సురక్షిత ప్రయాణాల దిశగా అందరిలో అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి ఏటా రోడ్డుభద్రతా వారోత్సవాలు (ఈ ఏడాది మే 17-23) నిర్వహిస్తోంది. మన దేశంలో ప్రమాదాలు పెచ్చుమీరి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా- రహదారి భద్రత భావన కాగితాలు దాటి రోడ్డెక్కడం లేదు. ట్రాఫిక్ నిబంధనలను సరిగ్గా పాటించలేదంటూ టంచనుగా అపరాధ రుసుములు విధించే అధికార యంత్రాంగాలు- రహదారులను ప్రమాదరహితంగా చేయడంలో మాత్రం చేతులెత్తేస్తున్నాయి. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో కేరళ ప్రభుత్వం- ప్రమాదాల నియంత్రణకు వ్యూహాత్మక ప్రణాళికలతో చట్టాన్ని రూపొందించింది. ఇతర రాష్ట్రాలేవీ ఆ మేరకు చొరవ చూపలేదు. తెలంగాణ రాష్ట్రంలో చట్టం ముసాయిదా సిద్ధమైనా అది కాగితాలు దాటలేదు. ఆంధ్రప్రదేశ్‌లో చట్టం రూపకల్పనకు సంవత్సరాల కిందట అడుగులు పడినా అవి ముందుకు సాగలేదు.
విస్తరణకు నోచుకోని ప్రయోగం
మునుపటితో పోలిస్తే ఇటీవలి కాలంలో ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్ స్పాట్స్) గుర్తింపు ప్రక్రియ కొనసాగడం కాస్తంత ఊరట కలిగించే అంశం. ప్రతి రాష్ట్రంలోనూ రహదారి భద్రతకు ప్రత్యేక నిధిని కేటాయించాలంటూ సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చేసిన సిఫార్సులు సైతం కేరళలోనే అమలవుతున్నాయి. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు తక్షణ వైద్య సదుపాయాలు అందించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో కొన్ని ఆస్పత్రులను 'ట్రామాకేర్' కేంద్రాలుగా గుర్తించారు. బాధితులను సాధ్యమైనంత వేగంగా ఆస్పత్రులకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తొలి గంటను వైద్య పరిభాషలో 'స్వర్ణ సమయం'గా వ్యవహరిస్తారు. ఆలోపు బాధితులకు సరైన ప్రాథమిక వైద్యం అందితే- ప్రాణాలు కాపాడే అవకాశాలు అధికంగా ఉంటాయి.
అడుగు ముందుకు పడలేదు..
తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ నగర శివారు పరిసరాల్లో 'యాక్టివ్ బ్లీడ్ కంట్రోల్ (ఏబీసీ)' పేరిట 108 సంస్థ చేసిన ప్రయోగం ఫలితాన్ని ఇచ్చింది. హైదరాబాద్ శివార్లలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్న ప్రాంతాల్లో సేవాభావం ఉన్న యువకులు, ఆటో డ్రైవర్లు తదితరులను గుర్తించి, వారికి అత్యవసర ప్రాథమిక వైద్యంలో ఈ సంస్థ శిక్షణ ఇచ్చింది. వైద్య కిట్లనూ అందజేసింది. 108కి ప్రమాద సమాచారం రాగానే ఆ ప్రాంతానికి వాహనం పంపడంతోపాటు ఆ పరిసరాల్లో సుశిక్షితులైన ఔత్సాహికులకూ సమాచారం వెళుతుంది. వారు తక్షణం అక్కడికి చేరుకుని బాధితులకు వైద్య సేవలు అందించడం ద్వారా ప్రాణాలకు ముప్పు తప్పుతోంది. కొన్ని సందర్భాల్లో వైద్య కిట్లను డ్రోన్ల ద్వారా నిర్దేశిత ప్రాంతాలకు పంపుతున్నారు. ఈ ప్రయోగాన్ని మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినా అడుగు ముందుకు పడలేదు.
ఆమడ దూరంలోనే..
రాష్ట్రాలు బడ్జెట్ రూపకల్పన సమయంలో రహదారి భద్రతకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్న సిఫార్సులు ఆచరణకు ఆమడ దూరంలోనే ఉంటున్నాయి. అపరాధ రుసుముగా వాహనదారుల నుంచి వసూలు చేస్తున్న సొమ్ము నుంచి కొంత మొత్తాన్నయినా రహదారి భద్రతకు కేటాయిస్తే ప్రభుత్వంపై కొంత భారం తగ్గుతుంది. జిల్లా స్థాయిలోని రహదారి భద్రతా కమిటీలు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నాయి కానీ, ప్రత్యేకించి నిధులు లేకపోవటంతో రహదారులు-భవనాల శాఖ కేటాయింపులే శరణ్యమవుతున్నాయి. ఆ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ప్రాంతాల్లో మాత్రమే ప్రమాద సూచికలు, జనావాసాల వద్ద వేగ నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు అవుతున్నాయి. ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద కొంత ప్రత్యేక నిధి ఉంటుంది. అందులో నుంచి కొంత మొత్తాన్ని రహదారి భద్రతకు వెచ్చించవచ్చు.
తెలుగు రాష్ట్రాలకు దక్కని అవకాశం