తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రైవేట్ భాగస్వామ్యంతోనే కొవిడ్​ నియంత్రణ వ్యూహం - eenadu editorial on covid-19 virus mitigation strategy

కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అమెరికా, యూకే తరువాత భారత్​ మూడో స్థానంలో ఉంది. అయితే దేశంలో ప్రస్తుత వేగంతో టీకాల పంపిణీ కొనసాగితే ఇంకో అయిదేళ్లకుగాని గ్రామీణులు వ్యాక్సినేషన్‌ అందదు. తయారుచేసిన ఆరు నెలల్లోగా వినియోగించకపోతే కొవిడ్‌ టీకాల ప్రభావం ఉండదు. ప్రైవేటు ఆస్పత్రులకూ పంపిణీలో భాగస్వామ్యం కల్పిస్తే వ్యాక్సినేషన్‌ మరింత విస్తృతమై కొవిడ్‌ మీద పైచేయి సుసాధ్యమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

eenadu editorial on covid-19 virus mitigation strategy
ప్రైవేట్ భాగస్వామ్యంతోనే కొవిడ్​ ‌టీకా పంపిణీ వేగంగా...

By

Published : Feb 19, 2021, 6:59 AM IST

Updated : Feb 19, 2021, 9:04 AM IST

విశ్వమానవాళికి సహస్రాబ్ది సవాలు విసరిన కరోనా మహమ్మారి నియంత్రణకు ఉద్దేశించిన వ్యాక్సిన్ల వినియోగంలో మనం ఎక్కడున్నాం? గణాంకాల ప్రకారం అమెరికా, యూకేల తరవాత ఇండియాదిప్పుడు మూడో స్థానం. ఎంచిచూస్తే, మందకొడితనం ప్రస్ఫుటమవుతుంది! ఇప్పటివరకు అమెరికా సుమారు అయిదున్నర కోట్లు, యూకే 1.6కోట్లకుపైగా మోతాదులు వేయగా, వ్యాక్సినేషన్‌ మొదలై నెల్లాళ్లు దాటినా దేశీయంగా ఆ సంఖ్య రమారమి 90 లక్షలకే పరిమితమైంది. ఈ ఏడాదిలో అమెరికా 12రకాల కొవిడ్‌ వ్యాక్సిన్లను 480కోట్ల డోసుల వరకు ఉత్పత్తి చేయనుండగా, భారత్‌లో 360కోట్ల మోతాదుల దాకా సిద్ధం కానున్నట్లు అంచనా. దేశీయంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యానికి, వినియోగ స్థాయికి మధ్య ప్రస్ఫుటమవుతున్న భారీ అంతరం విధానపరంగా సత్వర చర్యల ఆవశ్యకతను చాటుతోంది. ప్రాధాన్య ప్రాతిపదికన టీకా పంపిణీ చేపట్టి ఆరోగ్య సిబ్బందికి, కరోనాపై పోరులో ముందువరస యోధులకు తొలుత వ్యాక్సిన్‌ వేసి- వచ్చే నెలలో యాభైఏళ్లు పైబడిన పౌరులకు అవకాశం కల్పించాలని కేంద్రం అంచెలవారీ కార్యాచరణ తలపెట్టింది. ప్రస్తుత వేగంతో టీకాల పంపిణీ కొనసాగితే ఇంకో అయిదేళ్లకుగాని గ్రామీణులు వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు నోచుకోరన్న విశ్లేషణలు దిమ్మెరపరుస్తున్నాయి. తయారుచేసిన ఆరు నెలల్లోగా వినియోగించకపోతే కొవిడ్‌ టీకాలు బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. ప్రాధాన్య శ్రేణుల్లోనే వ్యాక్సిన్‌ పట్ల సందేహాలూ సంకోచాలతో ముందుకు రానివారు పెద్దయెత్తున ఉండగా, సాధారణ ప్రజానీకంలోనూ ఎన్నో శంకలు ముమ్మరిస్తున్నాయి. దీర్ఘకాలికంగా అస్వస్థులైనవారూ వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చునన్న భరోసా కల్పించి, అది సామాజిక బాధ్యత అనే జనచేతన పెంపొందించాల్సిన కర్తవ్యాన్ని ప్రభుత్వాలు చురుగ్గా నిర్వర్తించాల్సిన తరుణమిది.

జాగ్రత్తలు అవసరం...

రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలో కొవిడ్‌ మళ్ళీ తిరగబెట్టిన ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. కొంతమంది రీ-ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉన్నట్లు సీసీఎంబీ (సెల్యులార్‌ మాలెక్యులార్‌ బయాలజీ కేంద్రం) తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, పోర్చుగల్‌ వంటివి లాక్‌డౌన్ల వైపు మొగ్గు చూపుతుండగా- దేశంలోనూ మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకల్లో కొత్త కేసుల జోరు హడలెత్తిస్తోంది. ముంబయి వంటిచోట్ల లాక్‌డౌన్‌ విధింపు ప్రతిపాదనలు ఆందోళనపరుస్తున్నాయి. టీకా వచ్చేసింది, ఇక ఏమీ ఫరవాలేదన్న ప్రమాదకర దిలాసాతో మాస్కులు, భౌతిక దూరాలపై జనసామాన్యంలో నిర్లక్ష్యం వ్యక్తమవుతోంది. కరోనానుంచి ప్రాణహాని లేకుండా అందరూ సురక్షితమయ్యేంతవరకు, ఏ ఒక్కరూ నిబ్బరంగా ఉండే వీల్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే చెబుతూనే ఉంది. మరికొన్నాళ్లపాటు కనీస జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యకతను తెలియజెబుతూ, టీకాలపై ప్రజానీకంలో భయాలు అపోహలు అనుమానాల నివృత్తికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కంకణబద్ధం కావాలి.

ప్రైవేటు ఆస్పత్రులకూ భాగం ఇస్తేనే...

సీరమ్‌, భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్లు రెండూ భారత్‌లోనే తయారుకావడం ప్రతి పౌరుడికీ గర్వకారణమన్న ప్రధాని మోదీ వ్యాఖ్య అక్షరసత్యం. ఆ రెంటితోపాటు మరికొన్నీ త్వరలో అందుబాటులోకి వస్తాయంటున్న కేంద్రం- ఉత్పత్తి సామర్థ్యానికి దీటైన వినియోగ ప్రణాళికతో సంసిద్ధం కావాలి. ప్రభుత్వం అంచెలవారీ పంపిణీలో వినియోగించగలిగినవి పోను, తక్కిన వ్యాక్సిన్ల మోతాదుల్ని ఎవరు కోరితే వారికి అందించే స్వేచ్ఛను ఔషధ సంస్థలకు ప్రసాదించాలి. 2013నాటి కంపెనీల చట్టం ప్రకారం, లాభాలు ఆర్జిస్తున్నవి మూడేళ్ల సగటు నికర లాభంలో కనీసం రెండుశాతాన్ని కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) పద్దుకింద వెచ్చించాలి. ఆ వ్యయాన్ని వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అనుమతిస్తే, కంపెనీలు తమ ఉద్యోగులకు టీకాలు అందించగల వీలుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య ఇప్పటికే ప్రభుత్వానికి సూచించింది. ప్రైవేటు ఆస్పత్రులకూ పంపిణీలో భాగస్వామ్యం కల్పిస్తే వ్యాక్సినేషన్‌ మరింత విస్తృతమై కొవిడ్‌ మీద పైచేయి సుసాధ్యమవుతుంది!

Last Updated : Feb 19, 2021, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details