తగ్గుతున్న వాటా..
ఇటీవలి సంవత్సరాల్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రక్షణ వాటా నిజ విలువ తగ్గిపోతూ వస్తోంది. పేరుకు బడ్జెట్ కేటాయింపులు పెరుగుతున్నట్లు కనిపించినా ద్రవ్యోల్బణం వల్ల వాటి నిజవిలువ క్షీణిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రక్షణకు ఎక్కువ నిధులు కేటాయించడం ద్వారా ద్రవ్యోల్బణం తాకిడిని అధిగమించాలని నిపుణులు సూచించారు. అది సరైన సలహాయే కానీ కొవిడ్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుదించుకుపోయిన దశలో అదెంత వరకు ఆచరణ సాధ్యమన్నది ప్రశ్న.
సమతౌల్య పరచాలి..
2020వ సంవత్సర బడ్జెట్లో రక్షణ కేటాయింపులను అంతకుముందు సంవత్సరంకన్నా ఆరు శాతం పెంచి రూ.4.71 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. 2021లో కూడా కేటాయింపులు పెరగవచ్చు కానీ, ఆ పెరుగుదలకు కొవిడ్ పగ్గాలు వేస్తుందనడంలో సందేహం లేదు. రక్షణ బడ్జెట్లో రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి- మూలధన వ్యయం. రెండు- రెవెన్యూ వ్యయం. కొత్త ఆయుధాల కొనుగోలు, వాటిని స్వదేశంలోనే ఆధునికీకరణ ద్వారా ఉత్పత్తి చేయడం, రక్షణ పరిశోధన-అభివృద్ధికి హెచ్చు నిధులు కేటాయించడం మూలధన వ్యయం కిందకు వస్తాయి. సైనిక సిబ్బంది, సామగ్రి వినియోగం, జీతాలు, పింఛన్లు, సంస్థాగత నిర్వహణ ఖర్చుల చెల్లింపు, బట్వాడా ఖర్చులు- రెవెన్యూ వ్యయం కిందకు వస్తాయి. మారిన పరిస్థితుల్లో మరిన్ని కొత్త ప్రాధాన్యాలు ముందుకొచ్చి, బడ్జెట్లో వాటా పొందవచ్చు. వీటన్నింటినీ సమతౌల్య పరచాల్సిన బాధ్యత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీద ఉంది.
ఎగుమతులు చేసేలా..
సైన్యం ఆధునికీకరణ, నవీన ఆయుధాల రూపకల్పనపై చైనా భారీగా నిధులు వెచ్చిస్తున్న దృష్ట్యా భారత్ అప్రమత్తంగా ఉండటం అత్యావశ్యకం. 'భారత్‌లో తయారీ', 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమాల కింద అత్యాధునిక ఆయుధాలను రూపొందించాలి. సొంతంగా రూపొందించుకున్న తేజస్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, శతఘ్నుల వంటివి విదేశాలకు ఎగుమతి చేసి మార్కెట్ పెంచుకోవాలి. పూర్తిగా ఎగుమతుల కోసమే ప్రభుత్వ, ప్రైవేటు ఆయుధోత్పత్తి పరిశ్రమలను నెలకొల్పే విషయమూ పరిశీలించాలి.
సాధన సంపత్తి కోసం
అన్ని ఆధునిక ఆయుధాలనూ పూర్తిగా స్వదేశంలోనే తయారు చేయడం సాధ్యం కాకపోవచ్చు. కొన్ని అత్యాధునిక ఆయుధాల కోసం విదేశీ సహాయం పొందవలసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని ప్రభుత్వం 49 శాతం నుంచి 74 శాతానికి పెంచింది. అదే సమయంలో రక్షణ రంగంలో స్వావలంబన పథాన్ని వీడటం లేదు. కాలంచెల్లిన మిగ్ 21 విమానాల స్థానంలో తేజస్ యుద్ధవిమానాలను ప్రవేశపెట్టేందుకు వైమానిక దళం భారీ ఆర్డరు పెట్టింది. సైన్యం, నౌకా దళాల్లోనూ సొంత ఆయుధాలు, నౌకల తయారీ కొనసాగుతోంది. చైనాతో ఘర్షణల్లో పైచేయి సాధించడానికి అత్యవసరంగా కొన్ని ఆయుధాలు, సాధన సంపత్తి కోసం ఆర్డరు పెట్టాల్సి వచ్చింది.